Khammam lok sabha seat
-
ఉద్దండుల బరి
ఖమ్మం.... ఉద్యమ గుమ్మం.... రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం. సాయుధ పోరు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు అన్ని ప్రజాపోరాటాల్లోనూ ఇక్కడి ప్రజలు కీలకభూమిక పోషించారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ఈ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకమే. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ స్థానం పోరు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల పరిస్థితి ఒక ఎత్తయితే ఖమ్మంది మరో ఎత్తు. మహామహులు బరిలో ఉండే ఈ స్థానంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులెలా ఉన్నాయో ఒక్కసారి పరికిద్దాం. ఖమ్మం: లోక్‌సభ నియోజకవర్గం ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 11, సీపీఎం - 1, టీడీపీ - 1, పీడీఎఫ్ - 2 తొలి ఎంపీ: టి.బి.విఠల్‌రావు (పీడీఎఫ్) ప్రస్తుత ఎంపీ: నామా నాగేశ్వరరావు (టీడీపీ) ప్రస్తుత రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గం పరిధిలోనికి వచ్చేఅసెంబ్లీ స్థానాలు: ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం (జనరల్), మధిర, సత్తుపల్లి (ఎస్సీ), అశ్వారావుపేట, వైరా (ఎస్టీ) మొత్తం ఓటర్లు: 14,07,887 కొత్త ఓటర్లు: 50 వేల పైచిలుకు నియోజకవర్గ ప్రత్యేకతలు: సింగరేణి కార్మికుల ఓట్లు, సామాజిక కోణం, పూర్తిస్థాయి రాజకీయ చైతన్యం, కమ్యూనిస్టుల ప్రభావం, గిరిజనులు, మైనార్టీలు, దళితుల ఓట్లు అధికసంఖ్యలో ఉండడం. ప్రస్తుతం బరిలో నిలిచింది: 27 ప్రధాన అభ్యర్థులు వీరే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్సీపీ) డాక్టర్.కె.నారాయణ (సీపీఐ) నామా నాగేశ్వరరావు (టీడీపీ) బుర్హాన్‌బేగ్ (టీఆర్ఎస్) మేకల కల్యాణ్ చక్రవర్తి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసే అవకాశం వస్తే వలస నేతలు ఎగిరి గంతేస్తారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఇతర జిల్లాల నాయకులు కచ్చితంగా విజయం సాధిస్తారని అన్ని పార్టీల నేతల్లో ధీమా. నాటి లక్ష్మీకాంతమ్మ నుంచి నేటి నామా నాగేశ్వరరావు వరకు ఇతర జిల్లాల నేతలే ఖమ్మం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు లాంటి మహామహులతో పాటు రేణుకాచౌదరి, నామా నాగేశ్వరరావు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారే. గెలిస్తే కేంద్రమంత్రి చాన్స్ తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి గెలిస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు 1980లో ఖమ్మం ఎంపీగా ప్రాతి నిధ్యం వహించారు. ఇందిర కేబినెట్లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ఆ తర్వాత 1991లో గెలిచిన పీవీ రంగయ్యనాయుడు రాజీవ్‌గాంధీ కేబినెట్లో సమాచార మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత గెలిచిన రేణుకా చౌదరికి కూడా కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కింది. మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచినప్పుడు కేంద్రంలో అధికారంలో లేకపోయినా ఖమ్మం ఎంపీలు జాతీయస్థాయిలో కీలకపాత్రే పోషించారు. పెద్ద కామ్రేడ్‌కు కలిసొచ్చేనా? తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభావం ఎలా ఉంటుందనేది జిల్లాలో చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటులో భాగంగా ఆయన ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీచేస్తున్నారు. సీపీఐకి మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కేడర్ ఉండగా, మిగిలిన చోట్ల ఆయన కాంగ్రెస్ ఓటింగ్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పాలేరు. వైరా, కొత్తగూడెం, ఖమ్మం అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ కేడర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమేరకు సహకరిస్తాయనేదానిపైనే ఆయన విజయం ఆధారపడి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సీపీఐ పోషించిన పాత్ర, పార్టీలో అత్యున్నత పదవిలో ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. ‘నామా’కు తుమ్మల గండం ప్రస్తుతం ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నామా నాగేశ్వరరావు మరోసారి టీడీపీ తరఫున ఎంపీ స్థానానికి బరిలో దిగనున్నారు. పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అంతర్గత పోరుపై పెట్టిన దృష్టి జిల్లా ప్రజల అభివృద్ధిపై పెట్టలేదని సొంతపార్టీ నుంచే విమర్శలున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా ఇరువర్గాలు కయ్యానికి సై అంటున్నారు. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు కావడంతో మైనార్టీ ఓట్లు నామాకు దూరం కానున్నాయి. అయితే, తన సామాజిక వర్గం ఓట్లతో పాటు ఆర్థిక బలంపైనే పూర్తిగా ఆధారపడిన ఈయనకు ఈసారి విజయం ముళ్లబాటేనని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. గు‘లాబీయింగ్’ లేని ఖమ్మం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగిన ఈ జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా టీఆర్ఎస్కు అది ఓటుబ్యాంక్ రూపంలోకి మారలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మైనార్టీ వర్గానికి చెందిన షేక్ బుర్హాన్‌బేగ్ అనే విద్యాధికుడికి అవకాశం ఇచ్చింది. తద్వారా మైనార్టీ ఓట్లను రాబట్టి, గులాబీ జె ండా ఎగరేయాలని ఆశపడుతున్నా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలతగా మారనుంది. ‘ఫ్యాన్’తో ‘సీను’ మారనుందా..! ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) రాజకీయాలకు కొత్త. మొదటిసారి వైఎస్సార్‌కాంగ్రెస్ ద్వారా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనతికాలంలోనే జిల్లా ప్రజలకు సుపరిచితులయ్యారు. రాజకీయాల్లోకి రాకముందే తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగులేటి రాఘవరెడ్డి-స్వరాజ్యం ట్రస్టు ద్వారా పేదలకు సాయం చేస్తున్నారు. గతనెల ఐదో తేదీన ఖమ్మంలో నిర్వహించిన జనభేరి సభలో పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి స్వయంగా శీనన్న అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ బలంగా ఉండడంతో మిగిలిన అభ్యర్థుల కంటే పొంగులేటి ముందంజలో ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని సత్తుపల్లి నియోజకవర్గం ఆయన స్వస్థలం కావడంతో స్థానికత ఈయనకు కలిసివచ్చే మరో అంశం. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతుల రుణమాఫీ లాంటి పథకాలు తన ను విజయతీరాలకు చేరుస్తాయని శీనన్న భావిస్తున్నారు. నే.. గెలిస్తే.. * అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యలు పరిష్కరిస్తా. * రైతాంగానికి గిట్టుబాటు ధర, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సౌకర్యాల కల్పన, రుణసౌకర్యం అందేలా ప్రయత్నిస్తా. * నిరుద్యోగ యువత కోసం పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉపాధి కల్పనకు కృషి చేస్తా. * వైఎస్. బాటలో అభివృద్ధి, సంక్షేమం కోసం అంకితమవుతా. * ప్రజలందరి భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ప్లాన్ రూపొం దించి నిర్ణీత కాలంలో అమలుపరుస్తా. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి * ఖమ్మం జిల్లాలో అపారమైన బొగ్గునిల్వలున్నాయి. అండర్మైన్ బొగ్గు బావులు నిర్మించాలి. తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తా. * మణుగూరులో ఎన్టిపీసీ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేస్తా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తా. * దుమ్ముగూడేం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తా. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పోరాడుతా. - కె.నారాయణ * దుమ్ముగూడెం, మున్నేరు, మొండికుంట ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తా. * జిల్లా కేంద్రంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మండల కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటు. * ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఆదివాసీలకు వైద్య, విద్య సౌకర్యాల కోసం కృషి చేస్తా. * సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తా. * మణుగూరులో థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయిస్తా. ఖమ్మం జిల్లాను మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా తయారుచేసేందుకు కృషి చేస్తా. - ఎస్.బి.బేగ్ * జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్టీల్‌ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా * భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.1000 కోట్లు కేంద్రం నుంచి తీసుకువచ్చి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తా. * అన్ని ప్రధాన రహదారులను ఫోర్వే లైన్లుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా. * వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా. - నామా నాగేశ్వరరావు -
ఖమ్మం నుంచి నారాయణ పోటీ
సాక్షి, హైదరాబాద్: సీపీఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ సిఫార్సుల మేరకు నారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు సీపీఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న నారాయణ నామినేషన్ వేయనున్నారు. తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడం ఖాయమని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా.. ఖమ్మం, నల్లగొండ లోక్‌సభ సీట్లను సీపీఐ కోరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని మాత్రమే కేటాయించింది. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును పోటీ చేయించాలని సీపీఐ భావించింది. అయితే, ఖమ్మం అసెంబ్లీ సీటును పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు అజయ్ కుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. తండ్రీ కుమారులిద్దరూ ఒకే లోక్‌సభ స్థానం పరిధిలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తే.. ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీపీఐని హెచ్చరించింది. దీంతో సీపీఐ తన అభ్యర్థిని మార్చుకోవాల్సి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో నారాయణను ఎలాగూ ఢిల్లీకి తీసుకువెళ్లాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఆయన పేరును ఖమ్మం స్థానానికి ఖరారు చేసింది. -
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే 16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. దీనికి సంబంధించి జాబితాను శనివారం సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. ఇందులో ఖమ్మం స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ను కాంగ్రెస్ సిద్ధం చేసినా విడుదలను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది. 110 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 29 మంది బీసీలు, 20 మంది ఎస్సీలు, 9 మంది ఎస్టీలు, 5 మైనార్టీలు, 7 మహిళలకు కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విడుదల జేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో జేఏసీ నేతలు గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్ లకు చోటు లభించినట్లు సమాచారం. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, చొప్పదండి నుంచి గజ్జెల కాంతం పోటీకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటనను హైకమాండ్ ఆదేశాలతో మధ్య నిలిపివేశారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించే సమయంలో అధిష్టానం నుంచి ఫోన్‌కాల్ రావడంతో అభ్యర్థుల జాబితా చదవడాన్నిపార్టీ ప్రతినిధి రణదీప్ మధ్యలోనే నిలిపివేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకసభ అభ్యర్ధుల జాబితా నిజామాబాద్ - మధుయాష్కీ జహీరాబాద్ - సురేష్ షెట్కర్ కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి - జి.వివేక్ వరంగల్ - రాజయ్య మహబూబాబాద్ - బలరామ్ నాయక్ భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ- గుత్తా సుఖేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ - జైపాల్ రెడ్డి నాగర్ కర్నూలు - నంది ఎల్లయ్య సికింద్రాబాద్ - అంజన్ కుమార్ యాదవ్ మల్కాజిగిరి - సర్వే సత్యనారాయణ ఆదిలాబాద్ - నరేష్ జాదవ్ మెదక్ - శ్రవణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ - సామా కిషన్‌రెడ్డి చేవెళ్ల - కార్తిక్‌రెడ్డి ఖమ్మం - సిపిఐ కేటాయింపు తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చదివిన పేర్లు జనగాం- పొన్నాల లక్ష్మయ్య హుజుర్నగర్-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోల్- దామోదర్ రాజనర్సింహ మధిర- భట్టి విక్రమార్క కంటోన్మెంట్- క్రిషాంక్ తుంగతుర్తి- అద్దంకి దయాకర్ చొప్పదండి- గజ్జెల కాంతం -
టి.కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే
న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. 12 మంది అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఆదిలాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఖరాయిన వారి వివరాలు నిజామాబాద్ - మధుయాష్కీ జహీరాబాద్ - సురేష్ షెట్కర్ కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి - జి.వివేక్ వరంగల్ - రాజయ్య మహబూబాబాద్ - బలరామ్ నాయక్ భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నల్లగొండ - గుత్తా సుఖేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ - జైపాల్‌రెడ్డి సికింద్రాబాద్ - అంజన్‌కుమార్ యాదవ్ మల్కాజ్గిరి - సర్వే సత్యనారాయణ -
'నారాయణ పేరు ఖరారు చేయలేదు'
ఖమ్మం: ఎంపీ స్థానానికి కె.నారాయణ అభ్యర్థిత్వంపై జిల్లా కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి హేమంత్‌రావు తెలిపారు. ఆయన పేరును ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఎవరనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. పొత్తులపై ఇంకా తుది నిర్ణయం జరగక పోవడం వల్ల ఎంపీ అభ్యర్థి ఎవరనేదానిపై ప్రకటన చేయడం లేదన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేరును ఖరారు చేసినట్టు అంతకుముందు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వివరణ ఇచ్చారు. సీపీఐ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ రెండు లోక్‌సభ, 17 శాసనసభ స్థానాలను కోరుతున్న విషయం తెలిసిందే. -
ఖమ్మం టీడీపీలో సీట్ల లొల్లి
ఖమ్మం: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అగ్గి రాజుకుంది. ఖమ్మం జిల్లాలో పార్టీలోని రెండు వర్గాల నేతలతో పాటు.. వారి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో అంతర్గతంగా ఉన్న వైరం ఈ ఎన్నికలతో ఖమ్మం జిల్లాలో బయటపడుతోంది. ఎమ్మెల్యే టికెట్లు మొదలు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో ఎవరికివారు తమ అనుచరులకు హామీలు గుప్పిస్తున్నారు. వరుసగా ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఖమ్మం జిల్లాలో పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదే సమయమని ఇటు ఎంపీ నామా నాగేశ్వరరావు, అటు ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తమ వ్యూహాలకు పదును పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని పైకి ప్రకటించి చివరకు రెండువర్గాలు ఒకరిని మరొకరు దెబ్బ తీసేందుకు ఎత్తులు వేయడం అప్పట్లో క్యాడర్లో చర్చనీయాంశమైంది. పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయడమే ధ్యేయంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు సహకారం అందించడంలో కూడా వెనుకాడలేదు. డీసీసీబీ ఎన్నికల్లో కూడా ఇరువురు నేతలు తమ అనుచరునికే పీఠం దక్కాలని ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తుమ్మల, ఖమ్మం జిల్లాలో తుమ్మల తనకు కొరకరాని కొయ్యగా మారాడని నామా... ఎవరికి వారు ప్రత్యర్థి వర్గం బలాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఇదే అదునుగా ఇరువర్గాల నేతలు వార్డు సభ్యుని నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే టికెట్ వారు తమ అనుచర నేతలతో మీకే సీట్లు అంటూ హామీలిస్తున్నారు. ఎన్నికల విషయంలో ఇద్దరు నేతలు ఒకే వేదిక పైకి రాకుండా ఎవరికి వారు తమ అనుచర నేతలకు హామీలిస్తుండడంతో అసలు ఎవరికి ఏ స్థానం దక్కుతుందో, ఏది దక్కదో ప్రత్యామ్నాయం చూసుకోవాలా.. వద్దా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరలేవగా.. ఇరువురి అనుచరులు వార్డుల్లో నామినేషన్ వేయడానికి సై అంటే సై అంటున్నారు. అలాగే వీలైనన్ని ఎక్కువ జెడ్పీటీసీలు తమ వర్గమే దక్కించుకోవాలని, అలా అయితే జెడ్పీ పీఠం తమదేనన్న యోచనలో ఇరువురు నేతలు ఉన్నారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎంపీటీసీల విషయంలో కూడా మండల స్థాయిలో పట్టుకోసం ఇదే సీన్ నెలకొంది. అంతేకాకుండా ఇక అసలు తమ వర్గం నేతగా చెప్పుకోవడానికి ఇరువురు నేతలు అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై దృష్టి పెట్టారు. తుమ్మల పాలేరు పయనమెందుకు..? ఖమ్మం నుంచి తుమ్మల పాలేరు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం పార్టీలో చర్చనీయాంశమైంది. తాను ఈసారి ఖమ్మం నుంచే పోటీచేస్తానని స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. పాలేరు నియోజకవర్గ నేతలతో కూడా ఆయన రహస్యంగా సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అసలు ఖమ్మం నుంచి ఆయన పాలేరు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు..అక్కడ నామా వర్గం సహకరిస్తుందా..? అన్నది ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగుతున్న చర్చ. గతంలో తన అనుచర ప్రధాన నేత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో.. బాలసాని, ఆ నియోజకవర్గ ఇన్చార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి అనుచరులు ఎవరికివారు తమ నేతలను వెనకేసుకు వస్తూ విమర్శలకు దిగారు. ఇప్పుడు తుమ్మల.. బాలసాని పేరును ఖమ్మంకు ప్రస్తావిస్తుండడం, పాలేరుకు ఆయన పయనమవుతుండడం పార్టీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. గత ఎన్నికల్లో ఖమ్మంలో తుమ్మల ఓటమి అంచువరకు వెళ్లి బయటపడడం, స్థానికంగా వ్యతిరేకత ఉందా..? అందుకే పాలేరుకు వెళ్తున్నారా..? అనే చర్చ కూడా పార్టీ క్యాడర్లో జరుగుతోంది. తుమ్మల పట్టు.. నామా బెట్టు ఈసారి తుమ్మల ఖమ్మం కాదని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానాన్ని తన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. తుమ్మల అనుచరునికి ప్రత్యామ్నాయంగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని నామా ఇటీవల తెరపైకి తెచ్చారు. జిల్లాలో దమ్మపేట మండలానికి చెందిన కందిమళ్ల నాగప్రసాద్ నామా హామీతోనే ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్నారని.. ఈయనకు ఖమ్మం నుంచి టికెట్ ఇప్పించేందుకు నామా తీవ్ర ప్రయత్నాల్లో మునిగినట్లు తెలిసింది. తుమ్మలకు చెక్ పెట్టాలని నామా.. నామా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తుమ్మల..ఇలా ఇరువురు నేతలు వ్యూహంలో మునిగారు. బాలసానికే టికెట్ ఇవ్వాలని, నిన్నగాక మొన్న వచ్చిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారు..? అని తుమ్మల,బాలసాని అనుచరులు ఇటీవల రాజధానిలో పార్టీ నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురు నేతలు ఖమ్మం సీటు పైనే బెట్టుగా ఉండడంతో ఈ సీటు ఎవరికి దక్కనుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.