విద్యా వ్యవస్థలో స్మగ్లర్లు, మాఫియా లీడర్లు
విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు ఉద్యమించాలి
ఏఐఎస్‌ఎఫ్ సదస్సులో సీపీఐ నేత నారాయణ
తిరుపతి కల్చరల్: విద్యా వ్యవస్థలోకి స్లగ్లర్లు, మాఫియా లీడర్లు, రాజకీయ నాయకులు ప్రవేశించి భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. ఎస్వీయూలో జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ 80వ వార్షికోత్సవం రెండో రోజు గురువారం విద్యారంగంలో కాషాయీకరణ-సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సును నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యారంగాన్ని పరిరక్షించుకునేందుకు విద్యార్థులు ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఏఐఎస్‌ఎఫ్‌కు ఉందన్నారు. నేడు దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, అవి పరిష్కారం కావాలంటే వామపక్ష ఉద్యమం బలోపేతం కావాలని అన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ వీసీ విభూది నారాయణరాయ్ మాట్లాడుతూ పాఠ్యాంశాలను వక్రీకరించి విద్యార్థులకు బోధించడమంటే చరిత్రను హత్య చేసినట్లేనని స్పష్టం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకువచ్చి వారికి అనుకూలంగా చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, దీన్ని విద్యార్థి లోకం ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులు మతోన్మాదం వైపు విద్యావ్యవస్థను లాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముస్లిం, మైనారిటీ, మహిళలు, దళితుల వ్యతిరేక భావాలను పాఠ్యాంశాల్లో చొప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థుల మనస్సులో హిందుత్వ భావజాలం ఎక్కించి వారివైపు తిప్పుకునే కుట్ర చేస్తున్నారన్నారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ 80వ వార్షికోత్సవ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లా ఖాదరి, విశ్వజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.