సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పాలిటిక్స్‌లో నందకుమార్.. అన్ని పార్టీల నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. నాంపల్లి కోర్టు నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, మరో కేసులో నందకుమార్‌పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో, నందకుమార్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులను కోర్టు కోరింది.
ఇక, ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలను నందకుమార్ చాటింగ్ జాబితా టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.
ఎమ్మెల్యేలతో సహా!
నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment