
మార్చి 1 నుంచి 5వ తేదీ లోపు నిర్వహణ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా...
అసెంబ్లీ ఆమోదం తర్వాత మూడింటిని కేంద్ర ఆమోదానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక భేటీలో బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిపాదించనుంది.
అసెంబ్లీలో చర్చ అనంతరం ఈ బిల్లులను ఆమోదిస్తారు. ఆపై వీటి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించనున్నారు. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం అనంతరం చట్టంగా రూపాంతరం చెందనుంది. దీంతోపాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోనుంది. ఈ మూడు బిల్లుల ముసాయిదా రూపకల్పనలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మూడు ముసాయిదా చట్టాలకు తుదిరూపు లభించనుంది.

బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మూడోవారంలో!
2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment