'పునరేకీకరణతోనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి'
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ ద్వారానే దేశంలో కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనే శక్తిమంతమైన ప్రత్యామ్నాయం అవతరిస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే పార్టీగా ఉండాలని ఆకాక్షించారు. కాగా, సీపీఐ మిగిలిన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఐక్య పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.
ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చిలో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానంలోనూ కమ్యూనిస్టుల పునరేకీకరణ ప్రాధాన్యంపై చర్చిస్తామని సురవరం తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని విమర్శించారు. నల్లధనం దేశానికి రప్పిస్తే ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షలు అందుబాటులోకి వస్తాయని చెప్పి, గత ప్రభుత్వం లాగే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూనే.. ఆయుధాలు తయారు చేయవద్దని, వాటిని తామే సరఫరా చేస్తామన్న అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి సాగిలపడుతోందని సురవరం ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సే విగ్రహాలను దేశమంతా పెడతామని ప్రకటనలు చేస్తుంటే దానిపై ప్రధాని, బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. గాంధీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా గాంధీ జయంతి రోజును మత సామరస్య- జాతీయ సమైక్య దినంగా జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాం ప్రభుత్వ పాలన పాఠ్యాం శంగా చేర్చాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అప్పటి పాలనలో పోరాటాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించే తీరు కూడా వాటిలో చేర్చాలని సూచించారు.
అంత మోజుంటే ప్రభుత్వాన్ని సింగపూర్‌కే లీజుకివ్వొచ్చుగా :
చంద్రబాబు తీరుపై నారాయణ మండిపాటు
ప్రతిదానికి సింగపూర్, జపాన్ గురించే మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అంతగా మోజుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగపూర్‌కే లీజుకివ్వొచ్చుగా అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సలహా ఇచ్చారు. ప్రభుత్వాన్ని లీజుకిస్తే ఇక్కడా వాళ్లే పాలన చేస్తారుగా అని ఎద్దేవా చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుంటే చంద్రబాబు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు.