సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను సైతం నారాయణ వ్యతిరేకించారు.
బీజేపీకి భయపడుతున్న చంద్రబాబు
బీజేపీ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు భయపడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను తొలగించి ఎన్‌డీఏలో ఏవిధంగా కొనసాగుతారని బాబును ప్రశ్నించారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందని తెలుసుకోవడానికి చంద్రబాబుకు నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలను కలుపుకుని పోరాడాలని చంద్రబాబుకి సూచించారు. ప్యాకేజీ ఇచ్చినా నిధులు ఖర్చు చేసే సమయం లేదని నారాయణ తెలిపారు.
నిజాంను తలపిస్తున్న కేసీఆర్ పాలన
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తుందని నారాయణ విమర్శించారు. అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు తరచూ వాయిదా పడటం మంచి పరిణామం కాదన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్నీ పార్టీలను ఏకం చేస్తామన్నారు. ఏప్రిల్ 25 నుంచి 29 వరకు కేరళలో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment