మోదుగుపూలకు వందనం | Obeisance of Telangana martyrs | Sakshi
Sakshi News home page

మోదుగుపూలకు వందనం

Published Tue, Apr 1 2014 1:36 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

Obeisance of Telangana martyrs

నవ తెలంగాణే అమరులకు నివాళి
ఎలక్షన్ సెల్: ఒక్కరా ఇద్దరా.. వందలు వేలు. ప్రాణాలను తృణప్రాయమనుకున్నారు. త్యాగాల బాటలో నెత్తుటి  పూలై  పూశారు. వీరోచిత పోరాటం చేశారు. తెలంగాణ ఆకాంక్షను  చాటారు. దిక్కులు పిక్కటిల్లే  నినాదమయ్యారు. కవాతులు, తుపాకులు మోపిన ఉక్కుపాదాన్ని లెక్కచేయకుండా పోరాడారు. ఆత్మ బలిదానాలతో తాము కలలు కన్న తెలంగాణ కోసం అమరువీరులయ్యారు. ఆనాటి 1969 ఉద్యమ కారుడు ఉమేందర్ నుంచి  నేటి శ్రీకాంతాచారి, యాదయ్యల వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం త్యాగాల బాటలోనే నడిచింది. ఇలాంటి అమరుల త్యాగాలు వృథా కాలేదు, వారి ఆకాంక్షలు నెరవేరి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో నవ తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి... వారు రాసిన ‘సూసైడ్’నోటే  ఎన్నికల ప్రణాళికా అంశాలు కావాలని అమరుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
 
1969 జ్ఞాపకం..
 పగిడిపాల ఆంజనేయులు, హైదరాబాద్: అది 1968 సెప్టెంబర్. తుపాను ముందరి ప్రశాంతతను తలపిస్తోంది హైదరాబాద్ నగరం. తెలంగాణ ఉద్యమకారులు భారీ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. ప్రభుత్వం ససేమిరా అంది. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు మహాప్రదర్శనగా వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రాన్ని అందజేసేందుకు అన్ని స్కూళ్లు, కళాశాలలు కదులుతున్నాయి. అనుమతిని నిరాకరించిన ప్రభుత్వం అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించింది. పోలీసు పహారాలో చార్మినార్ వద్ద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అప్పటికే సిటీ హైస్కూల్ కాలేజీ దగ్గర విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ర్యాలీకి సిద్ధమయ్యారు. చార్మినార్ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు ఆచార్య కేశవరావు జాదవ్, మరో ఇద్దరు ఆందోళనకారులు పూజారుల్లా వెళ్లారు. భాగ్యలక్ష్మి అమ్మవారి చుట్టూ  ప్రదక్షిణ చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఒక్కసారిగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు.
 
 ఆ నినాదాన్ని అందుకున్న విద్యార్థులు వందలు, వేలుగా కదిలి వచ్చారు. పోలీసు వలయాలను ఛేదించుకొని సాగిన ఆ నాటి ప్రదర్శన లో దారి పొడవునా  నెత్తురు పారింది. పోలీసుల లాఠీలు విరిగాయి. విచక్షణా రహితంగా తూటాలు పేలాయి. చార్మినార్ వద్ద పేలిన  మొట్టమొదటి తూటా శాలిబండ విద్యార్థిని అరుణ గుండెలను చీల్చుకుంటూ వెళ్లింది. చార్మినార్ వద్ద ప్రారంభమై, పబ్లిక్‌గార్డెన్స్, అసెంబ్లీ, లకిడికాపూల్ మీదుగా పోలీసు లాఠీలను, తూటాలను లెక్కచేయకుండా రాజ్‌భవన్‌కు దూసుకుపోతున్న విద్యార్ధులను పోలీసులు రాజ్‌భవన్ సమీపంలో అడ్డుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. సికింద్రాబాద్ నుంచి ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉమేందర్‌రావు ఆందోళనకారులను ఉద్దేశించి ‘అందరూ ప్రశాంతంగా రోడ్డుపై బైఠాయించాలని’ చెబుతూనే పోలీసుల తూటాలు నేలకొదిలారు.
 
 ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆ పోరాటంలో 30 మందికి పైగా అమరులయ్యారు. ఇలా మొదలైన ఉద్యమం ఉధృతమై కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎందరో అమరులయ్యారు. 1969 నాటి ఉద్యమంలో తెలంగాణ అంతటా వీరోచిత మరణాలే. 360 మందికి పైగా అసువులు బాశారు. ఆ నాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధం నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు. ప్రముఖ శిల్పి డాక్టర్ ఎక్కా యాదగిరిరావు అద్భుతమైన అమరుల స్థూపానికి ప్రాణప్రతిష్ట  చేశారు. ఈ స్థూపమే నేడు అన్నింటికీ స్ఫూర్తిగా నిలిచింది.
 
 ‘తెలంగాణ’ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వారిలో ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. తెలంగాణ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని నమ్మి.. అందుకోసం ఆత్మత్యాగం చేసుకుని కన్న తల్లులకు పుట్టెడు శోకం మిగిల్చారు. ఆ ‘అమ్మలు’పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాడారు. ఆ క్రమంలో ప్రాణాలు సైతం వదులు కున్నారు. తమ ఆకాంక్ష కోసం ఇంత పెద్దమొత్తంలో ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో  సుమారు 1003మంది ప్రాణ త్యాగం చేశారు.. వీరిలో 630మంది ఆత్మబలిదానాలు చేసుకోగా.. 373మంది తెలంగాణ రాదేమోనన్న బాధతో గుండెపోటుకు గురై చనిపోయారు.  తెలంగాణను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వారు రాసిన సూసైడ్ నోట్స్ చెబుతున్నాయి.
 
 స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలి. కొందరు నాయకులు అమరుల కుటుంబాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలి.
 -  శంకరమ్మ, శ్రీకాంతాచారి తల్లి
 
 చట్టసభల్లో అమరవీరుల కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ఫైలుపై మొదటి సంతకం చేయాలి.
 -  చిర్రా లక్ష్మీబాయి, జీవన్‌కుమార్ తల్లి
 
 తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. వారి కుటుంబాల్లో ఒకరిద్దరికైనా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ప్రతిపాదిస్తారని అనుకున్నా. కానీ ఎవరూ రాలేదు.
 - పి.పద్మావతి, కానిస్టేబుల్ కిష్టయ్య భార్య
 
 చిదంబరం ప్రకటనతో..
 2009 డిసెంబర్ 10న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పార్లమెంటులో ఆనాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. దీనిపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు కొనసాగడంతో అదే నెల 28న  తెలంగాణపై మరో ప్రకటన చేశారు. తెలంగాణపై పూర్తిస్థాయి అధ్యయనానికి ఓ కమిటీ వేస్తామని చెప్పడంతో ఉవ్వెత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో యువతలో అశాంతి నెలకొంది. ఇది ఆత్మహత్యలకు ప్రేరేపించింది. ఈ సందర్భంలోనే హోంమంత్రి షిండే చేసిన ప్రకటనలకు.. ఆజాద్ తదితర కాంగ్రెస్ పెద్దల పొంతనలేని ప్రకటనలతో ఆత్మహత్యలు మొదలయ్యాయి. తెలంగాణపై నిర్ణీత గడువు లేదని ఆజాద్ చేసిన  ప్రకటనతో ఆరుగురు యువకులు ప్రాణాలు తీసుకున్నారు. దీంతోపాటు కేసీఆర్ దీక్ష, స్థానిక కాంగ్రెస్ నేతల వైఖరి, అస్పష్టమైన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు ఆత్మహత్యలకు కారణాలయ్యాయి.
 
 ఉద్యమం ఉవ్వెత్తుకు...
 హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్న నల్లగొండ యువకుడు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం డిసెంబర్ 3, 2009న ఎల్బీనగర్‌లో ఒంటికి నిప్పంటించుకుని బలిదానం చేసుకున్నాడు. ఆయన ఆత్మార్పణం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. ఇక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఎం.యాదిరెడ్డి(28) పదో తరగతి చదువుకున్నాడు. తెలంగాణపై జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని భావించి జూలై 20, 2011న ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి రాసిన పదిపేజీల సూసైడ్‌నోట్‌లో..‘సోనియాగాంధీజీ.. మా తెలంగాణ మాకు ఇచ్చేయండి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను హింసిసున్నాయి’ అని  ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ బలిదానం తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది.
 
