సీమాంధ్ర సభకు హాజరు కావొద్దు: టీజేఎఫ్
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్రకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు.. ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు హాజరుకావద్దని పలువురు తెలంగాణ ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. సీఎం , డీజీపీ ఇద్దరూ ఏపీఎన్జీవోల రూపంలో హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అత్యవసర వైద్యసేవలు మినహా తెలంగాణలో జనజీవనాన్ని, రహదారులను స్తంభింపచేయాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ‘బంద్ విజయవంతంలో మన పాత్ర’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఏపీఎన్జీవోల సభకు అనుమతించడం హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించడానికేనని దుయ్యబట్టారు. బంద్ సందర్భంగా ప్రతిఘటన ఏదైనా ఎదురైతే... దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సమావేశంలో ఈటెల రాజేందర్, స్వామిగౌడ్, మందకృష్ణమాదిగ, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, వేదకుమార్, అద్దంకి దయాకర్, విమలక్క, బాలరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను వ్యతిరేకిస్తే ఊరుకోం : ప్రజాసంఘాల జేఏసీ
ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనవల్ల ఎదురయ్యే సమస్యలు, ఇతర అనుమానాలపై చర్చిస్తే తమకేమీ అభ్యంతరంలేదని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం సహించబోమని తెలంగాణవాదులు స్పష్టం చేశారు. ‘శాంతియుతంగా విడిపోయి కలిసుందాం..’ నినాదంతో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు సంఘాలకు చెందిన తెలంగాణవాదులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు ప్రసంగించారు. ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాలు సృష్టించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు లాంటివారు నీటి, ఉద్యోగ సమస్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ లాంటివారు చేసే బెందిరింపులను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు.
గజ్జెల కాంతం, సతీశ్ మాదిగ మాట్లాడుతూ..హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే ఇక్కడుండే తెలంగాణ-సీమాంధ్ర ప్రజల మధ్య భారత్-పాకిస్తాన్ తరహా సంబంధాలే ఉంటాయన్నారు. ఈనెల 24న ప్రజా తెలంగాణ సభ నిర్వహిస్తామని, మరోమారు చర్చలకు ఏపీఎన్జీవోలను ఆహ్వానిస్తామన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కృష్ణయ్య, వైస్‌చైర్మన్ బెన్సన్‌లు మాట్లాడుతున్నప్పుడు... తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, విభజనతో మీకొచ్చే ఇబ్బందేంటో చెప్పాలంటూ పలువురు విలేకరులు అడ్డుతగిలారు. వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది.