
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తగదన్నారు.
ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు.