ఎమ్మెల్యేల అనర్హత కేసులో కొత్త మలుపు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ నిర్ణయించారు. స్పీకర్ వద్ద పిటిషన్ల విచారణ పెండింగులో ఉన్నప్పుడు దానిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని అటార్నీ జనరల్ వాదించారు. గతంలో ఈ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన ఉదహరించారు. ఆయన వాదనలపై సుప్రీం ధర్మాసనం నిశితంగా ప్రశ్నలు వేసింది. గతంలో సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చినప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని, దేశంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద దీర్ఘకాలం పెండింగులో ఉండిపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అలాంటిది పిటిషన్లు పెండింగులో ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించింది.
వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని, వారందరిపైనా అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎప్పటిలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారో ఈనెల 8వ తేదీన చెప్పాలని ఇంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌కు సూచించింది. దానిపై మంగళవారం నాటి వాదనల్లో కొత్త అంశాలు తెరపైకి రావడంతో.. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు దాన్ని ఎలా ఉల్లంఘిస్తారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తే ఇక అది అన్ని రాష్ట్రాలకూ ఒక మార్గదర్శకంగా కూడా ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రాథమిక హక్కులకు సంబంధించి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు.. ఇక వాటిని సవాలు చేయడానికి కూడా వీల్లేకుండా రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇస్తుంది. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారు.