Telangana MLAs
-
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. నందూ డైరీలో 50 మంది నేతల పేర్లు!
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీ యాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. టీఆర్ఎస్, బీజేపీల నడుమ రాజకీయ యుద్ధం లాగా సాగుతున్న ఈ ఎపిసోడ్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్న నందకుమార్ డైరీలో సంచలన విషయా లున్నాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయనేతలుగా చెలామణి అవుతున్న నాయకుల పేర్లు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది నేతల పేర్లు డైరీలో ఉన్నాయని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో 25 మంది ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అంగీకరించారని సునీల్ బన్సల్ పేరిట ఉన్న సెల్‌ఫోన్‌కు రామచంద్రభారతి నుంచి మెసేజ్ వెళ్లిందన్న విషయం ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు ఈ జాబితాలో ఉన్న నాయకులెవరూ? అందరూ ఎమ్మెల్యేలేనా? లేదా మాజీలా? ఎమ్మెల్యే స్థాయి నాయకులు నందకుమార్‌తో టచ్‌లోకి వచ్చారా లేదా వీరితో సంప్రదింపులు జరపాలని టార్గెట్‌గా పెట్టుకుని డైరీలో వీరి పేర్లను రాసుకున్నాడా? అసలెవరెవరు టచ్‌లో ఉన్నారు? నందకుమార్ నీడ పడిన నేతల డీల్స్ ఎంతవరకు వచ్చాయి? ఈ పేర్లుగల నాయకుల విషయంలో భవిష్యత్తులో ఏం జరుగబోతోంది? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రూపాయి కావాలా.... నాయనా? నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు, పైలట్ రోహిత్‌రెడ్డిల నడుమ ఆడియో సంభాషణలు ఓ ఎత్తయితే, నందకుమార్ డైరీలో ఎవరి పేర్లున్నాయనే అంశం మరోఎత్తుగా మారింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు పెట్టుకున్న నందకుమార్ (ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే మీడియాలో వచ్చాయి) ఏ పార్టీలోని ఏ నాయకుడితో డీల్ మాట్లాడుకున్నాడనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో కాంట్రాక్టులు చేసిన, చేస్తున్న నాయకులు, ఆర్థిక అవసరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా చేసుకుని నందూ టీం పనిచేయాలని భావించిందని, అందులో భాగంగానే పలువురితో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంకో ఏడాది కాలంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఖర్చులకు అవసరమైన ‘రూపాయలు’సమకూర్చుకుంటే చాలనే ఆలోచనతో ఉన్న నేతల కూపీ లాగి వారితో టచ్‌లోకి వెళ్లాడా? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికలకు అవసరమయ్యేంత సమకూరిస్తే డీల్ ఓకే చెప్పిన నాయకులెంతమంది? రాష్ట్రంలోని 50 మందినేతలను వడపోసేందుకు నందకుమార్ ఎంచుకున్న ప్రాతిపదిక ఏంటి? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మరి నందకుమార్ డైరీనా... మజాకా? చదవండి: తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర -
ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్? కానీ,..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. కానీ,మావోయిస్టులు ఎలాంటి హింసకూ పాల్పడలేదు. రాష్ట్రస్థాయి నాయకులు ప్రవేశించినప్పటికీ హింసకు పాల్పడకపోవడం వెనుక టైమ్‌బాంబు తరహాలో దాడి చేసి నింపాదిగా తప్పించుకునే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక, భౌగోళిక కారణాలతో..! రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేసి నిమిషాల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయే వీలుంది. అదే రామగుండం ఏరియా మొత్తం మైదానప్రాంతం. ఇక్కడ ఎలాంటి హింసకు దిగినా వెంటనే పట్టుబడతారు. అందుకే తొలుత చెన్నూరు,బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మా వోయిస్టులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై వారిలో భిన్నాభిప్రాయా లు వచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే కావడంతో వీరిపై దాడికి దిగితే.. ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న ఆందోళనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విషయంలో సామాజిక కోణం.. రామగుండం ఎమ్మెల్యే విషయంలో భౌగోళిక అననుకూల కారణాలతో రెక్కీ నిర్వహించినా.. దాడికి సాహసించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అగ్రనేతల రాకతో కలకలం ఉత్తరాన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. గోదావరికి ఇరువైపులా వీరి పోస్టర్లు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజిరెడ్డి బసంత్‌నగర్ పరిసరాల్లో సంచరించడం వెనక కారణాలను కూడా గుర్తించారని సమాచారం. రాజిరెడ్డి ఇక్కడ వైద్యం కూడా చేయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు. సులువుగా సరిహద్దు దాటేలా.. ఎలాగైనా దాడి చేయాలని వచ్చిన మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఖాకీలు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మావోలు సంచలన హత్యలు, బహిరంగ దాడులకు సాహసం చేయలేరు. అలాగని హింసకు పాల్పడరన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఆర్ఎఫ్సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) కొలువుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారుల్లో ఒక్కరినైనా టైమ్‌బాంబుతో హతమార్చవచ్చని అనుమానిస్తున్నారు. అది మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో పునర్వైభవంతోపాటు నిధులు, కేడర్ రిక్రూట్మెంట్కు దోహదపడుతుందన్నది వ్యూహం. టైమ్‌బాంబు పెట్టిన వ్యక్తి అది పేలే లోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మావోయిస్టులు క్షేమంగా రాష్ట్ర సరిహద్దులు దాటే వరకూ హత్య లేదా హింస విషయాలు బయటకి రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇక్కడ అనుమానితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంచారు. -
బెంగళూరు డ్రగ్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, బెంగళూరు : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో పబ్‌లు, హోటళ్లు నిర్వహించే ఈ ఇద్దరూ తెలంగాణకు చెందిన ప్రముఖులకు పార్టీ ఇచ్చేవారని తెలిసింది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు సినీ ప్రముఖులు పార్టీల్లో పాల్గొనేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతోపాటు కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడతో కలిసి వారు పలు సినిమాలకు ఫైనాన్స్ కూడా చేస్తున్నట్టు తేలింది. గుట్టువిప్పిన నైజీరియన్ ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నైజీరియన్ బెంగుళూరు పోలీసులు విచారించగా.. వారు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నుంచి ఓ ఇద్దరు తప్పించుకుని తిరుగుతుండగా.. ఇప్పటికే ఒకరిని బెంగళూరు పోలీసులు విచారించారు. ఈక్రమంలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యాపార వేత్త ప్రజాప్రతినిధులకు పార్టీ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు ఉన్నట్టు వెల్లడించారు. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని, నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని పేర్కొన్నారు. చదవండి: డ్రగ్స్ కేసులో వివాదాస్పద బాలీవుడ్ నటుడు అరెస్టు -
వెంటాడుతున్న కేసులు: కోర్టుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వరుస కట్టారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (ములుగు)పై జారీ చేసిన నాన్ బెయిల్ వారెంట్‌ను కోర్టు ఉప సంహరించుకోగా.. అయితే రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వేర్వేరు కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి) కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ముందు విచారణ కోసం వచ్చారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇంకొక కేసులో సమన్లు జారీ చేసిన కూడా గైర్హాజరవడంతో నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఎన్బీడబ్ల్యూ అమలు చేయకపోవడంపై అతడిని కోర్టు పిలిచింది. అయితే ఎస్హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు సహకరించేలా అతడు వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. -
గోదావరి ఘటనపై అలర్ట్ చేసిన సీఎం !
సాక్షి ప్రతినిధి, వరంగల్: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఆదివారం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఈ ఘటన నుంచి కడిపికొండ వాసులు 14 మందిలో ఐదుగురు బయటపడగా హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం రెండు, మంగళవారం మూడు.. మొత్తం ఐదుదగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఇందులో బస్కె అవినాష్, బస్కే రాజేందర్ అంత్యక్రియలు మంగళవారం జరగ్గా... సిద్ది వెంకటస్వామి, గడ్డమీది సునిల్, గొర్రె రాజేందర్ల మృతదేహాలు మంగళవారం రాత్రికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఐదుగురిని వరంగల్‌కు చేర్చడం.. ఇద్దరి మృతదేహాలను కడిపికొండ చేర్చడంపై జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్‌తో కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇక కేసీఆర్, కేటీఆర్ ఆదేశం మేరకు చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ మంగళవారం కడిపికొండకు చేరుకున్నారు. బాధిత కుటు ంబాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్న ఆయన టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటే మరో రూ.2 లక్షలు, అసంఘటిత కార్మికులైతే రూ.6 లక్షల వరకు వస్తాయని చెప్పి భరోసా కల్పించారు. కాగా, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరి రాజ్‌కుమార్ ఆచూకీ లభించేవరకు రాజమండ్రిలోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ‘సాక్షి ప్రతినిధి’కి ఫోన్లో తెలిపారు. రాజమండ్రి హెల్ప్ డెస్క్‌లో మనోళ్లు గోదావరి నదిలో బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన, మృతి చెందిన వారి సమాచారం కోసం రాజమండిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. అందులో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఆర్ఐ సుంరేందర్, వీఆర్వో జోసెఫ్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పడు జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, బాధిత కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. అలాగే, కడిపికొండకు చెందిన పలువురు కూడా తమ వారిని గుర్తించేందుకు అక్కడే ఉన్నారు. -
తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు
-
తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ ఝలక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యులకు ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచిన స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో ఉన్న ఆస్తులు తాజాగా అఫిడవిట్లో పొందుపరచిన ఆస్తులతో వ్యత్యాసాలపై ఎమ్మెల్యేల వివరణ కోరింది. ఐటీ శాఖ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల్లో గతంతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనబడటంతో ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల ఆస్తులు భారీగా పెరిగినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఈ మేరకు చర్య తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు పంపిందా, కొంతమందికే జారీ చేసిందా అనేది వెల్లడి కాలేదు. ఎవరెవరికి నోటీసులు ఇచ్చారనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. -
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కొత్త మలుపు
-
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కొత్త మలుపు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ నిర్ణయించారు. స్పీకర్ వద్ద పిటిషన్ల విచారణ పెండింగులో ఉన్నప్పుడు దానిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని అటార్నీ జనరల్ వాదించారు. గతంలో ఈ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన ఉదహరించారు. ఆయన వాదనలపై సుప్రీం ధర్మాసనం నిశితంగా ప్రశ్నలు వేసింది. గతంలో సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చినప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని, దేశంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద దీర్ఘకాలం పెండింగులో ఉండిపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అలాంటిది పిటిషన్లు పెండింగులో ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించింది. వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని, వారందరిపైనా అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎప్పటిలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారో ఈనెల 8వ తేదీన చెప్పాలని ఇంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌కు సూచించింది. దానిపై మంగళవారం నాటి వాదనల్లో కొత్త అంశాలు తెరపైకి రావడంతో.. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు దాన్ని ఎలా ఉల్లంఘిస్తారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తే ఇక అది అన్ని రాష్ట్రాలకూ ఒక మార్గదర్శకంగా కూడా ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రాథమిక హక్కులకు సంబంధించి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు.. ఇక వాటిని సవాలు చేయడానికి కూడా వీల్లేకుండా రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇస్తుంది. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారు. -
మాకూ వేతనాలు పెంచాలి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ
సాక్షి, హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎంను కలసి తమ కూ వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు స మాచారం. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 60మంది వేతనాలు పెంచాలని సంతకాలు పెట్టినట్లు సమాచారం. -
రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరుస్తూ కథనం ప్రసారం చేసిన కేసులో టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బలుసు శివశంకరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ డజనుకుపైగా షరతులు విధించారు. టీవీ 9 కథనంపై న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయటం తెలిసిందే. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: రవిప్రకాశ్
హైకోర్టులో టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్.బి.నగర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. కిందికోర్టులో తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రావడంలేదని, అందువల్ల కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు భయంగా ఉందని, ఆ కారణంతోనే నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని ఆ పిటిషన్లో వివరించారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారించారు. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు. -
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
-
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ను ప్రొటెం స్పీకర్ కె. జానారెడ్డి అభినందించారు. కేసీఆర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి. రాజయ్య, మంత్రి ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఫ్లోర్ లీడర్లతో కేసీఆర్ భేటీ కానున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై చర్చించనున్నారు. ఫ్లోర్ లీడర్ల సహకారాన్ని కేసీఆర్ కోరనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మల్యే మధుసూదనాచారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
హేమాహేమీలకు ప్రత్యర్థుల సవాల్
తెలంగాణ జిల్లాల్లో బరిలో నిలిచిన సీనియర్ నాయకులు గెలుపుకోసం ప్రత్యర్థులతో హోరాహోరీగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు ఉద్దండులు ఈ దఫా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాజకీయంలో తలపండిన వీరంతా.. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం చెమటోడుస్తున్నారు. వీరి భవితవ్యం తేలే సమయం దగ్గరపడడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. - సాక్షి నెట్వర్క్ తెలంగాణ జిల్లాలో.. ఎంపీ అభ్యర్ధులు ‘ఫ్యాన్’గాలిలో... ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా ముందున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలే ఆసరాగా ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ఈయన స్థానికుడు కావడం బాగా కలిసి వచ్చే అంశం. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు.. వరంగల్, సీపీఐ అభ్యర్థి నారాయణ చిత్తూరు జిల్లాలకు చెందిన వారు కావడం, పొంగులేటి ఖమ్మం వాసి కావడంతో ‘స్థానికత’ అంశం ఓట్లు రాలుస్తుందనే భావనలో ఆయన ఉన్నారు. పార్లమెంటు స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం, వైఎస్ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు లక్షల సంఖ్యలో ఉండడం ఈయనకు కలిసివచ్చే అంశం. ఉత్కంఠ పోరులో... తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షించారు. కరీంనగర్ ఎంపీ సీటుకు రెండోసారి పోటీ చేస్తున్న ఆయన.. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డిలతో తలపడుతున్నారు. ఈ సెగ్మెంట్లో 56 శాతం బీసీ ఓటర్లున్నారు. పాత పరిచయాలు, నరేంద్ర మోడీ గాలి తనకు అనుకూలిస్తుందనే ధీమాతో విద్యాసాగర్‌రావు ఉన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డి ఆశగా ఉన్నారు. అటు... ఇటూ... సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిని నిందించి టీఆర్ఎస్ లో చేరిన వివేక్.. తీరా ఎన్నికలకు ముందు మళ్లీ సొంత గూ టికి చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్ఎస్ నుం చి విద్యార్థి జేఏసీ నాయకుడు బాల్క సుమన్, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ శరత్.. వివేక్‌తో పోటీ పడుతున్నారు. రాజకీయ అనుభవంతో పాటు సింగరేణిలో తనకున్న పట్టు, తండ్రి వెంకటస్వామి (కాకా)కి ఉన్న పరిచయాలు, పారిశ్రామికవేత్త కావడం వివేక్‌కు అనుకూలిస్తున్నాయి. ‘వరం’గల్లేనా... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పదేళ్లపాటు జిల్లాలో చక్రం తిప్పిన కడియం శ్రీహరి ప్రస్తుతం వరంగల్ లోక్‌సభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని అన్ని పార్టీల నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఈ సెగ్మెంట్ ఈ పార్టీకి అనుకూలంగానే ఉంటోంది. సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యపై వ్యతిరేకత శ్రీహరికి అనుకూలంగా మారవచ్చు. జైపాల్‌కు సవాలే... మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు. తొలిసారిగా లోక్‌సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తుండడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో చేవెళ్లలో జైపాల్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జితేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనతోనే మళ్లీ పోటీ పడుతున్నారు. జైపాల్‌రెడ్డి ప్రధానంగా మైనార్టీ ఓట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి హెచ్ఏ రహమాన్ బరిలో ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యే అభ్యర్థులు సవాలు విసురుతూ... కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి ప్రత్యర్థి శిబిరాల్లోని గందరగోళాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వంశీ చందర్ రెడ్డి (కాంగ్రెస్) ఓట్లను కసిరెడ్డి నారాయణరెడ్డి (స్వతంత్ర) భారీగా చీల్చుతున్నారు. టీఆర్ఎస్ టికెట్ దక్కని బాలాజీ సింగ్ అధికారిక అభ్యర్థి జైపాల్ యాదవ్ ఓట్లకు గండికొడుతున్నారు. టీడీపీ శ్రేణులు వలస వెళ్లడంతో బీజేపీ అభ్యర్థి ఆచారి సొంత బలాన్నే నమ్ముకున్నారు. పటిష్ట క్యాడర్‌తో ధీమా... కొత్తగూడెం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. కొత్తగూడెంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్న అభిప్రాయం ఉంది. కాగా, కూనంనేని సాంబశివరావు (సీపీఐ) తాజా మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై సహజంగానే కొంత అసంతృప్తి ఉంది. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న జలగం వెంకట్రావు తన కుటుంబానికి ఉన్న పరిచయాలు, తెలంగాణవాదంపైనే ఆధారపడ్డారు. అయితే ఎన్నికల తర్వాత ఈయన జిల్లాలో ఉండరనే ప్రచారం జరుగుతోంది. ముప్పై ఏళ్లుగా కొత్తగూడెం కేంద్రంగా రాజకీయాల్లో ఉండడం, పటిష్టమైన కేడర్ వనమాకు కలిసి రానున్నాయి. ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చిన తర్వాత కొత్తగూడెంలో కాంగ్రెస్ కనుమరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెమటోడుస్తున్న... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామలో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి వి.శంకరాచారి బరిలో ఉన్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రె స్, టీఆర్ఎస్ మధ్యే ఉంది. 1999 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న పొన్నాల పదేళ్లు మంత్రిగా పనిచేశారు. ఇపుడు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని చెబుతున్న పొన్నాల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లాలోనే లేకపోవడం టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా మారింది. 2009 ఎన్నికల్లో పొన్నాల కేవలం 236 ఓట్లతోనే గెలిచారు. అప్పటికంటే ఇప్పుడు వ్యతిరేకత పెరగడంతో గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ‘సిరి’ ఎవరిదో... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. గతంలో ఇక్కడి నుంచే రెండుసార్లు గెలిచిన కేటీఆర్ పార్టీ కేడర్‌తో సంబంధాలు మెరుగుపరుచుకున్నా రు. కానీ స్థానికేతరుడు కావ డం ప్రతికూలంగా మారింది. ఈ తరుణంలో కేటీఆర్ కాంగ్రె స్ అభ్యర్థి, కేడీసీసీబీ అధ్యక్షు డు కొండూరి రవీందర్రావు, బీజేపీ అభ్యర్థి ఆకుల విజయతో త్రిముఖ పోరు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున శ్రీధర్‌రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. సమస్యలతో సహజీవనం చేస్తున్న నేత కార్మికులు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. సెంటిమెంటే... టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి ముద్దసాని కశ్యప్రెడ్డితో తల పడుతున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున సందమల్ల నరేశ్ ఇక్కడి పోటీలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈటెలకు ఉన్న గుర్తింపు, టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత నాయకుడనే ప్రచారం ఆయనకు అనుకూలిస్తుండగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఆయనకు ప్రతికూలాంశంగా మారింది. ఓటమి మరచి... 1999, 2004 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి వరుసగా గెలుపొందిన డీఎస్ 2009, 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో నిజామాబాద్ రూరల్‌లో పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థి గడ్డం (కేశపల్లి) ఆనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి బొడ్డు(సిర్పూరు)గంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నా ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గట్టెక్కేదెలా... చక్కెర ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్న బోధన్ రాజకీయాలు చివరకు ఎవరిని గట్టెక్కిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. 1999 నుంచి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి బరిలో ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్, టీడీపీలు కూడా దృష్టి సారించాయి. కేసీఆర్ ఇటీవలే భారీ ప్రచారసభ నిర్వహించగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బోధన్ సభలో ప్రసంగించారు. సుదర్శన్‌రెడ్డికి ఈ దఫా ఎన్నిక సవాల్‌గా మారింది. టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు షకీల్, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, కాటిపెల్లి సుధీప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. సురేఖ వర్సెస్ సారయ్య బస్వరాజు సారయ్య మళ్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1999 నుంచి గెలుస్తూ వస్తున్న ఆయనను ప్రస్తుత ఎన్నికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గత మూడు ఎన్నికల్లోనూ సులభంగా గెలిచిన సారయ్యకు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. టీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి రావు పద్మ పోటీలో ఉన్నారు. సారయ్యపై స్వతహాగా ఉన్న వ్యతిరేకతతోపాటు కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఈసారి ఆయనకు పెద్ద సమస్యగా మారాయి. రాజకీయంగా రెండో ఇన్సింగ్ ప్రారంభించిన కొండా సురేఖకు, సారయ్యకు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వ్యూహ ప్రతివ్యూహాలతో రోజురోజుకు ఇక్కడ సమీకరణలు మారుతున్నాయి. ఇక్కడ 40వేల మందికిపైగా ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారనేదానిపైనే వీరి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈసారైనా...? ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి ఈసారి కూడా గట్టి పోటీని ఎదుర్కొంటున్నా రు. 1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన సురేష్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరు బాట పట్టా రు. 2009లో ఆర్మూరులో ఓట మి చెందిన ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్మూరులో దూసుకెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ పోటీలో ఉన్నారు. దీంతో త్రిముఖపోరులో సురేష్‌రెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ సాగుతోంది. నువ్వా... నేనా... మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఈసారి గడ్డు పరిస్థితి చవిచూస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్థి పుట్ట మధు (టీఆర్ఎస్)తో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. వరుసగా ఇక్కడే మూడు సార్లు గెలిచిన అనుభవం శ్రీధర్ బాబుకు అనుకూలించనుంది. అయితే ఆయన అనుచరుల హల్చల్, అభివృద్ధి పనుల్లో వారిపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల కొంత వ్యతిరేకత ఏర్పడింది. టీడీపీ తరఫున కర్రు నాగయ్య, టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి సునీల్‌రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండవచ్చు. ఈ ఒక్కసారి... తనకు చివరిసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఎనిమిదిసార్లు పోటీ చేసి అయిదుసార్లు గెలిచారు. ఎన్టీఆర్, వైఎస్ మంత్రి వర్గా ల్లో పనిచేశారు. ఇపుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. తన పాత ప్రత్య ర్థి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్.రమణతో తలపడుతున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన టీఆర్ఎస్ తరఫున డాక్టర్ సంజయ్‌కుమార్ బరిలో ఉండడం తో త్రిముఖ పోటీ తప్పదని విశ్లేషకుల అంచనా. వైఎస్సార్ సీపీ తరఫున కట్టా సంధ్యారాణి పోటీ చేస్తున్నారు. ఎదురీత... తెలుగుదేశం తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి నుంచి మళ్లీ బరి లోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, టీఆర్ ఎస్ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురూ సీనియర్ నేతలే కావడంతో ఇక్కడ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నా యి. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన దయాకర్‌రావు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్నందున జనం వైఖరిపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముచ్చెమటలు... 2009లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డి నుంచి తలపడుతున్నారు. టీపీసీసీలో కీలక బాధ్యతలు పొందిన ఆయన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థులందరూ తెలంగాణ నినాదం వినిపిస్తుండగా, తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ షబ్బీర్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ,టీడీపీ కూటమి అభ్యర్థి సిద్ధిరాములు, వైఎస్సార్ సీపీ నుంచి పైలా కృష్ణారెడ్డి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అధిగమిస్తేనే... డిప్యూటీ స్పీకర్ హోదాలో మధిర అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లుభట్టి విక్రమార్క ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందనే భావనలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుండగా, నల్లగొం డ జిల్లా నుంచి వలస వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ, సీపీఎం రెండూ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల కేడర్ కలిసి పనిచేస్తే కమల్‌రాజ్ విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. గట్టి పోటీ ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కూరాకుల నాగ భూషణ (వైఎస్సార్సీపీ), పువ్వాడ అజయ్‌కుమార్ (కాంగ్రెస్) నుంచి గట్టిపోటీ ఎదురవుతోం ది. టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న గుండాల కృష్ణ (ఆర్జేసీ) చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్, జగన్ అభిమానులతో పాటు పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీ కేడర్, బీసీ వర్గాలకు చెందిన ఓట్లపై కూరాకుల ఆశలు పెట్టుకోగా, తన తండ్రి ఛరిష్మా, కాంగ్రెస్ కేడర్‌ను నమ్ముకుని అజయ్ ముందుకెళ్తున్నారు. కలిసొచ్చేనా... తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాస్‌గౌడ్‌ను మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ నిలబెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ), ఒబేదుల్లా కొత్వాల్ (కాంగ్రెస్), బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) నడుమ బహుముఖ పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. తెలంగాణ వాదంపైనే శ్రీనివాస్‌గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. 2012 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నంకు మద్దతు ఇచ్చిన వర్గాలు ప్రస్తుతం దూరంగా ఉండడం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణవాదంపైనే వైరా నుంచి గత శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన బానోతు చంద్రావతికి ఈసారి సీపీఐ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నా పరిపూర్ణ రాజకీ య నాయకురాలు కాలేకపోవడం ఈమెకు మైనస్‌పాయింట్. తెలంగాణవాదంపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న బానోతు మదన్‌లాల్‌పై కూడా ప్రజల్లో మంచి అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి బాలాజీనాయక్ ప్రచారంలో శ్రమిం చారు. సీపీఐ నుంచి బరిలో ఉన్న మూడు నారాయణకు కాం గ్రెస్ కేడర్ ఏ మేరకు సహకరిస్తుందనే అనుమానాలున్నాయి. నోముల గండం నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డి వైఎస్ అభిమాన ఓటుపై ఆశలు పెట్టుకోగా టీడీపీ అభ్యర్థి కడారి అంజయ్య యాదవ్ సొంత ఓటుబ్యాంకునే నమ్ముకుంది. ఇక్కడ బీసీ, ఓసీ ఫీలింగ్ తీసుకొచ్చి ఓట్లను చీల్లే ప్రయత్నం విజయవంతంగా సాగుతుండడంతో జానారెడ్డి ఒకింత గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మొత్తంగా గట్టి పోటీ ఎదుర్కొంటున్న జానారెడ్డి స్వతహాగా తనపై ఉన్న వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్‌కు చెమటలు హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి రూపంలో పెద్ద గండమే పొంచి ఉంది. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి కాసోజు శంకరమ్మ సెంటిమెంటు ఓటుపై ఆధారపడుతుండగా వైఎ స్సార్సీపీ వైఎస్ అందించిన అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న వారి ఓట్లపై నమ్మ కం పెట్టుకుంది. టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్ ఉనికికోసం పాకులాడుతుండగా అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు మాజీ మంత్రికి ప్రతికూలంగా మారాయి. -
చర్చ జరగకుండా అడ్డుకోవటమే
-
స్పీకర్‌కు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖ!
హైదరాబాద్ : రాష్ట్రపతి పంపిన విభజన బిల్లుకు ఎటువంటి సవరణలుగానీ ఓటింగ్‌గానీ చేసే అధికారం అసెంబ్లీకి లేదని కేవలం క్లాజులవారీగా అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతి కోరారని తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్‌కు లేఖ రాసేపనిలో పడ్డారు. ఇతర రాష్ట్రాల్లో విభజన జరిగిన విధానాలతో రాష్ట్ర అసెంబ్లీకి సంబంధం లేదని.. బీహార్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ విభజన బిల్లుపై ఓటింగ్ జరిగిందని.. ఇక్కడ కూడా ఓటింగ్ నిర్వహిస్తామనడం సరికాదని.. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. బిల్లుపై ఓటింగ్, సవరణలు ఆమోదనీయం కావని తాము వ్యతిరేకిస్తామని అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈమేరకు తెలంగాణ సభ్యులందరి సంతకాలతో కూడిన లేఖ రాసే బాధ్యతను విప్ అనిల్‌కు అప్పగించారు. మరోవైపు విభజన బిల్లుపై ఓటింగ్ జరిపే అధికారం సభకు లేదంటూ.. బిల్లుపై సవరణలు అడగడం సరికాదని చెబుతూ తెలంగాణ మంత్రులు స్పీకర్‌ను కలిశారు. -
అసెంబ్లీలో టీ ఎమ్మెల్యేల బైఠాయింపు
స్పీకర్ పోడియం ముందు పొద్దుపోయే దాకా నిరసన విభజన బిల్లును చర్చించకుండా వారుుదా వేయడంపై ఆగ్రహం రాత్రి పదింటికి పార్టీ కార్యాలయాలకు తరలించిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చించకుండా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం టీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. బిల్లును అసెంబ్లీలో పెట్టి వారం రోజులుగా చర్చ జరపకపోగా వాయిదా వేయడం ద్వారా స్పీకర్ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చను కొనసాగించేదాకా ఇక్కడినుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. నిరసనను విరమించాలని అసెంబ్లీ కార్యదర్శి ఎస్.రాజా సదారాం కోరినా టీ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. మధ్యలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తిరిగి స్పీకర్ పోడియం దగ్గర కే వెళుతూ బైఠారుుంపు కొనసాగించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో డీసీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యేలందరినీ సీఎం, స్పీకర్, మంత్రులు ప్రవేశించే ఒకటో నంబర్ గేటు ద్వారా వేర్వేరు వాహనాల్లో వారి వారి పార్టీ కార్యాలయాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రవేశించే గేటును మూసివేసి విలేకరులకు కన్పించకుండా తరలించేందుకు ప్రయత్నించారు. బీఏసీలో నిర్ణయించినట్టుగా శుక్రవారం దాకా సమావేశాలను జరపకుండా ఒకరోజు ముందుగానే వాయిదా వేయడం ద్వారా ప్రభుత్వం, స్పీకర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఎమ్మెల్యేలు అంతకుముందు ఆరోపించారు. సభను వాయిదా వేయకుండా, వర్కింగ్ లంచ్‌ను ఏర్పాటు చేసి సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రాధాన్యతాంశమైన విభజన బిల్లుపై చర్చించకుండా పండుగలకు సెలవులు, విశ్రాంతి కావాలంటూ సభను 14 రోజులపాటు వాయిదా వేయడం దారుణమని విమర్శించారు. రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జనవరి 23 దాకా సభలో చర్చించకుండా తాత్సారం చేసి, చర్చించడానికి ఇంకా సమయం కావాలంటూ తెలంగాణ విభజనను ఆలస్యం చేయడానికి సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, తాడికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మొలుగూరి భిక్షపతి, దాస్యం వినయ్‌భాస్కర్, కె.విద్యాసాగర్‌రావు, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, జి.అరవింద్‌రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి, జోగు రామన్న, గంపా గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్సీలు కె.స్వామిగౌడ్, మహమూద్ అలీలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, కె.దయాకర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, సత్యవతీ రాథోడ్, సీతక్క, జైపాల్ యాదవ్, పి.రాములు తదితరులు కూడా పాల్గొన్నారు. స్వల్ప అస్వస్థతతో ఉన్న ఎర్రబెల్లి అసెంబ్లీలోనే చికిత్స చేయించుకున్నారు. రాష్ట్రపతిని, గవర్నర్‌ను కలుస్తాం: టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చించకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్న తీరుపై రాష్ట్రపతికి, గవర్నర్‌కు నివేదిస్తామని టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కుట్రపూరితంగా వ్యవహరిస్తోంటే తెలంగాణ ప్రాంత మంత్రులు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ప్రజలంతా గమనిస్తున్నారని నేతలు హెచ్చరించారు.