ఖమ్మం టీడీపీలో సీట్ల లొల్లి
ఖమ్మం: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అగ్గి రాజుకుంది. ఖమ్మం జిల్లాలో పార్టీలోని రెండు వర్గాల నేతలతో పాటు.. వారి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో అంతర్గతంగా ఉన్న వైరం ఈ ఎన్నికలతో ఖమ్మం జిల్లాలో బయటపడుతోంది. ఎమ్మెల్యే టికెట్లు మొదలు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో ఎవరికివారు తమ అనుచరులకు హామీలు గుప్పిస్తున్నారు. వరుసగా ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఖమ్మం జిల్లాలో పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదే సమయమని ఇటు ఎంపీ నామా నాగేశ్వరరావు, అటు ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తమ వ్యూహాలకు పదును పెట్టారు.
పంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని పైకి ప్రకటించి చివరకు రెండువర్గాలు ఒకరిని మరొకరు దెబ్బ తీసేందుకు ఎత్తులు వేయడం అప్పట్లో క్యాడర్‌లో చర్చనీయాంశమైంది. పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయడమే ధ్యేయంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు సహకారం అందించడంలో కూడా వెనుకాడలేదు. డీసీసీబీ ఎన్నికల్లో కూడా ఇరువురు నేతలు తమ అనుచరునికే పీఠం దక్కాలని ప్రయత్నాలు చేశారు.
తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తుమ్మల, ఖమ్మం జిల్లాలో తుమ్మల తనకు కొరకరాని కొయ్యగా మారాడని నామా... ఎవరికి వారు ప్రత్యర్థి వర్గం బలాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఇదే అదునుగా ఇరువర్గాల నేతలు వార్డు సభ్యుని నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే టికెట్ వారు తమ అనుచర నేతలతో మీకే సీట్లు అంటూ హామీలిస్తున్నారు. ఎన్నికల విషయంలో ఇద్దరు నేతలు ఒకే వేదిక పైకి రాకుండా ఎవరికి వారు తమ అనుచర నేతలకు హామీలిస్తుండడంతో అసలు ఎవరికి ఏ స్థానం దక్కుతుందో, ఏది దక్కదో ప్రత్యామ్నాయం చూసుకోవాలా.. వద్దా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు.
నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరలేవగా.. ఇరువురి అనుచరులు వార్డుల్లో నామినేషన్ వేయడానికి సై అంటే సై అంటున్నారు. అలాగే వీలైనన్ని ఎక్కువ జెడ్పీటీసీలు తమ వర్గమే దక్కించుకోవాలని, అలా అయితే జెడ్పీ పీఠం తమదేనన్న యోచనలో ఇరువురు నేతలు ఉన్నారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎంపీటీసీల విషయంలో కూడా మండల స్థాయిలో పట్టుకోసం ఇదే సీన్ నెలకొంది. అంతేకాకుండా ఇక అసలు తమ వర్గం నేతగా చెప్పుకోవడానికి ఇరువురు నేతలు అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై దృష్టి పెట్టారు.
తుమ్మల పాలేరు పయనమెందుకు..?
ఖమ్మం నుంచి తుమ్మల పాలేరు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం పార్టీలో చర్చనీయాంశమైంది. తాను ఈసారి ఖమ్మం నుంచే పోటీచేస్తానని స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. పాలేరు నియోజకవర్గ నేతలతో కూడా ఆయన రహస్యంగా సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అసలు ఖమ్మం నుంచి ఆయన పాలేరు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు..అక్కడ నామా వర్గం సహకరిస్తుందా..? అన్నది ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగుతున్న చర్చ.
గతంలో తన అనుచర ప్రధాన నేత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో.. బాలసాని, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి అనుచరులు ఎవరికివారు తమ నేతలను వెనకేసుకు వస్తూ విమర్శలకు దిగారు. ఇప్పుడు తుమ్మల.. బాలసాని పేరును ఖమ్మంకు ప్రస్తావిస్తుండడం, పాలేరుకు ఆయన పయనమవుతుండడం పార్టీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. గత ఎన్నికల్లో ఖమ్మంలో తుమ్మల ఓటమి అంచువరకు వెళ్లి బయటపడడం, స్థానికంగా వ్యతిరేకత ఉందా..? అందుకే పాలేరుకు వెళ్తున్నారా..? అనే చర్చ కూడా పార్టీ క్యాడర్‌లో జరుగుతోంది.
తుమ్మల పట్టు.. నామా బెట్టు
ఈసారి తుమ్మల ఖమ్మం కాదని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానాన్ని తన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. తుమ్మల అనుచరునికి ప్రత్యామ్నాయంగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని నామా ఇటీవల తెరపైకి తెచ్చారు.
జిల్లాలో దమ్మపేట మండలానికి చెందిన కందిమళ్ల నాగప్రసాద్ నామా హామీతోనే ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్నారని.. ఈయనకు ఖమ్మం నుంచి టికెట్ ఇప్పించేందుకు నామా తీవ్ర ప్రయత్నాల్లో మునిగినట్లు తెలిసింది. తుమ్మలకు చెక్ పెట్టాలని నామా.. నామా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తుమ్మల..ఇలా ఇరువురు నేతలు వ్యూహంలో మునిగారు. బాలసానికే టికెట్ ఇవ్వాలని, నిన్నగాక మొన్న వచ్చిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారు..? అని తుమ్మల,బాలసాని అనుచరులు ఇటీవల రాజధానిలో పార్టీ నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురు నేతలు ఖమ్మం సీటు పైనే బెట్టుగా ఉండడంతో ఈ సీటు ఎవరికి దక్కనుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.