విజయవాడ సిటీ : అఖిలపక్షం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా అఖిల పక్షం ఊసే ఎత్తని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను వంచించేందుకు మరోసారి సిద్ధమయ్యారన్నారు. పైగా విపక్షాలు హాజరుకాలేదని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు వెలివేస్తారనే భయంతో చంద్రబాబు అఖిలపక్షం అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షంలో పక్షులు ఎగిరిపోయి, గరుడ పక్షులు మాత్రమే మిగిలాయని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా ఒక్కసారి కూడా అఖిలపక్షం పెట్టని చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం చేపట్టిన తర్వాత రాజధానిని ఎక్కడ నిర్మిస్తే సముచితంగా ఉంటుందనే సలహాలు, సూచనలు అఖిలçపక్షాన్ని ఏర్పాటు చేసి అడిగారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన వంది మాగధులు కలిసి భూములను కొనుగోలు చేసి వ్యాపారం చేసుకున్నారన్నారు. అమరావతి పేరు పెట్టే విషయంలో కూడా విపక్షాన్ని అడగలేదని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అన్యాయం చేస్తుంటే ఇంతకాలం అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ ఏపీ ప్రజలను వంచించిన పార్టీలని, అవి బంద్‌కు మద్దతు తెలిపినా.. వాటితో వైఎస్సార్‌సీపీ కలిసి పనిచేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment