ఆ భావజాలాన్ని బతికిద్దాం: ఎ. గోపాలకృష్ణ
ఫ్లాష్‌బ్యాక్: విపక్ష పాత్రలో ఉద్యమ శక్తులు
69 నాటి ఆనవాళ్ళూ కన్పిస్తున్నాయి
అది 1969 నాటి సంఘటన....
జామే ఉస్మానియా వద్ద తెలంగాణ విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. వారి వాగ్మూలం తీసుకునేందుకు న్యాయమూర్తి వచ్చారు. అప్పుడు ఆయన ప్రశ్నలకు వాళ్లిచ్చిన సమాధానాలు...
ఈ ఉద్యమాన్ని నడిపించిదేవరు?
‘జై తెలంగాణ’
మీ వెనుక ఉన్నదెవరు?
‘జై తెలం...గా...ణ’ స్వరం పెగలకపోయినా... శక్తిని కూడదీసుకుని అంటూనే ఆ విద్యార్థి తుదిశ్వాస విడిచాడు.
మొన్నటికి మొన్న...
శ్రీకాంతాచారి మంటల్లో నిలువునా దహించుకుపోయాడు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. కళ్లు మూతలు పడుతున్నా, ఒళ్లంతా బ్యాండేజీతో కదలలేకున్నా... ‘అమ్మా’ అనలేదు.
‘సార్, తెలంగాణ వస్తుందా...? వ...స్తుం...’ మాట పూర్తికాకుండా ఆ స్వరం శాశ్వతంగా ఆగిపోయింది.
తూటాలకు తూట్లయిన ఆ తరం... అగ్ని కీలలకు ఆహుతైన ఈ తరం... చివరి శ్వాస తెలంగాణ ఆకాంక్ష.
త్యాగం వారిదే!
రాజకీయం వేరు. ఉద్యమం వేరు. అప్పుడూ, ఇప్పుడూ ఏ రాజకీయ పార్టీ తెలంగాణ కోసమే పుట్టలేదు. ఉద్యమాలే పార్టీలకు ప్రాణమయ్యాయి. 1969లో ఏడుగురు సభ్యులతో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది. వైద్య విద్యార్థిగా ఇది నా ఆలోచన. 1968 చివరలో ఓ సమ్మేళనం ఏర్పాటు చేసి వంద పోస్టర్లు రాశాం. వాటిని అక్కడక్కడా అతికించాం. అంతే, ఆ సభకు వేలమంది హాజరయ్యారు. ఆ స్ఫూర్తితోనే బంద్‌కు పిలుపునిచ్చాం. లాఠీలు విరుచుకుపడ్డా, తుపాకులు గర్జించినా పోరుబాటలో ఒక్క అడుగు వెనక్కు పడలేదు. పైగా ప్రజాపోరాటాల్లో కదలిక తెచ్చింది. ఉస్మానియా క్యాంపస్‌ను నిప్పు కణిక చేసింది. ఊరూ వాడా ‘జై తెలంగాణ’తో హోరెత్తింది. అప్పుడు చెన్నారెడ్డి అందుకున్నారు. టీపీఎఫ్ పుట్టుకొచ్చింది.
నేటి పార్టీలకు ఊపిరి ఎవరు?
ఫ్రీజోన్ అంశం కాదా ఫైర్‌జోన్‌గా మార్చింది? ఉద్యోగుల ఆవేశం కాదా ఉద్యమ రూపం దాల్చింది? ఆ సెగలోనే కొన్ని పార్టీలు చలికాచుకున్నాయి.? ఆ భావజాలంతో ముందుకొచ్చిన వ్యక్తు లే బలైంది. ఇప్పుడా శక్తులు తాత్కాలికంగా నిశ్శబ్దంలో ఉండొచ్చు. వాళ్లకు కొన్ని ఆశలున్నాయి. ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లే దుస్థితి ఉండదని భావిస్తున్నారు. భూములు పడావు పడవనుకుంటున్నారు. వీటి కోసమే ఇంతకాలం పోరాడారు.
అలుపెరగని పోరాటానికి...
69లో పెట్టిన తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటీకి మళ్లీ ఊపిరిపోస్తున్నాం. పాలకవర్గానికి ప్రతిపక్షంగా ఉండటమే మా ధ్యేయం. సమస్యలపై పోరాడటం మా ఎజెండా. ఇప్పుడు స్వీయ పాలనలోనూ నోరెత్తని దుస్థితే ఉంటే అమరవీరుల త్యాగాలకు అర్థం ఉండదు. అందుకే తెలంగాణ నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం అనివార్యమే.
- ప్రొఫెసర్ ఎ. గోపాలకృష్ణ
తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటీ, ఛైర్మన్