 అలాగే జేఎన్‌టీయూలో ఎంటెక్ చదువుతున్న ఆర్.శ్రీకాంత్.. తన తల్లిదండ్రులకు తానొక్కడినే కొడుకునని, అయినా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నానని లేఖ రాసి చనిపోయాడు. తెలంగాణకు మద్దతు ఇవ్వని జైపాల్‌రెడ్డి, దానం నాగేందర్ లాంటి వారిని చూసి సిగ్గుపడుతున్నానని అందులో రాశాడు. తన ఆత్మబలిదానం ఉద్యమానికి మరింత ఊపునివ్వాలని ఆకాం క్షించాడు. ఇంకా.. నిజామాబాద్ జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య.. నవ తెలంగాణ కోసం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోగా,  కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన జీవన్‌కుమార్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్‌రెడ్డి ఆత్మార్పణం చేసుకున్నాడు. వీరి ప్రాణత్యాగాలతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. వీళ్లే కాకుండా మరెందరో చేసుకున్న ఆత్మార్పణలు తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పాటు కాబోతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాల సాధనే ధ్యేయంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి. వారి సూసైడ్ నోట్లే తెలంగాణ కోసం పాటుపడే పార్టీల ఎన్నికల మేనిఫెస్టో కావాలని తెలంగాణ అమరుల కుటుంబాలు కోరుతున్నాయి.
 
 ఏ ప్రభుత్వం వచ్చినా అమరులను ఆదుకోవాలి
 మాకు హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఇస్తానని కేసీఆర్ చెప్పారు. ఇస్తే మేం అమరుల కుటుంబాల కోసం పోరాడ తాం. కొందరు నాయకులు అమరుల కుటుంబాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలి.  
 -  శంకరమ్మ (అమరుడు శ్రీకాంతాచారి తల్లి)
 -----
 బతుకులు మారాలి
 అమరుల కుటుంబాల్లో ఒకరిద్దరికైనా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ప్రతిపాదిస్తారని అనుకున్నా. పెద్దదిక్కు కోల్పోయి బాధలు పడుతున్న మమ్మల్ని ఆదుకోవాలని కోరినా గాలికి వదిలేశారు. పింఛన్, ఇంటి స్థలం అన్నారు కానీ ఇవ్వలేదు.  
     - పి.పద్మావతి (అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య)
 -----
 సంక్షేమ ఫైలుపై మొదటి సంతకం చేయాలి
 నా బిడ్డ జీవన్‌కుమార్ డిగ్రీ చదువుతూ తెలంగాణ కోసం చనిపోయిండు. నా బిడ్డలాగా మరొకరు బలిదానాలు చేసుకోకూడదని నేను, నా మరో కొడుకు సతీష్ కలిసి ప్రచారం చేశాం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ఫైలుపై మొదటి సంతకం చేయాలి.    -  చిర్రా లక్ష్మీబాయి
 -----
 బలిదానాలకు రాజకీయ పార్టీలే కారణం
 ఆంక్షలు లేని పూర్తి హక్కులతో కూడిన తెలంగాణను తెలంగాణ అమరవీరులు కోరుకున్నారు. తెలంగాణలో ప్రజ లకు ప్రతీ విషయంలోనూ హక్కులుండాలి. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి. బలహీన వర్గాలకు రాజ్యాధికారం  కల్పించాలి.                                    
  - వేదకుమార్
 
 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి
 అమరవీరుల పేరున పార్కులు కట్టాలి.  వాళ్ల స్మారకార్థం  సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు తవ్వించాలి. ప్రాజెక్టులు, పాఠశాలలు కట్టించాలి. అమరుల ఆశయాలు సాకారం కావాలంటే నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. అదే వారు కోరుకున్నారు.       
  - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఎమ్మెల్సీ
 
 ------
 అమరుల ఆశయాలే లక్ష్యంగా..
 సాయుధ పోరాటం దగ్గర నుంచి తెలంగాణలో అన్నీ త్యాగాలే. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకోవడం విషాద చరిత్ర. అమరులు కలలుగన్న తెలంగాణ సాధించుకోవాలంటే వారి ఆశయాలనే పార్టీలు తమ ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకురావాలి. - దేవీప్రసాద్, అధ్యక్షుడు, టీఎన్‌జీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement