ఉద్దండుల బరి | First telangana movement was started from Khammam | Sakshi
Sakshi News home page

ఉద్దండుల బరి

Published Thu, Apr 10 2014 2:20 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM

ఉద్దండుల బరి - Sakshi

ఉద్దండుల బరి

ఖమ్మం.... ఉద్యమ గుమ్మం.... రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం. సాయుధ పోరు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు అన్ని ప్రజాపోరాటాల్లోనూ ఇక్కడి ప్రజలు కీలకభూమిక పోషించారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ఈ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకమే. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ స్థానం పోరు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల పరిస్థితి ఒక ఎత్తయితే ఖమ్మంది మరో ఎత్తు. మహామహులు బరిలో ఉండే ఈ స్థానంలో  ప్రస్తుత రాజకీయ పరిస్థితులెలా ఉన్నాయో ఒక్కసారి పరికిద్దాం.
 
ఖమ్మం: లోక్‌సభ నియోజకవర్గం
ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 11,
 సీపీఎం - 1, టీడీపీ - 1, పీడీఎఫ్ - 2
 తొలి ఎంపీ: టి.బి.విఠల్‌రావు (పీడీఎఫ్)
ప్రస్తుత ఎంపీ: నామా నాగేశ్వరరావు (టీడీపీ)
ప్రస్తుత రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గం పరిధిలోనికి వచ్చేఅసెంబ్లీ స్థానాలు: ఖమ్మం, పాలేరు,  కొత్తగూడెం (జనరల్), మధిర, సత్తుపల్లి
(ఎస్సీ), అశ్వారావుపేట, వైరా (ఎస్టీ)
మొత్తం ఓటర్లు: 14,07,887
కొత్త ఓటర్లు: 50 వేల పైచిలుకు
నియోజకవర్గ ప్రత్యేకతలు: సింగరేణి కార్మికుల ఓట్లు, సామాజిక కోణం, పూర్తిస్థాయి
రాజకీయ చైతన్యం, కమ్యూనిస్టుల ప్రభావం, గిరిజనులు, మైనార్టీలు, దళితుల ఓట్లు అధికసంఖ్యలో ఉండడం.
ప్రస్తుతం బరిలో నిలిచింది: 27


ప్రధాన అభ్యర్థులు వీరే..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్‌సీపీ) డాక్టర్.కె.నారాయణ (సీపీఐ)
 నామా నాగేశ్వరరావు (టీడీపీ)
 బుర్హాన్‌బేగ్ (టీఆర్‌ఎస్)

 
మేకల కల్యాణ్ చక్రవర్తి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసే అవకాశం వస్తే వలస నేతలు ఎగిరి గంతేస్తారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఇతర జిల్లాల నాయకులు కచ్చితంగా విజయం సాధిస్తారని అన్ని పార్టీల నేతల్లో ధీమా. నాటి లక్ష్మీకాంతమ్మ నుంచి నేటి నామా నాగేశ్వరరావు వరకు ఇతర జిల్లాల నేతలే ఖమ్మం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు లాంటి మహామహులతో పాటు రేణుకాచౌదరి, నామా నాగేశ్వరరావు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారే.
 
గెలిస్తే కేంద్రమంత్రి చాన్స్
 తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి గెలిస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు 1980లో ఖమ్మం ఎంపీగా ప్రాతి నిధ్యం వహించారు. ఇందిర కేబినెట్‌లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ఆ తర్వాత 1991లో గెలిచిన పీవీ రంగయ్యనాయుడు రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో సమాచార మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత గెలిచిన రేణుకా చౌదరికి కూడా కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కింది. మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచినప్పుడు కేంద్రంలో అధికారంలో లేకపోయినా ఖమ్మం ఎంపీలు జాతీయస్థాయిలో కీలకపాత్రే పోషించారు.  
 
 పెద్ద కామ్రేడ్‌కు కలిసొచ్చేనా?
 తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభావం ఎలా ఉంటుందనేది జిల్లాలో చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటులో భాగంగా ఆయన ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీచేస్తున్నారు. సీపీఐకి మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కేడర్ ఉండగా, మిగిలిన చోట్ల ఆయన కాంగ్రెస్ ఓటింగ్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పాలేరు. వైరా, కొత్తగూడెం, ఖమ్మం అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ కేడర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమేరకు సహకరిస్తాయనేదానిపైనే ఆయన విజయం ఆధారపడి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సీపీఐ పోషించిన పాత్ర, పార్టీలో అత్యున్నత పదవిలో ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం.  
 
 ‘నామా’కు తుమ్మల గండం
 ప్రస్తుతం ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నామా నాగేశ్వరరావు మరోసారి టీడీపీ తరఫున ఎంపీ స్థానానికి బరిలో దిగనున్నారు.  పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అంతర్గత పోరుపై పెట్టిన దృష్టి జిల్లా ప్రజల అభివృద్ధిపై పెట్టలేదని సొంతపార్టీ నుంచే విమర్శలున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా ఇరువర్గాలు కయ్యానికి సై అంటున్నారు. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు కావడంతో మైనార్టీ ఓట్లు నామాకు దూరం కానున్నాయి. అయితే, తన సామాజిక వర్గం ఓట్లతో పాటు ఆర్థిక బలంపైనే పూర్తిగా ఆధారపడిన ఈయనకు ఈసారి విజయం ముళ్లబాటేనని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.
 
 గు‘లాబీయింగ్’ లేని ఖమ్మం
 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగిన ఈ జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా టీఆర్‌ఎస్‌కు అది ఓటుబ్యాంక్ రూపంలోకి మారలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మైనార్టీ వర్గానికి చెందిన షేక్ బుర్హాన్‌బేగ్ అనే విద్యాధికుడికి అవకాశం ఇచ్చింది. తద్వారా మైనార్టీ ఓట్లను రాబట్టి, గులాబీ జె ండా ఎగరేయాలని ఆశపడుతున్నా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం  లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలతగా మారనుంది.
 
 ‘ఫ్యాన్’తో ‘సీను’ మారనుందా..!
 ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) రాజకీయాలకు కొత్త. మొదటిసారి వైఎస్సార్‌కాంగ్రెస్ ద్వారా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనతికాలంలోనే జిల్లా ప్రజలకు సుపరిచితులయ్యారు. రాజకీయాల్లోకి రాకముందే తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగులేటి రాఘవరెడ్డి-స్వరాజ్యం ట్రస్టు ద్వారా పేదలకు సాయం చేస్తున్నారు. గతనెల ఐదో తేదీన ఖమ్మంలో నిర్వహించిన జనభేరి సభలో పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా శీనన్న అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
 
 అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ బలంగా ఉండడంతో మిగిలిన అభ్యర్థుల కంటే పొంగులేటి ముందంజలో ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని సత్తుపల్లి నియోజకవర్గం ఆయన స్వస్థలం కావడంతో స్థానికత ఈయనకు కలిసివచ్చే మరో అంశం. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతుల రుణమాఫీ లాంటి పథకాలు తన ను విజయతీరాలకు చేరుస్తాయని శీనన్న భావిస్తున్నారు.  
 
 నే.. గెలిస్తే..
* అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యలు పరిష్కరిస్తా.
*   రైతాంగానికి గిట్టుబాటు ధర, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సౌకర్యాల కల్పన, రుణసౌకర్యం అందేలా ప్రయత్నిస్తా.
*  నిరుద్యోగ యువత కోసం పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉపాధి కల్పనకు కృషి చేస్తా.
*  వైఎస్. బాటలో అభివృద్ధి, సంక్షేమం కోసం అంకితమవుతా.
*   ప్రజలందరి భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ప్లాన్ రూపొం దించి నిర్ణీత కాలంలో అమలుపరుస్తా.
   - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 
*  ఖమ్మం జిల్లాలో అపారమైన బొగ్గునిల్వలున్నాయి. అండర్‌మైన్ బొగ్గు బావులు నిర్మించాలి. తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తా.
*   మణుగూరులో ఎన్‌టిపీసీ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేస్తా
  బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తా.
*  దుమ్ముగూడేం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తా. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పోరాడుతా.
 - కె.నారాయణ
 
* దుమ్ముగూడెం, మున్నేరు, మొండికుంట ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తా.
*  జిల్లా కేంద్రంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మండల కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటు.
*  ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఆదివాసీలకు వైద్య, విద్య సౌకర్యాల కోసం కృషి చేస్తా.
*  సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తా.
*  మణుగూరులో థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయిస్తా. ఖమ్మం జిల్లాను మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా తయారుచేసేందుకు కృషి చేస్తా.
 - ఎస్.బి.బేగ్
 
*    జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్టీల్‌ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా
*   భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.1000 కోట్లు కేంద్రం నుంచి తీసుకువచ్చి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తా.
*  అన్ని ప్రధాన రహదారులను ఫోర్‌వే లైన్‌లుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా.
*  వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా.
 - నామా నాగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement