విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి: సురవరం | Bifurcation is inevitable, says suravaram sudhakar reddy | Sakshi
Sakshi News home page

విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి: సురవరం

Published Fri, Oct 11 2013 2:37 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి: సురవరం - Sakshi

విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి: సురవరం

telangana, state bifurcation, suravaram sudhakar reddy, తెలంగాణ, రాష్ట్ర విభజన, సురవరం సుధాకర్ రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన అనివార్యం.. అర్థం చేసుకోండి.. ఆందోళన విరమించండి’’ అని సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ సీమాంధ్ర ప్రజలకు పిలుపుఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి బాగా దిగజారిందని, తెలంగాణ ఉద్యమం ఆగితే సీమాంధ్ర ఉద్యమం పెరిగిందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో అనేక అనుమానాలు, అపోహలున్న మాట నిజమేనని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. పార్టీ నేతలు గుండా మల్లేష్, పీజే చంద్రశేఖర్, కె.రామకృష్ణ, జల్లి విల్సన్, చాడా వెంకటరెడ్డితో కలిసి వారు గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సురవరం మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో వామపక్షాలు నిర్వహించబోయే పాత్రను వివరించారు. ఎన్నికల తర్వాతే పొత్తుల గురించి మాట్లాడతామన్నారు. విధానాల ప్రాతిపదికన ప్రత్యామ్నాయంకోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయం పేరిట బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందన్నారు. మోడీని తెరపైకి తెచ్చాక మతకలహాలు పెరుగుతున్నాయన్నారు. చంద్రబాబు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్టు తమకూ సమాచారం ఉందని, అదే జరిగితే లౌకికవాదానికి ద్రోహం చేసినట్టేనన్నారు.
 
 నేతలకు గుణపాఠం సీమాంధ్ర ఉద్యమం: నారాయణ
 రాజకీయ నేతలను దగ్గరకు రానివ్వకుండా నిలువరించి సీమాంధ్ర ఉద్యమకారులు మంచి గుణపాఠం నేర్పారని నారాయణ అభిప్రాయపడ్డారు. నేతలపై విశ్వాసం కోల్పోయిన ఫలితమే ఈ పరిస్థితని విశ్లేషించారు. సీమాంధ్ర సమస్యల్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యమకారులు విజయవంతమయ్యారన్నారు. ఇకపై జరగాల్సిన ప్రక్రియను రాజకీయ పార్టీలకు అప్పగించాలని కోరారు. ఇప్పటికైనా రాజకీయపార్టీలు అవకాశవాద వైఖరిని విడనాడాలని సూచించారు. పదిమంది మంత్రుల కమిటీ అని ఏడుగురితోనే ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. మంత్రుల కమిటీ ఆరు వారాల్లోపు నివేదిక ఇస్తుందన్నారని, ఇప్పుడా గడువును ఎందుకు ఎత్తివేశారో చెప్పాలని నిలదీశారు. 2014 ఎన్నికలదాకా ఈ సమస్యను సాగదీయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలని తమ పార్టీ అందరికంటే ముందే ప్రధానికి లేఖ రాసిందని చెప్పారు. కాంగ్రెస్ నాటకంలో రాష్ట్ర ప్రజలు సమిధలవుతున్నారని ధ్వజమెత్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement