
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, మరోసారి ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో తాజాగా కోమటిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ..‘సంధ్య ధియేటర్ వద్ద ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చాడు. ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ లేదు. సంధ్య థియేటర్ వద్ద ఘటనను రాజకీయం చేయవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పరామర్శకు లీగల్ సమస్యలేంటి?. శ్రీతేజ్‌కు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది?. సినీ ఇండస్ట్రీ శ్రీతేజ్‌ను ఎందుకు పరామర్శించ లేదు’ అని ప్రశ్నించారు.
అంతకుముందు.. పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు.
పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్‌కు వెళ్లినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంత మంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వంలేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయా తెలిపారు.

అనుమతి లేకపోతే పోలీసులు వెనక్కి పంపేవారు కదా..
థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను అత్యంత దురదృష్టకరమైన ప్రమాదంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పోలిసులు అక్కడ ఉన్నారని.. దాంతో తన రాకకు అనుమతి ఉందనే భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలిసులేనని.. ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా? అని అల్లు అర్జున్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment