తెలంగాణవాదులు అడ్డుకోకుండా పటిష్ట చర్యలు
తెలంగాణ జిల్లాల నుంచి రాకుండా నగరం చుట్టూ చెక్‌పోస్టులు
హైవేలపై సీమాంధ్ర వాహనాలను అడ్డుకోకుండా పెట్రోలింగ్
ఎల్‌బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ
డీజీపీ, సీఎస్‌లతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో శనివారం జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసుశాఖ పటిష్ట భద్రతాచర్యలు తీసుకుంటోంది. పోలీసులు, పారా మిలటరీ బలగాలతో నాలుగంచెల భద్రత ద్వారా ఏపీఎన్‌జీవోల సభ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎల్‌బీ స్టేడియాన్ని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు గురువారం అదీనంలోకి తీసుకున్నాయి. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా ఇనుపకంచెలు, బ్యారికేడ్లను ఏర్పాటుచేయనున్నారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియం లోపలికి గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని పోలీసుశాఖ ఇప్పటికే ప్రకటించింది.
అలాగే.. తెలంగాణ జిల్లాల నుంచి భారీసంఖ్యలో నిరసనకారులు నగరంలోకి రాకుండా శివార్లలో చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. ఏపీఎన్‌జీవో సభ కోసం సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చే వాహనాలను తెలంగాణవాదులు అడ్డుకోకుండా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ఏర్పాటుచేస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే రైల్వేస్టేషన్ల వద్ద కూడా భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ఇదిలావుంటే.. ఏపీఎన్‌జీవో సభకు భద్రతాచర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎస్ ప్రసన్నకుమార్ మహంతి, డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మలతో సమీక్షించారు. సభ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు నాలుగంచెల భద్రత
Published Fri, Sep 6 2013 5:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement