
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రేపు(సోమవారం) అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేయనున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉంటేనే సభలో ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు గట్టిగా గళం విప్పాలని వైఎస్సార్‌సీపీ ప్లాన్ చేసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్ష హోదాలో తగిన సమయం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని పట్టబడనుంది.
కూటమి ప్రభుత్వం కుట్రలను అసెంబ్లీ సాక్షిగా తిప్పి కొట్టేందుకు వైఎస్సార్‌సీపీ రెడీ అయింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే ఒక ప్లాన్ ను రూపొందించింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నది నాలుగు పార్టీలు మాత్రమే. అందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే.
ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే రావాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశ్యంతో వ్యవహరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఎక్కడ గట్టిగా నిలదీస్తుందోననే భయంతో కూటమి పార్టీలు ఉన్నాయి. నిజానికి ప్రతిపక్షంగా గుర్తిస్తే కచ్చితంగా అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షానికి అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజల గొంతు విప్పటానికి ఒక హక్కుగా తగిన సమయం కూడా లభిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఈ అవకాశం ఉండదు. అందుకనే వైఎస్సార్‌సీపీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. వైయస్సార్ సీపీ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ ఇప్పటి వరకు ఈ పిటిషన్ పై తన అభిప్రాయాన్న చెప్పలేదు. అంటే ప్రజా సమస్యలపై గొంతెత్తే అవకాశం వైఎస్సార్‌సీపీకి ఇవ్వకూడదన్నదే తమ నిర్ణయమని చెప్పకనే చెప్పినట్లు అయింది.
కూటమి నేతల కుట్రలు..
వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఇష్టం లేదన్న సంగతి గతంలోనే కూటమి నేతల మాటల్లోనే తేలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనేకసార్లు మీడియా సమావేశాల్లోనే తమ బుద్దిని బయట పెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం వారిలో ప్రతిసారీ కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయటం లేదు. పైగా గతంలో జగన్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామనీ, ఏ పథకాన్ని నిలిపేసేది లేదని చెప్పిన చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎక్కడ నిలదీస్తుందోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది.

మిర్చి రైతుల కోసం..
అదేకాదు.. మిర్చి రైతులకు కనీసం గిట్టుబటు ధరలు కూడా లేకపోవటం దగ్గర్నుంచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లటం, మహిళలు-ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం, దారుణ హత్యల వరకు అన్ని అంశాలపై వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీస్తుందనే భయంతో కూటమి నేతలు ఉన్నారు. గ్రూపు-2 అభ్యర్థులను మోసం చేసిన తీరు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనంపై వైఎస్సార్‌సీపీ చంద్రబాబు సర్కారుకు చుక్కలు చూపిస్తుందనే ఆందోళన కూటమి నేతల్లో ఉంది. ఇలా వరుస వెంబడి ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ ఎక్కడ నిలదీస్తుందోననే భయంతో కూటమి నేతలు ఉన్నారు.
సభ సాక్షిగా ప్రజల గొంతుకగా వైసీపీ నిలవడం, సమస్యలపై నిశితంగా మాట్లాడటం అనేది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సాధ్యం కాదు. కాబట్టే వైయస్సార్ సీపీకి ఆ హోదాను ఇచ్చేందుకు కూటమి పెద్దలు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదాపై శాసనసభలో డిమాండ్ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ డిమాండ్‌కు వెనుక ఉన్న సదుద్దేశాన్ని, న్యాయబద్ధతను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనని వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం సోమవారం జరగబోయే సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment