సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీ యాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీల నడుమ రాజకీయ యుద్ధం లాగా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్న నందకుమార్ డైరీలో సంచలన విషయా లున్నాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయనేతలుగా చెలామణి అవుతున్న నాయకుల పేర్లు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది నేతల పేర్లు డైరీలో ఉన్నాయని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఇందులో 25 మంది ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అంగీకరించారని సునీల్ బన్సల్ పేరిట ఉన్న సెల్‌ఫోన్‌కు రామచంద్రభారతి నుంచి మెసేజ్ వెళ్లిందన్న విషయం ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు ఈ జాబితాలో ఉన్న నాయకులెవరూ? అందరూ ఎమ్మెల్యేలేనా? లేదా మాజీలా? ఎమ్మెల్యే స్థాయి నాయకులు నందకుమార్‌తో టచ్‌లోకి వచ్చారా లేదా వీరితో సంప్రదింపులు జరపాలని టార్గెట్‌గా పెట్టుకుని డైరీలో వీరి పేర్లను రాసుకున్నాడా? అసలెవరెవరు టచ్‌లో ఉన్నారు? నందకుమార్ నీడ పడిన నేతల డీల్స్ ఎంతవరకు వచ్చాయి? ఈ పేర్లుగల నాయకుల విషయంలో భవిష్యత్తులో ఏం జరుగబోతోంది? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
రూపాయి కావాలా.... నాయనా?
నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు, పైలట్ రోహిత్‌రెడ్డిల నడుమ ఆడియో సంభాషణలు ఓ ఎత్తయితే, నందకుమార్ డైరీలో ఎవరి పేర్లున్నాయనే అంశం మరోఎత్తుగా మారింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు పెట్టుకున్న నందకుమార్ (ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే మీడియాలో వచ్చాయి) ఏ పార్టీలోని ఏ నాయకుడితో డీల్ మాట్లాడుకున్నాడనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా గతంలో కాంట్రాక్టులు చేసిన, చేస్తున్న నాయకులు, ఆర్థిక అవసరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా చేసుకుని నందూ టీం పనిచేయాలని భావించిందని, అందులో భాగంగానే పలువురితో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంకో ఏడాది కాలంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఖర్చులకు అవసరమైన ‘రూపాయలు’సమకూర్చుకుంటే చాలనే ఆలోచనతో ఉన్న నేతల కూపీ లాగి వారితో టచ్‌లోకి వెళ్లాడా? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఎన్నికలకు అవసరమయ్యేంత సమకూరిస్తే డీల్ ఓకే చెప్పిన నాయకులెంతమంది? రాష్ట్రంలోని 50 మందినేతలను వడపోసేందుకు నందకుమార్ ఎంచుకున్న ప్రాతిపదిక ఏంటి? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మరి నందకుమార్ డైరీనా... మజాకా?
చదవండి: తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర
Comments
Please login to add a commentAdd a comment