సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై నేడు జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పంపిన ఆహ్వానాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తిరస్కరించారు. ఏక కాలంలో ఎన్నికలతో పాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే జమిలి ఎన్నికల అంశం బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన విషయమని.. ఈ సమావేశానికి తాము హాజరుకాక పోవడమే మంచిదని విపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ తరఫున ప్రతినిధిని మాత్రం పంపుతామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ తరఫున ఎంపీ రాఘవ్ చందా ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ భేటీకి టీడీపీ పూర్తిగా గైర్హాజరు కానుంది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ఆహ్వానాన్ని తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సోనియా గాంధీ అధ్యక్షతన యూపీఏ పక్షాలు భేటీ అయ్యాయి. అయితే తృణమూల్, డీఎంకే బాటనే కాంగ్రెస్‌తో మిగతా పార్టీలు కూడా అనుసరించే అవకాశం ఉంది. కాగా తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండగా, ఏపీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment