nanda kumar
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్‌కు బెయిల్
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్ లభించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది కోర్టు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదంటూ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే పదివేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించారు నందకుమార్. బెయిల్ లభించిన తర్వాత నందకుమార్ చంచల్‌గూడ జైల్ నుండి విడుదలయ్యారు. -
ఎమ్మెల్యేల కేసులో భారీ ట్విస్ట్.. నందకుమార్‌పై రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. కాగా, విచారణ అనంతరం.. రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు సంపూర్ణంగా సహకరించాను. నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. నందకుమార్ ద్వారా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూశారు. ఇప్పుడు నందకుమార్‌ను విచారిస్తామని అంటున్నారు. కేవలం నన్ను లొంగదీసుకునేందుకే ఈడీ విచారణ జరిపింది. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా నాకు నోటీసులు పంపించి విచారణ జరిపారు. దీంతో, బీజేపీ జాతీయ నేతల బండారం బయటపడింది. మొదటి రోజు నన్ను ఆరు గంటల పాటు విచారించినా ఈ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు గురించి రెండో రోజు ప్రశ్నించారు. అది కూడా నేను అడిగితే చెప్పారు. కంప్లైంట్ చేసిన నన్ను విచారించారు తప్ప.. నిందితులను ఎందుకు ప్రశ్నించడంలేదు?. నంద కుమార్ ద్వారా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. నందకుమార్ ద్వారా స్టేట్మెంట్ తారుమారు చేయబోతున్నారు. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రజాస్వామ్యాన్ని కొల్లగొడుతోంది. ప్రజలు తన్నుకు చావాలన్నదే బీజేపీ విధానం. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నేను గులాబీ సైనికుడిగా బీజేపీ కుట్రలను తిప్పికొడతాను. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ కొత్త కుట్రలను మేము భగ్నం చేస్తాము. ఈడీ నోటీసుల మీద రేపు హైకోర్టులో రిట్ వేయబోతున్నాను. బీజేపీ అగ్ర నేతలు ఎందుకు విచారణకు రావడంలేదు. నాకు, నందకుమార్‌కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్
-
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై మరో కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో తమను నందకుమార్ మోసం చేసినట్లు ఆరోపిస్తూ మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే 50 శాతం వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నందకుమార్ వల్ల తాము రూ.2 కోట్లు నష్టపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు. మానిక్ చంద్ నిర్వాహకుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! -
నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పాలిటిక్స్‌లో నందకుమార్.. అన్ని పార్టీల నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టు నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, మరో కేసులో నందకుమార్‌పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో, నందకుమార్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులను కోర్టు కోరింది. ఇక, ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలను నందకుమార్ చాటింగ్ జాబితా టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేలతో సహా! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి. -
Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందుకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. వ్యవసాయ భూమికి సంబంధించి కమీషన్ కోసం తనను బెదిరించడమే కాకుండా అంతు చూస్తానంటూ హెచ్చరించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యా పారి ఎస్.సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి రూ.21 లక్షలు నందుకుమార్‌కు ఇచ్చామని ఈ విషయంలోనే పలుమార్లు తనను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అప్పుడు తాను డిప్యూటీ చీఫ్ మినిష్టర్‌ను అవుతానని, పరిగి సమీపంలోని దోమ మండలం భూంపల్లి గ్రామంలో 12 ఎకరాల స్థలం తన పేరు మీద రాయకపోతే అంతు చూస్తానని బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు) -
లీజు స్థలం అద్దెకు!
హైదరాబాద్ (బంజారాహిల్స్): ఫిల్మ్‌నగర్‌లో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్ది కాదని, లీజుకు తీసుకున్న స్థలం తనదే అంటూ ఇద్దరికి అద్దెకు ఇచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అతనిపై సోమవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సినీ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబులకు ఫిల్మ్‌నగర్ రోడ్ నం.1లో ఉన్న స్థలాన్ని నందుకుమార్ లీజుకు తీసుకున్నాడు. దీనిపై వీరి మధ్య న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. కాగా ఇందులో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ తనదే అంటూ నందు ఇప్పటివరకు ప్రచారం చేసుకున్నాడు. కానీ ఈ హోటల్ వాస్తవానికి మహేంద్రహిల్స్‌కు చెందిన సయ్యద్ ఎజాజ్, సయ్యద్ అజర్, వినయ్ గవనే, కౌశిక్ కన్నం ఏర్పాటు చేసినట్లు ఈ కేసులతో వెలుగులోకి వచ్చింది. తన స్థలమేనని చెప్పి 3 వేల గజాలు.. మరోవైపు లీజుకు తీసుకున్న స్థలాన్ని అక్రమంగా వేరొకరికి అద్దెకు ఇవ్వాలని భావించిన నందు.. 2021 జూన్‌లో టేస్టీ వెల్ హాస్పిటాలిటీ సంస్థను నిర్వహిస్తున్న ఎజాజ్ తదితరులను సంప్రదించాడు. అది తన స్థలమేనని చెప్పాడు. ఈ క్రమంలో 3 వేల చదరపు అడుగులు అద్దెకు తీసుకోవడానికి అంగీకారం కుదిరింది. రూ.12 లక్షల అడ్వాన్సు, నెలకు రూ.2 లక్షల అద్దెతో పాటు హోటల్ నెలవారీ వ్యాపారంలో 10 శాతం కమీషన్ నందుకు ఇచ్చేలా మౌఖిక ఒప్పందం కుదిరింది. దీంతో ఎజాజ్ తదితరులు నందుకు రూ.6 లక్షల నగదు, అతడికి చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.6 లక్షలు ఆన్లైన్లో చెల్లించారు. తర్వాత రూ.65 లక్షలు వెచ్చించిన ఎజాజ్ తదితరులు ఆ స్థలంలో డెక్కన్ కిచెన్ ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి అద్దె, కమీషన్ చెల్లిస్తున్నారు. అయితే ఈ స్థలాన్ని నందు లీజుకు తీసుకున్నాడని, లీజు అగ్రిమెంట్ ప్రకారం వేరే వారికి అద్దెకు ఇవ్వకూడదని ఎజాజ్ తదితరులకు ఈ ఏడాది జూలైలో తెలిసింది. దీంతో తాము డెక్కన్ కిచెన్ హోటల్ ఖాళీ చేస్తామంటూ నందుకు చెప్పగా బెదిరింపులు ఎదురయ్యాయి. వీళ్లు చేపట్టిన అదనపు నిర్మాణాలను ఆదివారం జీహెచ్ఎంసీ కూల్చివేయడంతో..ఎజాజ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు. గాడ్జెట్ స్టూడియో నిర్వాహకుడికీ అద్దెకు.. ఇదే స్థలంలో మరో పక్కన ఉన్న 700 చదరపు అడుగుల స్థలాన్ని నందు ఈ ఏడాది మార్చిలో కోకాపేట ప్రాంతానికి చెందిన మిట్టా సందీప్ కుమార్‌కు నెలకు రూ.1.5 లక్షల అద్దె, రూ.12 లక్షల అడ్వాన్సుకు అద్దెకు ఇచ్చాడు. గాడ్జెట్ స్టూడియో పేరుతో మొబైల్ యాక్ససరీస్ వ్యాపారం చేసే సందీప్‌కు నగర వ్యాప్తంగా ఏడు ఔట్లెట్స్ ఉన్నాయి. కాగా సందీప్ ఆ స్థలంలో రూ.50 లక్షలు వెచ్చించి షోరూమ్ ఏర్పాటు చేశారు. ఆదివారం నాటి కూల్చివేతల్లో ఇది కూడా నేలమట్టమైంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆయన కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందును ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించిన బంజారాహిల్స్ పోలీసులు ఆ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాట్‌ను స్వాధీనం చేసుకున్న రానా ఆదివారం జీహెచ్ఎంసీ కూల్చివేతల నేపథ్యంలో.. తమకు సంబంధించిన ప్లాట్‌ను దగ్గుబాటి సురేష్ కుమారుడు, సినీ నటుడు రానా తన అధీనంలోకి తీసుకున్నారు. రానా ప్లాట్ పక్కనే దగ్గుబాటి వెంకటేష్ ప్లాట్ ఉంది. ఇందులో డెక్కన్ కిచెన్ హోటల్‌తో పాటు బరిస్టా కేఫ్ కొనసాగుతోంది. కోర్టు స్టే ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్లాట్ జోలికి వెళ్ళలేదు. మరోవైపు హైకోర్టు స్టే ఉన్న తర్వాత కూడా జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలు కూల్చివేశారంటూ నందుకుమార్ భార్య చిత్రలేఖ, కుమారుడు అనీష్ తేజ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. నందూ డైరీలో 50 మంది నేతల పేర్లు!
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీ యాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. టీఆర్ఎస్, బీజేపీల నడుమ రాజకీయ యుద్ధం లాగా సాగుతున్న ఈ ఎపిసోడ్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్న నందకుమార్ డైరీలో సంచలన విషయా లున్నాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయనేతలుగా చెలామణి అవుతున్న నాయకుల పేర్లు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది నేతల పేర్లు డైరీలో ఉన్నాయని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో 25 మంది ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అంగీకరించారని సునీల్ బన్సల్ పేరిట ఉన్న సెల్‌ఫోన్‌కు రామచంద్రభారతి నుంచి మెసేజ్ వెళ్లిందన్న విషయం ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు ఈ జాబితాలో ఉన్న నాయకులెవరూ? అందరూ ఎమ్మెల్యేలేనా? లేదా మాజీలా? ఎమ్మెల్యే స్థాయి నాయకులు నందకుమార్‌తో టచ్‌లోకి వచ్చారా లేదా వీరితో సంప్రదింపులు జరపాలని టార్గెట్‌గా పెట్టుకుని డైరీలో వీరి పేర్లను రాసుకున్నాడా? అసలెవరెవరు టచ్‌లో ఉన్నారు? నందకుమార్ నీడ పడిన నేతల డీల్స్ ఎంతవరకు వచ్చాయి? ఈ పేర్లుగల నాయకుల విషయంలో భవిష్యత్తులో ఏం జరుగబోతోంది? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రూపాయి కావాలా.... నాయనా? నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు, పైలట్ రోహిత్‌రెడ్డిల నడుమ ఆడియో సంభాషణలు ఓ ఎత్తయితే, నందకుమార్ డైరీలో ఎవరి పేర్లున్నాయనే అంశం మరోఎత్తుగా మారింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు పెట్టుకున్న నందకుమార్ (ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే మీడియాలో వచ్చాయి) ఏ పార్టీలోని ఏ నాయకుడితో డీల్ మాట్లాడుకున్నాడనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో కాంట్రాక్టులు చేసిన, చేస్తున్న నాయకులు, ఆర్థిక అవసరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా చేసుకుని నందూ టీం పనిచేయాలని భావించిందని, అందులో భాగంగానే పలువురితో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంకో ఏడాది కాలంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఖర్చులకు అవసరమైన ‘రూపాయలు’సమకూర్చుకుంటే చాలనే ఆలోచనతో ఉన్న నేతల కూపీ లాగి వారితో టచ్‌లోకి వెళ్లాడా? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికలకు అవసరమయ్యేంత సమకూరిస్తే డీల్ ఓకే చెప్పిన నాయకులెంతమంది? రాష్ట్రంలోని 50 మందినేతలను వడపోసేందుకు నందకుమార్ ఎంచుకున్న ప్రాతిపదిక ఏంటి? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మరి నందకుమార్ డైరీనా... మజాకా? చదవండి: తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర -
‘నందు’డు అందరి వాడేలే! అన్ని పార్టీల్లోని ప్రముఖులతో టచ్‌లో..
సాక్షి, హైదరాబాద్: నంద కుమార్ కోరె.. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఈ పేరు మారు మోగుతోంది. రామచంద్ర భారతి, సింహయాజి స్వామిలతో కలిసి చిక్కిన ఇతడు మీ పార్టీ మనిషంటే... మీ పార్టీ మనిషంటూ బీజేపీ, టీఆర్ఎస్ ఆరోపణలు చేసుకుంటున్నాయి. బుధవారం రాత్రి నుంచి నందకుమార్‌కు చెందిన కొన్ని కార్యక్రమాలు, తన వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాల ఫొటోలు, వీడియో లు వైరల్ అయ్యాయి. కర్ణాటక నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన నందకుమార్‌కు అన్ని పార్టీల్లో మంచి స్నేహితులున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులతో కలసి తిరిగిన చరిత్ర ఉంది. మంత్రులతోనూ సన్నిహితంగా... నందకుమార్ ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నం.12లో నివసిస్తున్నాడు. ఫిల్మ్ నగర్లో డబ్ల్యూ3 పేరుతో రెస్టా రెంట్ ఏర్పాటు చేశాడు. దీంతో ఇతడికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడ్డాయి. దీనికి ముందు సీజన్స్ హోటల్, సదరన్ స్పైస్, ఆ తర్వాత దక్కన్ కిచెన్, ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ల్లో గ్రూప్ రెస్టారెంట్లు, బార్లు, వైన్సుల్లో వాటాలు నందు ఖాతాలో ఉన్నాయి. వీట న్నింటిలోనూ రాజకీయ, సినీ ప్రముఖుల తోపాటు అధికారులకూ వాటాలు ఇచ్చా డని, వారిలో అనేక మందికి ఇతడు బినామీ అని తెలుస్తోంది. మంత్రులు, వివిధ బోర్డుల చైర్మన్లతోపాటు కేంద్ర మంత్రులతోనూ సన్నిహితంగా మెలిగాడు. పలు సంస్థల్లో డైరెక్టర్‌గా.. సైదాబాద్‌కు చెందిన అవల అభిషేక్ 2008 నుంచి బేగంబజార్ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్ మసాల వ్యాపారం చేస్తూ మాణిక్‌చంద్ సంస్థకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించాడు. 2015 నుంచి 7 హిల్స్ మార్కెట్స్ ప్రాంతంలో సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. బీబీన గర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్ చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దాలను ఉత్పత్తి చేసి విక్రయించేవాడు. ఆపై గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా విక్రయించాడు. ఈ గుట్కా దందాలో నందకుమార్ కీలకంగా ఉన్నాడని తెలిసింది. అభిషేక్ ను 2019లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అభిషేక్, నందు సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మార్కెటర్స్ అండ్ మ్యాను ఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటె డ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. డబ్ల్యూ3 సంస్థలో తేజేశ్వర్రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్‌గా ఉన్నారు. అభిషేక్ ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాల’ ఉత్పత్తులకు ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా, బెంగాల్లో అనేక మందిని మోసం చేశా డు. ఈ వ్యవహారా ల్లోనూ నందు పాత్ర ఉన్నట్లు ఆరో పణలున్నాయి. నందు తండ్రి కోరె శంకరప్ప బేగంబజార్‌లో వ్యాపారం చేస్తుంటారు. -
కేరళ మంత్రి మీద ‘అశ్లీల వీడియో’కు ప్రయత్నం.. అరెస్ట్
కొచ్చి: కేరళలో సంచలనాలకు నెలవైన క్రైమ్ నందకుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సహ ఉద్యోగిణిని లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతేకాదు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేరిట నకిలీ అశ్లీల వీడియోను తయారు చేయాలనుకున్న అతని ప్రయత్నం గుట్టు వీడిందిలా.. కేరళలో క్రైమ్ మాగ్జైన్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా టీపీ నందకుమార్ ఎంత పాపులర్ అయ్యాడో.. వివాదాలతోనూ అంతే వార్తల్లోకి ఎక్కాడు. క్రైమ్ వార్తల మీద సంచలనాత్మక కథనాలతో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరిట ఇబ్బందికరమైన కంటెంట్‌ను ఇస్తుంటాడు. తాజాగా సహ ఉద్యోగిణిని వేధించిన కేసులో కొచ్చి పోలీసులు.. కాలూర్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. క్రైమ్ మ్యాగ్జైన్ చీఫ్ ఎడిటర్ అయిన టీపీ నందకుమార్.. తన దగ్గర పనిచేసిన ఓ ఉద్యోగిణి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు డబ్బు ఆశ చూపి తనను నీలిచిత్రంలో నటించాలని ఒత్తిడి చేశాడని భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి Veena Georgeలా ఉన్నావని, నీలిచిత్రంలో నటించమని, ఆ వీడియో ద్వారా మంత్రిని బద్నాం చేయొచ్చని నందకుమార్ ప్లాన్ వేసినట్లు ఆమె తెలిపింది. ఒకవేళ నీలిచిత్రంలో గనుక నటించకపోతే.. తనపై మార్ఫింగ్ కంటెంట్ చేసి ఇంటర్నెట్లో వదులుతానని బెదిరించాడని, అయినా ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర మంత్రి నగ్న వీడియోలు ఉన్నాయంటూ నందకుమార్ గతంలోనే ఓ కథనం ప్రచురించాడు. ఈ నేపథ్యంలోనే తనపై అశ్లీల వీడియోలో నటించాలని బెదిరించాడని ఆమె మీడియాకు వివరించింది. ఇక బాధితురాలితో పాటు ప్రస్తుతం క్రైమ్ మ్యాగ్జైన్లో పని చేస్తున్న మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీంతో నందకుమార్‌పై ఐపీసీలోని సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నందకుమార్, మంత్రి వీణా జార్జ్‌ను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె మీద ఫేస్బుక్, యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంతో కొక్కనాడ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తాజా పరిణామంతో తీరుమార్చుకోని నందకుమార్‌ను కఠినంగా శిక్షించాలని, అలాగే క్రైమ్ మ్యాగ్జైన్ను మూసేయాలంటూ పలువురు నెటిజన్స్ కోరుతుండడం గమనార్హం. -
'క్షమాగుణం ఉన్నందువల్లే లూటీ చేశారు'
హైదరాబాద్: పాశ్చాత్య అభివృద్ధి పద్ధతి వల్లే ప్రకృతి నాశనం అవుతోందని ఆరెస్సెస్ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య అన్నారు. ఏకాత్మ మానవతా దర్శన్ తోనే అభివృద్ధి సాగాలని ఆయన చెప్పారు. రెండో రోజు ఆరెస్సెస్ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. భారత ప్రజల్లో క్షమాగుణం ఉన్నందువల్లే విదేశీయులు లూటీ చేశారని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ప్రకృతి వైపరీత్యాలకు దీన్ దయాళ్ చెప్పిన ఏకాత్మ మానవతా దర్శనే సొల్యూషన్ అని ఆయన సూచించారు. మరో అరెస్సెస్ నేత నందకుమార్ మాట్లాడుతూ కేరళలో రాజ్యహింస పెరుగుతుందన్నారు. అక్కడ జరుగుతున్న హత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకోవాలని అన్నారు. హింసను అరికట్టి శాంతిని పునరుద్ధరించాలని నందకుమార్ సూచించారు. కమ్యూనిస్టుల చరిత్ర అంతా హత్యా రాజకీయాలేనని నందకుమార్ అన్నారు. -
కాల్ చేశారు: లక్ష కొట్టేశారు
కరీంనగర్: ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోయింది. కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు తెలపండని ఫోన్ చేసి అకౌంట్లోని డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా పెదపల్లి ఐటీఐ కాలేజీలో మంగళవారం వెలుగుచూసింది. పెదపల్లి ఐటీఐ కాలేజీలో పనిచేసే నందగోపాల్‌కు దుండగులు ఫోన్ చేసి కార్డు వివరాలు తీసుకుని అతడి అకౌంటు నుంచి రూ. 66 వేలు కాజేశారు. అనంతరం మరో సారి కాల్ చేసి నగదు తప్పుగా జమ అయ్యాయని మరో కార్డు వివరాలు చెబితే అందులోకి బదిలీ చేస్తామని నమ్మబలికారు. ఇలా నలుగురి వివరాలు తీసుకుని రూ. లక్ష పై చిలుకు దొచుకున్నారు.