హేమాహేమీలకు ప్రత్యర్థుల సవాల్ | Tough competition between MPs, MLAs in Telangana Districts for elections 2014 | Sakshi
Sakshi News home page

హేమాహేమీలకు ప్రత్యర్థుల సవాల్

Published Tue, Apr 29 2014 1:19 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

Tough competition between MPs, MLAs in Telangana Districts for elections 2014

తెలంగాణ జిల్లాల్లో బరిలో నిలిచిన సీనియర్ నాయకులు గెలుపుకోసం ప్రత్యర్థులతో హోరాహోరీగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో  ఓటమి చెందిన పలువురు ఉద్దండులు ఈ దఫా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాజకీయంలో తలపండిన వీరంతా.. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం చెమటోడుస్తున్నారు. వీరి భవితవ్యం తేలే సమయం దగ్గరపడడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.     
- సాక్షి నెట్‌వర్క్
 
తెలంగాణ జిల్లాలో.. ఎంపీ అభ్యర్ధులు
 ‘ఫ్యాన్’గాలిలో...
 ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా ముందున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలే ఆసరాగా ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ఈయన స్థానికుడు కావడం బాగా కలిసి వచ్చే అంశం. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు.. వరంగల్, సీపీఐ అభ్యర్థి నారాయణ చిత్తూరు జిల్లాలకు చెందిన వారు కావడం, పొంగులేటి ఖమ్మం వాసి కావడంతో ‘స్థానికత’ అంశం ఓట్లు రాలుస్తుందనే భావనలో ఆయన ఉన్నారు. పార్లమెంటు స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడం, వైఎస్ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు లక్షల సంఖ్యలో ఉండడం ఈయనకు కలిసివచ్చే అంశం.
 
 ఉత్కంఠ పోరులో...
 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షించారు. కరీంనగర్ ఎంపీ సీటుకు రెండోసారి పోటీ చేస్తున్న ఆయన.. టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డిలతో తలపడుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో 56 శాతం బీసీ ఓటర్లున్నారు.   పాత పరిచయాలు, నరేంద్ర మోడీ గాలి తనకు అనుకూలిస్తుందనే ధీమాతో విద్యాసాగర్‌రావు ఉన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డి ఆశగా ఉన్నారు.
 
 అటు... ఇటూ...
 సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిని నిందించి టీఆర్‌ఎస్ లో చేరిన వివేక్.. తీరా ఎన్నికలకు ముందు మళ్లీ సొంత గూ టికి చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్‌ఎస్ నుం చి విద్యార్థి జేఏసీ నాయకుడు బాల్క సుమన్, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ శరత్.. వివేక్‌తో పోటీ పడుతున్నారు.   రాజకీయ అనుభవంతో పాటు సింగరేణిలో తనకున్న పట్టు, తండ్రి వెంకటస్వామి (కాకా)కి ఉన్న పరిచయాలు, పారిశ్రామికవేత్త కావడం వివేక్‌కు అనుకూలిస్తున్నాయి.  

 ‘వరం’గల్లేనా...
 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పదేళ్లపాటు జిల్లాలో చక్రం తిప్పిన కడియం శ్రీహరి ప్రస్తుతం వరంగల్ లోక్‌సభకు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని అన్ని పార్టీల నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఈ సెగ్మెంట్ ఈ పార్టీకి అనుకూలంగానే ఉంటోంది. సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యపై వ్యతిరేకత  శ్రీహరికి అనుకూలంగా మారవచ్చు.
 
 జైపాల్‌కు సవాలే...
 మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు. తొలిసారిగా లోక్‌సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తుండడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో చేవెళ్లలో జైపాల్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జితేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆయనతోనే మళ్లీ పోటీ పడుతున్నారు.  జైపాల్‌రెడ్డి ప్రధానంగా మైనార్టీ ఓట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ నుంచి హెచ్‌ఏ రహమాన్ బరిలో ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఏర్పడింది.
 
ఎమ్మెల్యే అభ్యర్థులు

 సవాలు విసురుతూ...
 కల్వకుర్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి ప్రత్యర్థి శిబిరాల్లోని గందరగోళాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వంశీ చందర్ రెడ్డి (కాంగ్రెస్) ఓట్లను కసిరెడ్డి నారాయణరెడ్డి (స్వతంత్ర) భారీగా చీల్చుతున్నారు. టీఆర్‌ఎస్ టికెట్ దక్కని బాలాజీ సింగ్ అధికారిక అభ్యర్థి జైపాల్ యాదవ్ ఓట్లకు గండికొడుతున్నారు. టీడీపీ శ్రేణులు వలస వెళ్లడంతో బీజేపీ అభ్యర్థి ఆచారి సొంత బలాన్నే నమ్ముకున్నారు.


 పటిష్ట క్యాడర్‌తో ధీమా...
 కొత్తగూడెం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. కొత్తగూడెంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్న అభిప్రాయం ఉంది. కాగా, కూనంనేని సాంబశివరావు (సీపీఐ) తాజా మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై సహజంగానే కొంత అసంతృప్తి ఉంది. టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న జలగం వెంకట్రావు తన కుటుంబానికి ఉన్న పరిచయాలు, తెలంగాణవాదంపైనే ఆధారపడ్డారు. అయితే ఎన్నికల తర్వాత ఈయన జిల్లాలో ఉండరనే ప్రచారం జరుగుతోంది. ముప్పై ఏళ్లుగా కొత్తగూడెం కేంద్రంగా రాజకీయాల్లో ఉండడం, పటిష్టమైన కేడర్ వనమాకు కలిసి రానున్నాయి. ఆయన వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన తర్వాత కొత్తగూడెంలో కాంగ్రెస్ కనుమరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
 చెమటోడుస్తున్న...
 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు  పొన్నాల లక్ష్మయ్య జనగామలో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి వి.శంకరాచారి బరిలో ఉన్నారు.  పోటీ ప్రధానంగా కాంగ్రె స్, టీఆర్‌ఎస్ మధ్యే ఉంది. 1999 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న పొన్నాల పదేళ్లు మంత్రిగా పనిచేశారు. ఇపుడు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని చెబుతున్న పొన్నాల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లాలోనే లేకపోవడం టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా మారింది. 2009 ఎన్నికల్లో పొన్నాల కేవలం 236 ఓట్లతోనే గెలిచారు. అప్పటికంటే ఇప్పుడు వ్యతిరేకత పెరగడంతో గెలుపు కోసం చెమటోడుస్తున్నారు.
 
 ‘సిరి’ ఎవరిదో...
 టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. గతంలో ఇక్కడి నుంచే రెండుసార్లు గెలిచిన కేటీఆర్ పార్టీ కేడర్‌తో సంబంధాలు మెరుగుపరుచుకున్నా రు. కానీ స్థానికేతరుడు కావ డం  ప్రతికూలంగా మారింది. ఈ తరుణంలో కేటీఆర్ కాంగ్రె స్ అభ్యర్థి, కేడీసీసీబీ అధ్యక్షు డు కొండూరి రవీందర్‌రావు, బీజేపీ అభ్యర్థి ఆకుల విజయతో త్రిముఖ పోరు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున శ్రీధర్‌రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. సమస్యలతో సహజీవనం చేస్తున్న నేత కార్మికులు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
 
 సెంటిమెంటే...
 టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి ముద్దసాని కశ్యప్‌రెడ్డితో తల పడుతున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున సందమల్ల నరేశ్ ఇక్కడి పోటీలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈటెలకు ఉన్న గుర్తింపు, టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత నాయకుడనే ప్రచారం ఆయనకు అనుకూలిస్తుండగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఆయనకు ప్రతికూలాంశంగా మారింది.
 
 ఓటమి మరచి...
1999, 2004 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి  వరుసగా గెలుపొందిన డీఎస్ 2009, 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో నిజామాబాద్ రూరల్‌లో పోటీ చేస్తున్నారు.  టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగి న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థి గడ్డం (కేశపల్లి) ఆనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి బొడ్డు(సిర్పూరు)గంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నా ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
 గట్టెక్కేదెలా...
 చక్కెర ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్న బోధన్ రాజకీయాలు చివరకు ఎవరిని గట్టెక్కిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. 1999 నుంచి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి బరిలో ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్, టీడీపీలు కూడా దృష్టి సారించాయి. కేసీఆర్ ఇటీవలే భారీ ప్రచారసభ నిర్వహించగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బోధన్ సభలో ప్రసంగించారు. సుదర్శన్‌రెడ్డికి ఈ దఫా ఎన్నిక సవాల్‌గా మారింది. టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు షకీల్, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, కాటిపెల్లి సుధీప్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
 
 సురేఖ వర్సెస్ సారయ్య
 బస్వరాజు సారయ్య మళ్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1999 నుంచి గెలుస్తూ వస్తున్న ఆయనను ప్రస్తుత ఎన్నికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గత మూడు ఎన్నికల్లోనూ సులభంగా గెలిచిన సారయ్యకు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. టీఆర్‌ఎస్ నుంచి మాజీమంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి రావు పద్మ పోటీలో ఉన్నారు. సారయ్యపై స్వతహాగా ఉన్న వ్యతిరేకతతోపాటు కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఈసారి ఆయనకు పెద్ద సమస్యగా మారాయి. రాజకీయంగా రెండో ఇన్సింగ్ ప్రారంభించిన కొండా సురేఖకు, సారయ్యకు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వ్యూహ ప్రతివ్యూహాలతో రోజురోజుకు ఇక్కడ సమీకరణలు మారుతున్నాయి. ఇక్కడ 40వేల మందికిపైగా ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారనేదానిపైనే వీరి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
 
 ఈసారైనా...?
 ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి ఈసారి కూడా గట్టి పోటీని ఎదుర్కొంటున్నా రు. 1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన సురేష్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరు బాట పట్టా రు. 2009లో ఆర్మూరులో ఓట మి చెందిన ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలో ఉన్నారు.  ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్మూరులో దూసుకెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ పోటీలో ఉన్నారు.  దీంతో త్రిముఖపోరులో సురేష్‌రెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ సాగుతోంది.  
 
 నువ్వా... నేనా...
 మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఈసారి గడ్డు పరిస్థితి చవిచూస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్థి పుట్ట మధు (టీఆర్‌ఎస్)తో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.  వరుసగా ఇక్కడే మూడు సార్లు గెలిచిన అనుభవం శ్రీధర్ బాబుకు అనుకూలించనుంది. అయితే ఆయన అనుచరుల హల్‌చల్, అభివృద్ధి పనుల్లో వారిపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల కొంత వ్యతిరేకత ఏర్పడింది. టీడీపీ తరఫున కర్రు నాగయ్య, టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థి సునీల్‌రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండవచ్చు.
 
 ఈ ఒక్కసారి...
 తనకు చివరిసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.  ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఎనిమిదిసార్లు పోటీ చేసి అయిదుసార్లు గెలిచారు.  ఎన్టీఆర్, వైఎస్ మంత్రి వర్గా ల్లో పనిచేశారు. ఇపుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. తన పాత ప్రత్య ర్థి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్.రమణతో తలపడుతున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన టీఆర్‌ఎస్  తరఫున డాక్టర్ సంజయ్‌కుమార్ బరిలో ఉండడం తో త్రిముఖ పోటీ తప్పదని విశ్లేషకుల అంచనా. వైఎస్సార్ సీపీ తరఫున కట్టా సంధ్యారాణి పోటీ చేస్తున్నారు.
 
 ఎదురీత...
 తెలుగుదేశం తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి నుంచి మళ్లీ బరి లోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, టీఆర్ ఎస్ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురూ సీనియర్ నేతలే కావడంతో ఇక్కడ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నా యి. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన దయాకర్‌రావు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్నందున జనం వైఖరిపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
 
 ముచ్చెమటలు...
2009లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డి నుంచి తలపడుతున్నారు. టీపీసీసీలో కీలక బాధ్యతలు పొందిన ఆయన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థులందరూ తెలంగాణ నినాదం వినిపిస్తుండగా, తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ షబ్బీర్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ,టీడీపీ కూటమి అభ్యర్థి సిద్ధిరాములు, వైఎస్సార్ సీపీ నుంచి పైలా కృష్ణారెడ్డి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.
 
 అధిగమిస్తేనే...
 డిప్యూటీ స్పీకర్ హోదాలో మధిర అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లుభట్టి విక్రమార్క ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందనే భావనలో ఉన్నారు.  సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుండగా, నల్లగొం డ జిల్లా నుంచి వలస వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం రెండూ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల కేడర్ కలిసి పనిచేస్తే కమల్‌రాజ్ విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు.
 
 గట్టి పోటీ
ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కూరాకుల నాగ భూషణ (వైఎస్సార్‌సీపీ), పువ్వాడ అజయ్‌కుమార్ (కాంగ్రెస్) నుంచి గట్టిపోటీ ఎదురవుతోం ది. టీఆర్‌ఎస్ నుంచి పోటీచేస్తున్న గుండాల కృష్ణ (ఆర్జేసీ) చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్, జగన్ అభిమానులతో పాటు పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీ కేడర్, బీసీ వర్గాలకు చెందిన ఓట్లపై కూరాకుల ఆశలు పెట్టుకోగా, తన తండ్రి ఛరిష్మా, కాంగ్రెస్ కేడర్‌ను నమ్ముకుని అజయ్ ముందుకెళ్తున్నారు.  
 
 కలిసొచ్చేనా...
 తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాస్‌గౌడ్‌ను మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ నిలబెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ), ఒబేదుల్లా కొత్వాల్ (కాంగ్రెస్), బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) నడుమ బహుముఖ పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. తెలంగాణ వాదంపైనే శ్రీనివాస్‌గౌడ్ ఆశలు పెట్టుకున్నారు.  2012 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నంకు మద్దతు ఇచ్చిన వర్గాలు ప్రస్తుతం దూరంగా ఉండడం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.
 
 తెలంగాణవాదంపైనే
 వైరా నుంచి గత శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన బానోతు చంద్రావతికి ఈసారి సీపీఐ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగారు.  ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నా పరిపూర్ణ రాజకీ య నాయకురాలు కాలేకపోవడం ఈమెకు మైనస్‌పాయింట్. తెలంగాణవాదంపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉన్న బానోతు మదన్‌లాల్‌పై కూడా ప్రజల్లో మంచి అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి బాలాజీనాయక్ ప్రచారంలో శ్రమిం చారు. సీపీఐ నుంచి బరిలో ఉన్న మూడు నారాయణకు కాం గ్రెస్ కేడర్ ఏ మేరకు సహకరిస్తుందనే అనుమానాలున్నాయి.
 
 నోముల గండం
 నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డికి టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డి వైఎస్ అభిమాన ఓటుపై ఆశలు పెట్టుకోగా టీడీపీ అభ్యర్థి కడారి అంజయ్య యాదవ్ సొంత ఓటుబ్యాంకునే నమ్ముకుంది. ఇక్కడ బీసీ, ఓసీ ఫీలింగ్ తీసుకొచ్చి ఓట్లను చీల్లే ప్రయత్నం విజయవంతంగా సాగుతుండడంతో జానారెడ్డి ఒకింత గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మొత్తంగా గట్టి పోటీ ఎదుర్కొంటున్న జానారెడ్డి స్వతహాగా తనపై ఉన్న వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
 ఉత్తమ్‌కు చెమటలు
 హుజూర్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి రూపంలో పెద్ద గండమే పొంచి ఉంది. కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థి కాసోజు శంకరమ్మ సెంటిమెంటు ఓటుపై ఆధారపడుతుండగా వైఎ స్సార్‌సీపీ వైఎస్ అందించిన అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న వారి ఓట్లపై నమ్మ కం పెట్టుకుంది.  టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్ ఉనికికోసం పాకులాడుతుండగా అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు మాజీ మంత్రికి ప్రతికూలంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement