విభజన బిల్లుకు కౌంట్‌డౌన్
- రంగంలోకి దిగ్విజయ్
- గవర్నర్, మంత్రులతో నేరుగా చర్చ
- బిల్లుపై అసెంబ్లీలో సాఫీగా చర్చ సాగేలా కార్యాచరణ
- ‘సమస్యాత్మక’ ఎమ్మెల్యేలతో నేరుగా పెద్దల చర్చలు
- సీఎస్, రాష్ట్ర ఉన్నతాధికారులతో టచ్‌లో కేంద్రం
- సమావేశాల ఏర్పాట్లలో అసెంబ్లీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రుల బృందం గురువారం తెలంగాణ ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇచ్చాక ఏ క్షణమైనా అది రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయానికి రావచ్చని తెలుస్తోంది. అది ఒకవేళ గురువారం భేటీలో ఖరారు కాకున్నా వచ్చే వారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం నాటికి పూర్తి చేసి సమర్పిస్తారు. అప్పుడైనా అసెంబ్లీ సమావేశం మరో వారం తర్వాత జరుగుతుంది తప్ప అంతకుమించి ఆలస్యమయ్యే అవకాశం లేదని సభా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి అసెంబ్లీ అభిప్రాయం పూర్తిచేసి పంపేలా కేంద్రం పెద్దలు కార్యాచరణ రూపొందించారని ఆయన వివరించారు. విభజన ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లేందుకు, అసెంబ్లీలో ఎలాంటి అవాంతరం రాకుండా చూసేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన నిరంతరం మంతనాలు సాగిస్తున్నారు. సీఎం కిరణ్‌తో కూడా దిగ్విజయ్, ఇతర కేంద్ర పెద్దలు చర్చిస్తున్నారని తెలుస్తోంది. విభజన బిల్లుపై అసెంబ్లీలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలన్న దానిపై సూచనలిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లతోనూ పెద్దలు చర్చిస్తున్నారు. బిల్లు ఏ క్షణమైనా అసెంబ్లీకి వస్తుందని, చర్చను త్వరితంగా ముగించి రాష్ట్రపతికి తిరిగి పంపాలని వారందరినీ ఇప్పటికే ఆదేశించారు. సభ్యుల ప్రసంగాలు ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు, ఉద్వేగాలకు దారి తీయని రీతిలో చర్చ సాఫీగా జరిగిపోయే మార్గాలపై వారితో మాట్లాడినట్టు సమాచారం. ఇక సభలో విభజన బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేసే ఎమ్మెల్యేలపైనా దిగ్విజయ్ ఆరా తీస్తున్నారు. బొత్స తదితరులతో మాట్లాడి వారి జాబితాను రూపొందించారు.
వారితో కేంద్రం పెద్దలు నేరుగా మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీని సమావేశపరచడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కేంద్ర అధికారులు నేరుగా మాట్లాడుతూ మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు! సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ, అసెంబ్లీ అధికారులు సోమవారం నుంచే సన్నాహాలు ప్రారంభించారు. సభలో గందరగోళం, ఉద్రిక్తత తలెత్తినా అవి విపరిణామాలకు దారి తీయకుండా ఉండేందుకు సభ లోపల కూడా భారీ భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. లాబీల్లో కూడా ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా చూసేందుకు జాగ్రత్తలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నందున వాటి కవరేజీ విషయంలో మీడియా ప్రతినిధుల కదలిక లపై ఆంక్షలు విధించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు సభలో చర్చల ప్రత్యక్ష ప్రసారం వల్ల రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లవచ్చని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే లైవ్ కవరేజీని పూర్తిగా రద్దు చేసే యోచన ఉంది.