అగ్గి బరాటా.. ఐలమ్మ
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ రైతులు సాగించిన పోరాటంలో ముందుండి నడిచిన మహిళ చాకలి ఐలమ్మ. భర్తను, కుమారులను జైలు పాల్జేసి.. కష్టపడి పండించిన పంటను దోచుకోవాలని ప్రయత్నించిన విస్నూరు దేశ్‌ముఖ్‌కు ఎదురు నిలిచిన ధీశాలి. ఆమె భూ పోరాట చరిత్ర నేటికీ మహిళలకు స్ఫూర్తి.
- పిన్నింటి గోపాల్, వరంగల్
నిజాంకు సేనాపతిగా ఉన్న విస్నూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి 60 గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండేవాడు. ఆయన, నిరంకుశ పాలనలో నిత్యం పీడనకు గురవుతున్న కుటుంబాల్లో ఐలమ్మ కుటుంబం ఒకటి. వరంగల్ జిల్లా రాయపర్తి సమీపంలోని కిష్టాపురంలో 1895లో ఐలమ్మ జన్మించింది. ఓరుగంటి సాయిలు, మల్లమ్మ దంపతుల ఆరుగురు కుమార్తెలు, నలుగురు కుమారుల్లో ఐలమ్మ నాలుగో సంతానం. పాలకుర్తికి చెందిన నర్సయ్యతో ఆమెకు వివాహమైంది. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చాకలి వృత్తి చేస్తూ పొట్టపోసుకునేవారు. మరో ఇద్దరు పేద రైతులతో కలసి ఐలమ్మ రెండెకరాల భూమి కౌలు చేసేది.
సొంత పనుల కంటే ముందు దేశ్‌ముఖ్ ఇంటి, పొలం పనులు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో 1944లో దేవరుప్పుల మండలం కడవెండిలో నల్ల నర్సింహులు, రావి నారాయణరెడ్డి ప్రోత్సాహంతో సంఘం (ఆంధ్ర మహాసభ) కార్యక్రమాలు మొదలయ్యాయి. రావి నారాయణరెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు భూ పోరాటాలు సాగించారు. వెట్టి చాకిరికి నిరసనగా.. భూమిపై హక్కుల కోసం పోరాటంలో భాగంగా నల్ల నర్సింహలు, యాదగిరిరావు పాలకుర్తికి వచ్చిన ప్పుడు ఐలమ్మతో, ఆమె భర్త చిట్యాల నర్సయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర బాధల నుంచి బయటపడేందుకు ప్రజలను సమీకరించిన సంఘం నాయకులు ఐలమ్మ ఇంటిపై ఎర్రజెండా ఎగురవేశారు.
భూపోరాటానికి నాంది
ఐలమ్మ సంఘం కార్యకర్తగా పాలకుర్తిలో 1945 శివరాత్రి రోజున ఆంధ్రమహాసభ మొదలైంది. ఆ సభను భగ్నం చేసేందుకు దేశ్‌ముఖ్ విఫలయత్నం చేశాడు. తర్వాత ఐలమ్మ భర్త నర్సయ్య, ఇద్దరు కుమారులు సోమయ్య, లచ్చయ్యలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదే అదనుగా ఐలమ్మ కౌలుభూమిని దేశ్‌ముఖ్ స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. మల్లంపల్లికి చెందిన కొండల్‌రావు ఆమె భూమిని బలవంతంగా దేశ్‌ముఖ్ పేరిట రాయించాడు. పొలం తమదేనంటూ పొలంలోని పంటను ధ్వంసం చేసేందుకు పథకం రూపొందించాడు. దీంతో ఆంధ్ర మహాసభ భీంరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మ గాని ధర్మభిక్షం, రామచంద్రారెడ్డి మరికొందరు కార్యకర్తలను పాలకుర్తికి పంపింది. వారు దేశ్‌ముఖ్ గుండాలను తరిమికొట్టారు.
దేశ్‌ముఖ్ ఆంధ్ర మహాసభ నాయకులపై కేసు పెట్టించాడు. నిజాం పోలీసులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, యాదగిరిరావు తదితరులపై దొమ్మీ కేసు బనాయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ కేసు వాదించి వారిని విడుదల చేయించారు. ఇలా తొలి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ స్ఫూర్తితో దేశ్‌ముఖ్‌లపై భూపోరాటాలు విస్తృతమయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబరు 10న తుదిశ్వాస విడిచారు.