వైరా: ‘నీకు దమ్ముంటే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ‘పార్టీ నిన్ను బహిష్కరిస్తే సానుభూతి పొందాలని చూస్తున్నావు.. చర్యలు తీసుకునే ఎజెండా మాది కాదు’ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.
పిల్లి ఊపులకు సీఎం కేసీఆర్ భయపడే రకం కాదన్నారు. కేసీఆర్ చేయి వదిలిన వారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ జెండాను వదిలితే వారి బొంద వారే తవ్వుకున్నట్లు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. వైరా ఎమ్మెల్యేగా రాములునాయక్ ఉండగానే మరో వ్యక్తిని వైరా నియోజకవర్గ అభ్యర్థిగా ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, కేసీఆర్‌కు ద్రోహం తలపెట్టాలనుకునే వారు పార్టీ నుండి వెళ్లిపోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment