సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలు, ప్రజాసంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు కోవిడ్ వేళ ప్రజలకు శ్రీరామరక్షగా నిలిచాయని రవాణా, సమాచారశాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరాలేరన్నారు. రెండేళ్ల పరిపాలన పూర్తికాకముందే మేనిఫెస్టోలోని 129లో 107 (94.5 శాతం) వాగ్దానాలను నెరవేర్చినట్లు చెప్పారు. ఈ రెండేళ్లలో రూ.1.25 లక్షల కోట్లను అవినీతికి తావులేకుండా ప్రజలకు నేరుగా అందించామని తెలిపారు. ఆర్థిక, సామాజిక విప్లవానికి, మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. విద్యా, వైద్య వ్యవస్థల్లో మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. గడిచిన 60 సంవత్సరాల్లో రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే 16 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు. మూడేళ్లలో సీబీఎస్‌సీ విధానాన్ని తీసుకురాబోతున్నారని చెప్పారు.
చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
రెండేళ్ల జగన్ సుభిక్షమైన పరిపాలనపై ప్రజల్లో చర్చ జరగకూడదనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అవలంభిస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం చేయలేనిది, 40 ఏళ్ల యువ నాయకుడు సీఎం జగన్ చేస్తుంటే చంద్రబాబు, లోకేశ్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు హయాంలో కోవిడ్ వచ్చి ఉంటే చందాలకు రెడీ అయి ఉండేవారని ఎద్దేవా చేశారు. అమూల్ బలపడితే హెరిటేజ్ లాంటి సంస్థలు దివాళాతీస్తాయన్నదే చంద్రబాబు, లోకేశ్‌ల భయమన్నారు. ధూళిపాళ్ల నరేంద్రను సంగం డెయిరీ చైర్మన్ పదవినుంచి గతంలో రాజీనామా చేయమని చెప్పింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. టీడీపీ నేత బీసీ జనార్దనరెడ్డి దళితులపై దాడులు చేస్తే కేసు పెట్టొద్దా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment