- అసలు చంద్రబాబు ఎందుకంత పులకరించిపోతున్నారు?
- కోర్టు తీర్పులు తేలే వరకు విజయమ్మ పేరుతో ఎంవోయూ రాసుకున్నారు
- 2019 నుండి 2024 వరకు ఏ కంపెనీలోనూ డైరెక్టర్లను మార్చకుండా షర్మిల సైలెంట్‌గా ఉన్నారు
- ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయన చెప్పినట్టు షర్మిల చేస్తోంది
- ఈడీ కేసుల్లో జగన్‌కు బెయిల్ ఉన్నందున దాన్ని క్యాన్సిల్ చేయించడానికి ఈ డ్రామా ఆడుతున్నారు
- షర్మిల లాంటి చెల్లెలు ఉంటే ఏ అన్నకైనా సమస్యలు తప్పవు
- మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ వ్యవహారంపై వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియా, కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు.
హత్యలు,అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని పేర్ని నాని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పేర్ని నాని ఏమన్నారంటే..
మూడ్రోజులుగా హైడ్రామా:
గత మూడు రోజుల నుంచి పచ్చ మీడియా నానా హంగామా చేస్తోంది. రాష్ట్రం తలకిందులైపోతుంది అని ప్రచారం చేస్తోంది. ఇది టీడీపీ అంటే పడిచచ్చే ఛానల్స్ కాకుండా, టీడీపీకి ఊడిగం చేస్తున్న పేపర్లు కాకుండా, టీడీపీ అఫీషియల్ ట్విట్టర్‌లో బాగా ప్రచారం చేశారు. ఇది ఏ పేపర్, ఛానల్ చేస్తే వేరు. కానీ పార్టీ ట్విట్టర్ వేదికగా చేయడం ఆశ్చర్యకరం.
రాష్ట్రంలో రోజూ ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా, టీడీపీకి పట్టదు. ట్విట్టర్‌లో అసలు ప్రస్తావించరు.
కానీ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అంటూ నానా హంగామా చేసి, ప్రచారం చేశాక, వారు బయట పెట్టిందేమిటంటే..
జగన్‌గారు, తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని. ఆ తర్వాత ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా కధలు వండి వార్చారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ, కధనాలు రాశారు. దుర్మార్గమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జగన్‌గారిపై ప్రజల్లో ఉన్న యశస్సుని మసక బారేలా చేయాలి. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక పోతున్నాం కాబట్టి, ఇలా వ్యక్తిత్వ హననం చేయాలన్న ప్రయత్నం.
అవన్నీ జగన్‌గారి స్వార్జితం:
వైఎస్సార్ మరణించక ముందే పిల్లలకు ఆస్తులు పంచారు. జగన్‌కి ఇచ్చేవి ఆయనకు ఇచ్చారు. షర్మిలకి ఇచ్చేవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్ వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత, ఆ ఆదాయాల ద్వారా వ్యాపారాలు పెంచుకుంటూ పోయారు. భారతి సిమెంట్స్, సాక్షి మీడియా గ్రూప్, పల్నాడు జిల్లా గురజాలలో సరస్వతి పవర్ కంపెనీ.. ఇవన్నీ జగన్ స్వార్జితం.ఎవరికైనా అనుమానాలు ఉంటే, రికార్డులు చూసుకోవచ్చు. 2009 నుంచి ఆయన అఫిడవిట్స్ కానీ, ఐటీ రిటర్న్‌ల్లో కూడా చూడొచ్చు. అన్నీ ఆన్ రికార్డ్. సరస్వతి పవర్ ప్రాజెక్టు ల్యాండ్ గవర్నమెంట్ లీజ్ భూమి కాదు. కానీ దీనిపై ఒక టీడీపీ నాయకుడు అసత్యాలు చెబుతున్నారు. అది రైతుల నుంచి కొనుక్కున్న భూమి.
అక్రమ కేసులతో అటాచ్‌మెంట్
ఘెస్సార్ మరణం తర్వాత, జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, చంద్రబాబు.. కాంగ్రెస్ నాయకులు కూడబలుక్కుని జగన్‌గారిపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. ఆయనపై సీబీఐ దాడులు కూడా చేయించారు. ఆయన ఆస్తులను కూడా సీబీఐ, ఈడీ ద్వారా అటాచ్ చేయించారు. 2011 నుంచి 2016 వరకు ఆయనకు నరకం చూపించారు. ఆ పనుల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసు.
35 ఏళ్ల యువకుడిని ఎదుర్కోవడానికి సోనియా, చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో అందరికీ తెలుసు. 2019లో ఆయన గెల్చారు.
జగన్‌కు ఆస్తిపై మక్కువ ఉండి ఉంటే..
ఇందాక షర్మిల అంటున్నారు. అది మా అన్న స్వార్జితం కాదు అని.. మరొకరు అంటారు.. జగన్‌కి ఆస్తి అంటే పిచ్చి అని.
అదే నిజమైతే, ఆయన తన ఆస్తులను తల్లి, చెల్లికి ఎందుకు రాసిచ్చారు? ఆయన ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అధికారంలో ఉన్నా, తన చెల్లి మీద ఉన్న ప్రేమతో ఆస్తులు రాసిచ్చారు. నిజంగా ఆయనకు ప్రేమ లేకపోతే, బాధ్యత లేకపోతే ఆస్తులు ఎందుకు ఇస్తారు? తండ్రి చనిపోయిన ఇన్నేళ్లకు, ఆమె పెళ్లి తర్వాత ఇన్నేళ్లకు ఇలా ఎవరైనా ఆస్తులు పంచుతారా?
అసలు చంద్రబాబు తన ఆస్తులు ఎవరికైనా పంచారా? ఆయనకున్న ఆస్తులు విలువ ఎంత? ప్రభుత్వ ధరల ప్రకారమే, ఆయన అఫిడవిట్ ప్రకారమే రూ.1400 కోట్ల ఆస్తి. మరి ఆ ఆస్తిలో చంద్రబాబు తన అక్కచెల్లెమ్మలు, తమ్ముడికి ఏమైనా రాసిచ్చాడా?
స్వార్జితం అయినా వాటా ఇస్తామన్నారు
జగన్ ఆస్తులన్నీ కూడా.. చంద్రబాబు, సోనియా కుట్రల వల్ల తప్పుడు కేసులతో సీబీఐ, ఈడీ అటాచ్‌లో ఉన్నాయి కాబట్టి.. నేరుగా బదిలీ కాకుండా ఎంఓయూ రాశారు.
భారతి సిమెంట్స్‌లో 40 శాతం వాటా గిఫ్ట్ ఇస్తున్నట్లు రాశారు. ఆయనకు నిజంగా డబ్బుపై మమకారం ఉంటే, ఇలా ఆస్తి తన చెల్లికి రాసిస్తారా? చంద్రబాబు తన తమ్ముడికి, అక్కకి ఒక్కటంటే ఒక్క ఆస్తి అయినా రాశారా? సరస్వతి పవర్ ప్రాజెక్ట్, క్యారమిల్.. వీటన్నింటిలో వాటా ఇస్తూ, ఈడీ అటాచ్ అయిపోగానే, తన చెల్లికి ఇవన్నీ ఇస్తానంటూ.. రాసిచ్చారు. అలాగే సరస్వతి పవర్లో తన అమ్మగారికి కూడా వాటా రాశారు. ఈడీ కేసు అయిపోయిన తర్వాత, ఆ ఆస్తులు దఖలు చేసేలా రాసిచ్చారు.
హైకోర్ట్ స్టేటస్‌కో ఆర్డర్
వాస్తవాలు ఇలా ఉంటే.. ఇందాక షర్మిలగారు మాట్లాడుతున్నారు. ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్ ఏమీ లేదని. కానీ వాస్తవం ఏమిటంటే..
2019లో ఈడీ అప్పిలేట్ అథారిటీలో జగన్‌గారికి అనుకూలంగా తీర్పు ఇస్తే, వారు హైకోర్టులో మూవ్ చేస్తే.. అదే ఏడాది చివర్లో స్టేటస్‌కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అలాగే కొనసాగాలని. కానీ, దీనిపై షర్మిలగారు హైకోర్టు ఆదేశం లేదని అబద్ధం చెబుతున్నారు.
ఆ తగాదాతో చంద్రబాబుకు ఏ సంబంధం?
ఇంకా ఆమె ఏమంటున్నారు? అమ్మను బజారుకీడ్చారని, కోర్టుకు లాగారు. ఈ ఆస్తుల పంపకం బజార్లో పెట్టుకోవడం అవసరమా? అంటారు. ఇక చంద్రబాబు ఏమన్నారు. దేశంలోనే తొలిసారిగా సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్టు కొడుకు. ఇలాంటి వారితోనా తాను రాజకీయం చేయాలి.. అంటున్నారు.
నిజానికి ఇలాంటి దిక్కుమాలిన, దగుల్బాజీ పార్టీతో జగన్ రాజకీయాలు చేయడం శాపం కాదా? జగన్ ఇంట్లో ఆస్తుల తగాదా అయితే, మీకేమిటి సంబరం? ఇది రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు ఏం సమస్య? చంద్రబాబుకు ఈ పులకరింత ఎందుకు? పతిత కధలు చెబుతున్నావు. ఎదుటి వారి ఇంట్లో ఆస్తుల తగాదా వస్తే. నీకేమిటి?
ఈ తగాదా వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయా? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా? ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా?
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ..
ఆ ఎంఓయూ ప్రకారం.. విజయమ్మ గారికి ఏం రాసిచ్చారంటే.. కోర్టులో అటాచ్‌మెంట్ వ్యవహారం తేలాక, ఆస్తుల బదలాయింపు ఉంటుందని. అంతవరకు సరస్వతి పవర్‌లో 2 శాతం వాటా విజయమ్మగారి పేరుమీదే ఉండగా, మరో 48 శాతం విజయమ్మగారి పేరు మీద బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ, అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్.. తెల్లకాగితం మీద రాసి, విజయమ్మగారి దగ్గర పెట్టడం జరిగింది.
అయితే షేర్ సర్టిఫికెట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, కొత్త షేర్ల కాపీలు తీసుకుని, వాటిని విజయమ్మగారి పేరుమీద బదిలీ చేసి, కంపెనీలో బోర్డు డైరెక్టర్లను మార్చేశారు. అలా హైకోర్టు ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు.
చంద్రబాబు కుట్ర. డెరెక్షన్
ఇదంతా చంద్రబాబునాయుడు నుంచి డైరెక్షన్ వచ్చాకే జరిగింది. ఆయన నుంచి డైరెక్షన్ వచ్చింది. మీరు మూవ్ అయ్యారు. జగన్‌గారి బెయిల్ రద్దు కావాలంటే.. ఏ కేసులో అయితే, ఆయన బెయిల్ మీద బయట ఉన్నారో.. ఆ కేసులో సాక్షులను బెదిరించినా.. బెయిల్ రద్దు అవుతుంది. అయితే ఆయన ఆ పని చేయడం లేదు. మరి ఆయన ఎలా దొరుకుతాడు.. అని ఆలోచించి, పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసినా, జగన్‌గారు బెయిల్ కండిషన్‌ను బేఖాతరు చేసి, షేర్లు బదిలీ చేశారని చూపుతూ.. జగన్‌గారి బెయిల్ రద్దు చేయించాలన్న కుట్రతో ఎవరితోనో ఒకరితో ఫిర్యాదు చేయించి, ఆ పని చేయాలని చూశారు.
ఆయనకున్న ప్రత్యామ్నాయం ఏమిటి?
మరి జగన్ ఈ పరిస్థితిలో ఏం చేయాలి?. ఆయనకు అమ్మ అన్నా, చెల్లి అన్నా ప్రేమ. కానీ వారు శత్రువులచేతుల్లోకి పోయి, తన బెయిల్ రద్దు చేసే ప్రయత్నం చేస్తే.. ఆయన ఏం చేస్తారు? చెప్పండి.
ఎమ్మెల్యే అయి, మంత్రి అయినా చంద్రబాబుకు ఎవరూ పిల్లను ఇవ్వలేదు. కానీ రామారావుగారు ఇచ్చారు. కానీ ఆయనకే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు.
అలాంటి చంద్రబాబుతో మీరు కలిసి కుట్ర చేసి, తన బెయిల్ రద్దు చేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో, ఆయన మాత్రం ఏం చేస్తారు? అందుకే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు అప్పీల్ చేశారు. చంద్రబాబు కుట్రలో భాగస్వాములై, ఆయన్ను తిరిగి జైలుకు పంపే యత్నం చేస్తుంటే, తాను ఏం చేస్తాడు?
ఏనాడైనా నోరు మెదిపారా?
రాష్ట్రంలో రోజూ అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే, ఒక్కనాడు మీరు నోరు మెదపలేదు. జగన్‌గారు ఓడిపోయారు. ఎలా అనేది వేరే విషయం. అయినా ఆయనపై ఎందుకంత కక్ష.
ఎక్కడైనా అధికారపార్టీపై విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఒక అధికార పార్టీ నాయకుడు, ప్రతిపక్షం నాయకురాలని పొగుడుతున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా?
చంద్రబాబు చేస్తున్న దగుల్బాజీ రాజకీయం, కుటుంబంలో తగాదాను అడ్డు పెట్టుకుని చేస్తున్న కుట్రకు బలి కాకుండా.. చంద్రబాబు చేతిలో పావుగా మారిన చెల్లెమ్మ కోసం.. అంత కంటే ఏం చేస్తారు?
అందుకే ఎన్‌సీఎల్‌టీకి అర్జీ పెట్టారు.
ప్రేమ లేకపోతే ఆస్తులు రాసిస్తారా?:
అటాచ్‌మెంట్ రిలీజ్ కాగానే, ఆయన కచ్చితంగా షేర్లు బదలాయిస్తారు. మీకూ తెలుసు. జగన్‌గారిపై పెట్టిన కేసులేవీ నిల్చేవి కావని. అందుకే కదా, మీరు ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ప్రతి పేపర్‌మీద సంతకాలు పెట్టారు.
భారతి సిమెంట్స్‌లో, సాక్షి గ్రూప్‌లో 40 శాతం చొప్పున, పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టులో 100 శాతం వాటాకు ఒప్పుకుని, ఎంఓయూ రాసుకుని ఒప్పుకున్నారు కదా. అన్నకు నీ మీద ప్రేమ లేకపోతే, అలా ఆస్తులు ఇస్తానని రాసిస్తాడా?
ఎందుకంటే అవన్నీ ఆయన స్వార్జితం. ఆయనకు నిజంగా డబ్బు పిచ్చి ఉంటే, అలా ఆస్తులు ఇస్తానని రాసిస్తాడా? ప్రతి పేజీలో ఇద్దరూ సంతకాలు పెట్టారు కదా? ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్ కదా?
భూముల కబ్జాపై చంద్రబాబు కుట్ర
ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు పతిత కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబుకు వయసొచ్చింది. కానీ నైతికత లేదు. సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తే.. 2014–19 మధ్య, చంద్రబాబు స్వయంగా గురజాల ఎమ్మెల్యే ద్వారా రౌడీలను పంపించి, ఆ భూములు కబ్జా చేసే ప్రయత్నం చేశారా? లేదా?.
ఇవాళ షర్మిలగారు చాలా మంచి అమ్మాయి అంటున్నావు కదా? మరి ఆరోజు ఆమె ఆస్తిని కబ్జా చేసేందుకు మీరు ప్రయత్నించారు. దాన్ని మాచర్ల ఎమ్మెల్యే ద్వారా జగన్‌గారు అడ్డుకున్నారు. ఇవాళ అందరూ ఉన్నారు. అన్నీ అందరికీ తెలుసు.
అన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి, ఇప్పుడు కూడా అదే చేస్తున్న చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. కానీ, అవి షర్మిలమ్మకు అర్ధం కావడం లేదు. ఆయన్నే నమ్ముతున్నారు.
శవ రాజకీయాలు చేసింది ఎవరు?
ఇవాళ పేపర్ చూస్తే.. రోజూ అమ్మాయిలపై హత్యలు. అత్యాచారాలు. పరిస్థితి దారుణం. వాటి నుంచి డైవర్షన్ కోసమే కదా? ఇవన్నీ చేస్తోంది?
మీరు అధికారంలోకి వచ్చాక, కనీసం ఒక్క కుటుంబాన్ని ఓదార్చారా? అమ్మాయిని కోల్పోయిన వారిని పరామర్శించారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పనిగా వెళ్లారు కదా? ప్రభుత్వంతో వేధింపులకు గురవుతున్నారు చాలా మంది. మరి వారిని ఓదార్చేది ఎవరు? అందుకే జగన్‌గారు వెళ్తున్నారు. వారికి కలుస్తున్నారు. జగన్‌గారు శవాల దగ్గరకు వెళ్తున్నారని విమర్శిస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా?
మీరు అధికారంలో లేకపోతే, ప్రభుత్వం డబ్బు ఇస్తే, డబ్బుతో ప్రాణాలు వస్తాయా? అంటారు. అదే ఇప్పుడు జగన్‌గారు ఇస్తుంటే కూడా తప్పు బడుతున్నారు. అసలు మీ వంటి వారితో రాజకీయాలు చేయాలంటే నిజంగా సిగ్గు వేస్తోంది.
ఆనాడు చంద్రబాబు ఏం చేశారు?
అన్నను తిట్టొద్దంటూ రామ్మూర్తినాయుడికి అమ్మ అమ్మణమ్మ ద్వారా చెప్పించే ప్రయత్నం’.. అంటూ వార్త కథనాన్ని చూపిన పేర్నినాని, ఆ అంశాన్ని వివరించారు.
తన ఉనికి కోసం కాంగ్రెస్‌లో చేరిన నారా రామ్మూర్తినాయుడు, తన అన్న చంద్రబాబుపై అదేపనిగా విమర్శలు చేయడం, చాలా నష్టం కలిగిస్తోంది కాబట్టి, అమ్మ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారని.. ఆ వార్త.
ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగింది. ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అయినా కాంగ్రెస్‌లో చేరి, చంద్రబాబును తిట్టారు. ఎందుకు తిట్టారు?
మరి ఆయనకేమైనా చంద్రబాబు ఆస్తులు పంచారా? కనీసం అక్క చెల్లెమ్మలకు అయినా ఆస్తులు పంచారా? అదే జగన్‌గారు, తన తండ్రి చెల్లికి ఆస్తులు పంచినా, తన స్వార్జితంలో కూడా, తండ్రి చనిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా, ఆస్తులు పంచి ఇస్తున్నట్లు రాసిచ్చారు. చంద్రబాబు నీ జీవితంలో ఎప్పుడైనా, ఎవరికైనా అలా రాసిచ్చావా?.
హైదరాబాద్‌లో 5 ఎకరాల ఫామ్‌హౌజ్‌ను చంద్రబాబు అమ్మ అమ్మణమ్మ, తన మనవడు నారా లోకేష్‌కు ఎలా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఆమెకు అంత మంది మనవళ్లు, మనవరాళ్లు ఉంటే, కేవలం చంద్రబాబు కొడుక్కే ఎందుకు ఆ ఆస్తి గిఫ్ట్‌డీడ్‌గా ఇచ్చింది?.
ఆ ఆస్తి వద్దని తల్లికి ఎందుకు చెప్పలేదు? కనీసం ఇప్పుడైనా ఆ ఆస్తి తమకు వద్దని చంద్రబాబు కొడుక్కి చెప్పొచ్చు కదా?
ఇది కుట్ర కాక మరేమిటి?
ఇది జగన్ బెయిల్ రద్దు కోసం చేసిన కుట్ర కాక, మరేమిటి? షేర్లు బదలాయించడం, కంపెనీ డైరెక్టర్లను మార్చడం. వీటిలో దోషి ఎవరు? అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు. వాటిపై స్టేటస్‌కో కొనసాగించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా, అలా బదలాయింపు చేయడం ఎంత వరకు కరెక్ట్?.
కావాలంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు చూడొచ్చు.
కాగితం మీద రాసిచ్చిన వాడు, నిజంగా ఆస్తి ఇవ్వడా? అయినా ఎందుకు బదలాయించుకున్నారు? ఇది కుట్ర కాక మరేమిటి?.
చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు
నెల్లూరులో ఒక గజనీ మహ్మద్ ఉన్నారు. ఆయన ఓడి ఓడి మొన్న గెల్చాడు. ఏదో సినిమా బిట్ చూపి, జగన్‌గారిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడాలంటే, మన తెలుగు సినిమాల్లో ఏ విలన్‌ను చూసినా కనిపించేది చంద్రబాబే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. మరి చేతలు మాత్రం శూన్యం.
జగన్.. ఎన్టీఆర్‌లా కాదు
.జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్నికించపర్చాలని, నాశనం చేయాలని, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, మీరిచ్చిన హామీలు అమలు చేయలేక, జగన్‌కి ఇంకా పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ఆయన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న కుట్రతో, ఆయన బెయిల్ రద్దు చేయించాలన్న మీ ప్రయత్నం నెరవేరదు. ఎందుకంటే, మీ కుట్రలు, కుతంత్రాలకు బలవ్వడానికి ఆయన ఎన్టీఆర్ కాదు.
హోం మంత్రి అనిత ఒక గురువింద గింజ మాదిరిగా మాట్లాడుతున్నారు. అనిత మాదిరిగా జగన్‌పై చెక్ బౌన్స్ కేసు లేదు కదా?
చెల్లెలు ఇలా వ్యవహరిస్తే ఎవరికైనా బాధలే
చెల్లెలు ఇలా వ్యవహరిస్తే జగన్‌కే కాదు, చంద్రబాబుకీ బాధ తప్పదు. తన పేరుమీద ఉన్న ఆస్తులు మొత్తం.. అవన్నీ ఆయన స్వార్జితం. ఇది ఆన్ రికార్డ్. జగన్ స్వయంగా సంతకం పెట్టారు. ఆస్తి ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఇది కుటుంబ వ్యవహారం. నాలుగు గోడల మధ్య జరిగిన విషయం. మరి ఇవాళ అది బజార్‌లోకి తెచ్చింది ఎవరు? అలా పెట్టింది ఎవరు? అలా బజార్లో పెట్టిన వాళ్లే.. విమర్శలు చేస్తే ఎలా?. నింద వేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ప్రజలకు చెబుతున్నామని పేర్నినాని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment