
రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆరూరితో మాట్లాడుతున్న తహసీల్దార్ నాగేశ్వర్‌రావు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఆదివారం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఈ ఘటన నుంచి కడిపికొండ వాసులు 14 మందిలో ఐదుగురు బయటపడగా హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం రెండు, మంగళవారం మూడు.. మొత్తం ఐదుదగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఇందులో బస్కె అవినాష్, బస్కే రాజేందర్ అంత్యక్రియలు మంగళవారం జరగ్గా... సిద్ది వెంకటస్వామి, గడ్డమీది సునిల్, గొర్రె రాజేందర్‌ల మృతదేహాలు మంగళవారం రాత్రికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఉన్నారు.
ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఐదుగురిని వరంగల్‌కు చేర్చడం.. ఇద్దరి మృతదేహాలను కడిపికొండ చేర్చడంపై జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్‌తో కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇక కేసీఆర్, కేటీఆర్ ఆదేశం మేరకు చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ మంగళవారం కడిపికొండకు చేరుకున్నారు. బాధిత కుటు ంబాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్న ఆయన టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉంటే మరో రూ.2 లక్షలు, అసంఘటిత కార్మికులైతే రూ.6 లక్షల వరకు వస్తాయని చెప్పి భరోసా కల్పించారు. కాగా, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరి రాజ్‌కుమార్ ఆచూకీ లభించేవరకు రాజమండ్రిలోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ‘సాక్షి ప్రతినిధి’కి ఫోన్‌లో తెలిపారు.
రాజమండ్రి హెల్ప్ డెస్క్‌లో మనోళ్లు
గోదావరి నదిలో బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన, మృతి చెందిన వారి సమాచారం కోసం రాజమండిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. అందులో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ సుంరేందర్, వీఆర్వో జోసెఫ్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పడు జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, బాధిత కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. అలాగే, కడిపికొండకు చెందిన పలువురు కూడా తమ వారిని గుర్తించేందుకు అక్కడే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment