సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావడంలో విఫలమై దద్దమ్మలయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీకి అనుకూల, వ్యతిరేఖ వర్గాలైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఢిల్లీబాట పట్టారని చెప్పారు. ప్రధాన నరేంద్ర మోదీకి ఊడిగం చేసేందుకే థర్డ్ ఫ్రంట్ అని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అయినవారికీ ఆకులు, కానివారికి కంచాలు ఉండేవి అనే సామెతను గుర్తు చేశారు.
నేడు అయినవారికీ కంచాలు, లేనివారికి ఆకులు అన్నట్లుగా నీతి ఆయోగ్ పరిస్థితి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో నల్లధనం వెలికి తీస్తాను, లేదా నన్ను కాల్చండి అన్న మోదీ.. 48 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయలేకపోయారని ప్రశ్నించారు. స్వయంగా మోదీ చెప్పిన ప్రకారమే అయితే ఆ లెక్కన వందసార్లు ఆయనను కాల్చాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ, ఉర్జిత్ పటేల్ నోట్ల వ్యవహారంలో నాటకాలాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రానికి నెంబర్ వన్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికల కమిషన్, సీబీఐలు ప్రధాని మోదీకి అనుకూల రీతిలో పనిచేస్తున్నాయని చెప్పారు. మోదీకి పెంపుడు కుక్కలా సీబీఐ తయారైందన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తలు అచ్చోసిన ఆబోతుల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. సీపీఐకి టీడీపీతో కలవాల్సిన అవసరం లేదని, తమకు కొత్త ఫ్రెండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దొరికాడని పేర్కొన్నారు. దేశాన్ని రక్షిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుదాం అనే నినాదంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తాము కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని నారాయణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment