తెలంగాణవాదులకు ఇదేనా గౌరవం?
మైకు ఇవ్వక పోవడంపై కోమటిరెడ్డి నిరసన
పదవికి రాజీనామా చేస్తా..
సభపై అలిగితే ఎలా అని సీఎం అనునయింపు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కొద్ది సేపు హల్ చల్ చేశారు. గురువారం అసెంబ్లీలో కొత్త పారిశ్రామిక విధానంపై అన్ని పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న తరుణంలో, తన కు ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, స్పీకర్ స్థానంలోఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని కోరారు. ఆయన రెండు సార్లు అభ్యర్థించినా పార్టీ నుంచి ఒకరికే అవకాశం ఇస్తామంటూ డిప్యూటీ స్పీకర్ మైక్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన విసురుగా బయటకు వచ్చేశారు. ‘ తెలంగాణ కోసం మేమూ పోరాడాం.
నా మంత్రి పదవినే వదులుకున్నా. తెలంగాణ వాదులకు సభలో ఇచ్చే గౌరవం ఇదేనా ’? అంటూ ఆయన లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హడావుడిగా బయటకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఇప్పుడు రాను, రేపు రాను, ఎల్లుండి రాను. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఆయన సీరియస్‌గా వ్యాఖ్యానించడంతో, సీఎం రమ్మంటున్నారంటూ బాలరాజు మరీమరీ చెప్పడంతో తిరిగి సభలోకి వెళ్లారు.
కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ అయినా తనకు మైక్ ఇవ్వక పోవడంపై నిరసన తెలిపారు. దీంతో సీఎం సమాధానం చెబుతూ ‘ తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి అంటే మాకు గౌరవం ఉంది. సభపై అలిగితే ఎలా’? అని వ్యాఖ్యానించంగా, తాను సభపై అలగలేదని, స్పీకర్‌పై అలిగానని కోమటిరెడ్డి ప్రతిస్పందించారు. ఆతర్వాత వెంటనే సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి సభనుంచి బయటకు వచ్చి ఇదే విషయంపై వాదించారు. ‘నన్ను సభకు రమ్మని ఇబ్బంది పెట్టొద్దు. రేపే రాజీ నామా చేస్తా’ అంటూ పేర్కొనడంతో జానారెడ్డి, కోమటిరెడ్డిని బుజ్జగించారు. ‘మాట్లాడడానికి అవకాశం ఇమ్మని నీ పేరునే రాసిస్తా’ అంటూ అనునయించారు.