ఖమ్మం నుంచి నారాయణ పోటీ
సాక్షి, హైదరాబాద్: సీపీఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ సిఫార్సుల మేరకు నారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు సీపీఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న నారాయణ నామినేషన్ వేయనున్నారు. తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడం ఖాయమని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వాస్తవానికి పొత్తులో భాగంగా.. ఖమ్మం, నల్లగొండ లోక్‌సభ సీట్లను సీపీఐ కోరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని మాత్రమే కేటాయించింది. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును పోటీ చేయించాలని సీపీఐ భావించింది. అయితే, ఖమ్మం అసెంబ్లీ సీటును పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు అజయ్ కుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.
తండ్రీ కుమారులిద్దరూ ఒకే లోక్‌సభ స్థానం పరిధిలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తే.. ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీపీఐని హెచ్చరించింది. దీంతో సీపీఐ తన అభ్యర్థిని మార్చుకోవాల్సి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో నారాయణను ఎలాగూ ఢిల్లీకి తీసుకువెళ్లాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఆయన పేరును ఖమ్మం స్థానానికి ఖరారు చేసింది.