
ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు
బంజారాహిల్స్ : ‘ఎక్స్’వేదికగా ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఆధారంగా ఓ కారు డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా వాహనాన్ని నడుతుండగా ఓ వ్యక్తి ఆ కారును వీడియో తీసి ‘ఎక్స్’(ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో పోలీసులు స్పందించి సదరు కారు డ్రైవర్‌పై చర్యలకు దిగారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సిగ్నల్ వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో (ఏపీ 09 ఏక్యూ 7209) నంబర్ గల కారు రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు అధిక వేగంతో ప్రమాదకరంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. కారు నడుపుతున్న దృశ్యాలను ఎండీ మౌజం అనే వ్యక్తి వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో టెక్ టీమ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కరుణాకర్ సాధారణ పరిశీలనలో భాగంగా ఎక్స్ ఖాతాను పరిశీలిస్తుండగా ఎండీ మౌజం పోస్ట్ చేసిన వీడియోను పరిశీలించాడు. దీంతో కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై ప్రయాణించే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కరుణాకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కారు కోసం గాలించి పట్టుకున్నారు. మలక్‌పేటలోని ప్రజ్ఞ విజయజ్యోతి కాలేజీలో చదువుతున్న మహ్మద్ అబ్దుల్ ఖదిర్, అన్వర్ ఉలుం కాలేజీలో చదువుతున్న ఎండీ అనస్ అహ్మదుద్దీన్, లకోటియా కాలేజీలో చదువుతున్న మహ్మద్ అబ్దుల్ రహద్ ఈ కారులో వెళ్తూ స్టంట్లు చేసినట్లుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి వీరు ఇష్టారాజ్యంగా దూసుకెళ్తున్నట్లుగా నిర్థారించి కారును సీజ్ చేసి ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment