సీఎంలిద్దరూ ప్రజలను రెచ్చగొడుతున్నారు
బాబు, కేసీఆర్పై సీపీఐ నారాయణ మండిపాటు
హైదరాబాద్: రాజకీయంగా తమ తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ఆరోపించారు. ఇద్దరు నేతలు ఒక పీలిక నుంచి చీలిన ముక్కలేనని చెప్పారు. ‘వారి మధ్య ఘర్షణ ఉండొచ్చు.
ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవచ్చు. కానీ తెలుగు ప్రజల మధ్య విభేదాలు లేవు’ అని నారాయణ అన్నారు. 2 రాష్ట్రాల మధ్య వివాదాలను నాయకుల మధ్య వివాదాలుగా చూడాలన్నారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు(సీఆర్) శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో ఈ నెల 11న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు శనివారం పరిశీలించారు.