సాక్షి, విజయవాడ: అఖిలపక్షం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అఖిల పక్షం ఏర్పాటు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పైగా విపక్షాలు హాజరు కాలేదని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం విషయంలో అఖిలపక్షాన్ని పిలిచారా అని నిలదీశారు. టీడీపీ నేతలు భూములు కొనుకున్న చోటునే చంద్రబాబు రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. ఎవరి సలహాలు తీసుకోకుండా రాష్ట్రాన్ని చీకటిమయం చేశారని మండిపడ్డారు.
వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో లాలుచీ పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలు చీదరించుకుంటారనే అఖిలపక్షం ఏర్పాటు పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రజలను వంచన చేశాయని తెలిపారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను అందరు గమనిస్తున్నారని.. అందుకే ప్రజాపక్షాలు చంద్రబాబు అఖిలపక్షాన్ని బహిష్కరించాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment