స్పీకర్ పోడియం ముందు పొద్దుపోయే దాకా నిరసన
విభజన బిల్లును చర్చించకుండా వారుుదా వేయడంపై ఆగ్రహం
రాత్రి పదింటికి పార్టీ కార్యాలయాలకు తరలించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చించకుండా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం టీఆర్‌ఎస్, బీజేపీ, తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. బిల్లును అసెంబ్లీలో పెట్టి వారం రోజులుగా చర్చ జరపకపోగా వాయిదా వేయడం ద్వారా స్పీకర్ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చను కొనసాగించేదాకా ఇక్కడినుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. నిరసనను విరమించాలని అసెంబ్లీ కార్యదర్శి ఎస్.రాజా సదారాం కోరినా టీ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. మధ్యలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తిరిగి స్పీకర్ పోడియం దగ్గర కే వెళుతూ బైఠారుుంపు కొనసాగించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో డీసీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యేలందరినీ సీఎం, స్పీకర్, మంత్రులు ప్రవేశించే ఒకటో నంబర్ గేటు ద్వారా వేర్వేరు వాహనాల్లో వారి వారి పార్టీ కార్యాలయాలకు తరలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రవేశించే గేటును మూసివేసి విలేకరులకు కన్పించకుండా తరలించేందుకు ప్రయత్నించారు. బీఏసీలో నిర్ణయించినట్టుగా శుక్రవారం దాకా సమావేశాలను జరపకుండా ఒకరోజు ముందుగానే వాయిదా వేయడం ద్వారా ప్రభుత్వం, స్పీకర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఎమ్మెల్యేలు అంతకుముందు ఆరోపించారు. సభను వాయిదా వేయకుండా, వర్కింగ్ లంచ్‌ను ఏర్పాటు చేసి సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రాధాన్యతాంశమైన విభజన బిల్లుపై చర్చించకుండా పండుగలకు సెలవులు, విశ్రాంతి కావాలంటూ సభను 14 రోజులపాటు వాయిదా వేయడం దారుణమని విమర్శించారు. రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జనవరి 23 దాకా సభలో చర్చించకుండా తాత్సారం చేసి, చర్చించడానికి ఇంకా సమయం కావాలంటూ తెలంగాణ విభజనను ఆలస్యం చేయడానికి సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, తాడికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మొలుగూరి భిక్షపతి, దాస్యం వినయ్‌భాస్కర్, కె.విద్యాసాగర్‌రావు, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, జి.అరవింద్‌రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి, జోగు రామన్న, గంపా గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్సీలు కె.స్వామిగౌడ్, మహమూద్ అలీలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, కె.దయాకర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, సత్యవతీ రాథోడ్, సీతక్క, జైపాల్ యాదవ్, పి.రాములు తదితరులు కూడా పాల్గొన్నారు. స్వల్ప అస్వస్థతతో ఉన్న ఎర్రబెల్లి అసెంబ్లీలోనే చికిత్స చేయించుకున్నారు.
రాష్ట్రపతిని, గవర్నర్‌ను కలుస్తాం: టీ ఎమ్మెల్యేలు
రాజ్యాంగానికి అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చించకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్న తీరుపై రాష్ట్రపతికి, గవర్నర్‌కు నివేదిస్తామని టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కుట్రపూరితంగా వ్యవహరిస్తోంటే తెలంగాణ ప్రాంత మంత్రులు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ప్రజలంతా గమనిస్తున్నారని నేతలు హెచ్చరించారు.