Martyrs Sacrifices
-
అమరుల త్యాగాలు వృథా కానివ్వం
∙స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి : తెలంగాణ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రత్యేక రా ష్ట్రంకోసం ఆత్మబలి దానం చేసుకున్న మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెం దిన వీణవంక శ్రీనివాసాచార్యులు, ఆజంనగర్‌కు చెందిన బీరెల్లి రాములు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10 లక్షల చెక్కులను గురువారం అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండ గా నిలుస్తుందన్నారు. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తు న్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయ ణ, ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, వైస్ ఎంపీపీ సురేందర్, జెడ్పీటీసీ సభ్యురాలు జ ర్పుల మీరాబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, నాయకులు ముద్దమల్ల బార్గవ్, తాటి వెంకన్న, గోవిందుల శ్యాం, మారెల్లి సేనాపతి పాల్గొన్నార -
అమరుల త్యాగాలపై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు
వారి కుటుంబాలన్నింటికీ సాయం అందిస్తాం సంఖ్య తగ్గించే ఆలోచన లేదు: హరీశ్‌రావు 1969 అమరుల కుటుంబాలకూ ఆర్థిక సాయం: డిప్యూటీ సీఎం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కన అమరుల స్మృతి స్తూపం నిర్మించాలి: ఎర్రబెల్లి నల్లగొండలో కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘అమరుల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే.. వారి త్యాగాలను వెల కట్టలేం. త్యాగాలను రాజకీయం చేయకండి. చరిత్ర మనల్ని క్షమించదు’’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు విపక్షాలకు హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల న్నింటికీ ప్రభుత్వపరంగా సాయం అందిస్తామన్నారు. అమరుల సంఖ్యను తగ్గించలేదని.. మొదటి విడతలో జిల్లా కలెక్టర్ల నుంచి 459పేర్లు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు చెప్పారు. ఈ సంఖ్య తక్కువగా వచ్చినట్లు గుర్తించిన ప్రభుత్వం.. కలెక్టర్లను రీ వెరిఫికేషన్‌కు ఆదేశిం చిందన్నారు. అమరుల విషయంలో సంఖ్యా నిబంధన ఏదీ లేదన్నారు. తమ నియోజకవర్గాల్లో అమరులైన కుటుంబాలుంటే సభ్యులు కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉద్యమంలో నమోదైన కేసులన్నీ ఎత్తివేసేందుకు హోంశాఖ చర్య లు చేపట్టిందన్నారు. రైల్వే విభాగం నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవని.. వాటిని ఎత్తివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిందన్నారు. మరణ వాంగ్మూలాల్లో ఎవరి పేర్లున్నాయో అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి ప్రశ్నించారు. చనిపోయిన కుటుంబాలకు శాశ్వత గౌరవం కల్పించే చర్యలు చేపట్టాలని ఉద్యోగం, పింఛన్‌తో పాటు రాయితీలు కల్పిం చాలన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కన ప్రపంచంలోనే పెద్దదిగా అమరుల స్మృతి స్తూపం నిర్మించాలని సూచించారు. అమరుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తే తాము సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా.. ‘శ్రీకాంతాచారి కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చింది మేమే..’ అంటూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేయటంతో ‘అది ఓడిపోయేదో.. గెలిసేదో అందరికీ తెలుసు’ అని దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ‘అక్కడ వారిపై పోటీ పెట్టింది ఎవరో, ఎందుకు పెట్టారో, ఎందరు అమరులు తమ మరణ వాంగ్మూలాల్లో ఎవరి పేర్లు రాశారో.. ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది’ అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత విద్య అందించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని ప్రభుత్వం దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం కేసుల్లో ఇరుక్కొని.. జైలుపాలైన వారిని తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. నల్లగొండలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని సూచిం చారు. ఇందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బదులిస్తూ.. 1969 ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వీరందరికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఆ కుటుంబంలో అర్హులైన ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ వృత్తిలో ఉన్న కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇల్లు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామన్నారు. పాట పాడిన బాలకిషన్ అమరుల త్యాగాలను కొనియాడుతూ బాలకిష న్ పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ‘గుండెల్లో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి.. అధ్యక్షా.. ఇక్కడ పాట పాడొచ్చో లేదో నాకు తెలియదు. అమరులశవాల మీద కైగట్టి పాటలు పాడిన వాణ్ని. వాళ్ల అమరత్వం మీద అసెంబ్లీ లో పాట పాడుతా అని ప్రమాణం చేసిన వాణ్ని... అందుకే పాట పాడుతున్నా’ అంటూ.. ‘నిప్పుల్ని నీళ్లలా తాగినోళ్లు... మంటనొంటికలుముకున్నవాళ్లు... నూనుగు మీసాల పోరగాళ్లు.. తెలంగాణకై ఒరిగినోళ్లు... ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి వీరులు.. నేడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు..’ అని పాడారు. 1969 ఉద్యమంలో చనిపోయిన కుటుంబాల బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందంటూ మరో చర ణం పాడారు. ‘కనుచూపుదారుల్లో కన్నీటి పాట ల్లో.. ఎన్నెలా దీపాలకెలుగులైనోళ్లకు.. ఏటీ పాయల నీటి ఊటలా జోహర్.. గట్ల మీద గడ్డి చిలుకలా జోహర్.. చిలుకలా జోహర్. వరి మొలకలా జోహర్.. అమరులకు జోహార్.. వీరులకు జోహర్...’అని పాడడంతో సభ్యులంద రూ.. జోహార్ అని నివాళులు అర్పించారు. సభలో బీజేపీ సభ్యుల నిరసన అమరుల కుటుంబాలకు ప్రభుత్వ సాయంపై ప్రశ్నోత్తరాల వ్యవధి ముగిసినా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ కొనసాగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పదే పదే పట్టుబట్టినా స్పీకర్ అంగీకరించలేదు. అప్పటికే ప్రశ్నోత్తరాల వ్యవధి ముగియటంతో జీరో అవర్ చేపట్టారు. తమ వాదన వినకుండా జీరోఅవర్ ప్రారంభించటంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు, ఆ తర్వాత టీఆర్ఎస్ సభ్యుడు నల్లాల ఓదేలుకు మాట్లాడే అవకాశమిచ్చారు. అప్పటివరకు నిలబడి ఉన్న బీజేపీ సభ్యులకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరే సభ నడుపుకోండి. అమరవీరులపై మాట్లాడే అర్హత మాకు లేదా..’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. మీకు అవకాశమిచ్చాం కదా.. అని స్పీకర్ అన్నారు. ఇవ్వలేదంటూ బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్... ‘ఇచ్చాననుకుంటున్నాను. ఐ యామ్ సారీ. ఇప్పుడు మాట్లాడండి..’ అని కిషన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. ‘అమర వీరుల అంశమే మాట్లాడుతా...‘ అని కిషన్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో మళ్లీ మైక్ కట్ చేశారు. ఇందుకు నిరసనగా కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ హాల్లో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ‘అవకాశమిస్తాం.. ఏ అంశమైనా సరే మాట్లాడండి..’ అని స్పీకర్ కోరినా వినలేదు. దీంతో పది నిమిషాల పాటు సభను టీ బ్రేక్‌గా వాయిదా వేశారు. వాయిదా అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘అమరులపై చర్చకు అవకాశమివ్వకపోవటంతో బీజేపీ సభ్యులు మనస్తాపానికి గురయ్యారు.ఉద్యమంలో బీజేపీ అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కీలక భూమిక పోషించింది. అమరుల అంశంపై రేపు మళ్లీ చర్చించుకుందాం. బీజేపీ సభ్యులు సీట్లలో కూర్చోవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. దీంతో బీజేపీ సభ్యులు శాంతించారు. -
వీరులారా.. వందనం..
- అమరుల త్యాగాలు తెలుసుకుని కన్నీటిపర్యంతమైన కలెక్టర్ - వారి కుటుంబాలను గుండెలకు హత్తుకుని ఓదార్పు - అంకితభావం, త్యాగగుణమే తెలంగాణకు బలం: స్మితా సబర్వాల్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమం ప్రతి మలుపులోనూ ఓ వీరుని మరణం ఉంటుంది. ఓ తల్లి కన్నీటి వేదన ఉంటుంది. గమ్యం ముద్దాడే వరకూ వెరవని వీరత్వం ఈ గడ్డది. ఆరిపోతున్న కొలిమికి పొరకయి నిప్పులు రాజేసిన పోరగాళ్లు.. పోలీసు లాఠీలకు.. తూటాలకు బతుకంతా పొక్కిలయినా.. బిగించిన పిడికిలి విడవని విద్యార్థి వీరులు.. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని త్యాగాలు ఈ నేల మీద జరిగాయి. 60 ఏళ్ల ఉద్యమం తనకుతాను హింసించబడిందే కాని, ఎక్కడా హింసకు పాల్పడ లేదు. ‘ప్రత్యేక’ ఆకాంక్ష కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర ఇక్కడి బిడ్డలది. ‘తెలంగాణ కోసం రాజీనామా చేసిన నేతలందరినీ గెలిపిస్తే.. ‘నీకు ప్రాణాలు అర్పించుకుంటా తల్లీ’ అంటూ కట్టమైసమ్మ ఆలయం ఎదుట ఎదుట ఆత్మార్పణం చేసుకున్న విద్యార్థి బసంత్‌పూర్ ఇషాంత్‌రెడ్డి.. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం నా చావుతో కళ్లు తెరవాలంటూ’ పురుగుల మందు తాగిన చింతకింది మురళి... తెలంగాణ ఉద్యమ సమయంతో కేసీఆర్ అరెస్టుకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న మునుగూరి శ్రీకాంత్.. ఇంకా మోదుగపూల వనంలో రాలిన పువ్వులెన్నో.. ఇలాంటి వీరులగన్న తల్లులకే కాదు..! వాళ్ల త్యాగాలు విన్న ఏ తల్లికైనా గుండె బరువెక్కుతుంది. తెలంగాణ ఆవిర్భావ సంబురాల్లోనూ ఆదే దృశ్యం పునరావృతమైంది. తెలంగాణ అమరవీరుల సాహసాలను, త్యాగాలను విని కలెక్టర్ స్మితా సబర్వాల్ కన్నీళ్లు పెట్టారు. అమరవీరుల తల్లిదండ్రులను గుండెలకు హత్తుకున్నారు. వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండంగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సోమవారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన అమర వీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.‘ సంఘటిత శక్తి, చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, త్యాగ గుణాన్ని, ప్రదర్శించే మానవ సమాజం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక బలం’ అని ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యానించారు. -
మోదుగుపూలకు వందనం
నవ తెలంగాణే అమరులకు నివాళి ఎలక్షన్ సెల్: ఒక్కరా ఇద్దరా.. వందలు వేలు. ప్రాణాలను తృణప్రాయమనుకున్నారు. త్యాగాల బాటలో నెత్తుటి పూలై పూశారు. వీరోచిత పోరాటం చేశారు. తెలంగాణ ఆకాంక్షను చాటారు. దిక్కులు పిక్కటిల్లే నినాదమయ్యారు. కవాతులు, తుపాకులు మోపిన ఉక్కుపాదాన్ని లెక్కచేయకుండా పోరాడారు. ఆత్మ బలిదానాలతో తాము కలలు కన్న తెలంగాణ కోసం అమరువీరులయ్యారు. ఆనాటి 1969 ఉద్యమ కారుడు ఉమేందర్ నుంచి నేటి శ్రీకాంతాచారి, యాదయ్యల వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం త్యాగాల బాటలోనే నడిచింది. ఇలాంటి అమరుల త్యాగాలు వృథా కాలేదు, వారి ఆకాంక్షలు నెరవేరి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో నవ తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి... వారు రాసిన ‘సూసైడ్’నోటే ఎన్నికల ప్రణాళికా అంశాలు కావాలని అమరుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. 1969 జ్ఞాపకం.. పగిడిపాల ఆంజనేయులు, హైదరాబాద్: అది 1968 సెప్టెంబర్. తుపాను ముందరి ప్రశాంతతను తలపిస్తోంది హైదరాబాద్ నగరం. తెలంగాణ ఉద్యమకారులు భారీ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. ప్రభుత్వం ససేమిరా అంది. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు మహాప్రదర్శనగా వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రాన్ని అందజేసేందుకు అన్ని స్కూళ్లు, కళాశాలలు కదులుతున్నాయి. అనుమతిని నిరాకరించిన ప్రభుత్వం అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించింది. పోలీసు పహారాలో చార్మినార్ వద్ద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అప్పటికే సిటీ హైస్కూల్ కాలేజీ దగ్గర విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ర్యాలీకి సిద్ధమయ్యారు. చార్మినార్ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు ఆచార్య కేశవరావు జాదవ్, మరో ఇద్దరు ఆందోళనకారులు పూజారుల్లా వెళ్లారు. భాగ్యలక్ష్మి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఒక్కసారిగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. ఆ నినాదాన్ని అందుకున్న విద్యార్థులు వందలు, వేలుగా కదిలి వచ్చారు. పోలీసు వలయాలను ఛేదించుకొని సాగిన ఆ నాటి ప్రదర్శన లో దారి పొడవునా నెత్తురు పారింది. పోలీసుల లాఠీలు విరిగాయి. విచక్షణా రహితంగా తూటాలు పేలాయి. చార్మినార్ వద్ద పేలిన మొట్టమొదటి తూటా శాలిబండ విద్యార్థిని అరుణ గుండెలను చీల్చుకుంటూ వెళ్లింది. చార్మినార్ వద్ద ప్రారంభమై, పబ్లిక్‌గార్డెన్స్, అసెంబ్లీ, లకిడికాపూల్ మీదుగా పోలీసు లాఠీలను, తూటాలను లెక్కచేయకుండా రాజ్‌భవన్‌కు దూసుకుపోతున్న విద్యార్ధులను పోలీసులు రాజ్‌భవన్ సమీపంలో అడ్డుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. సికింద్రాబాద్ నుంచి ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉమేందర్రావు ఆందోళనకారులను ఉద్దేశించి ‘అందరూ ప్రశాంతంగా రోడ్డుపై బైఠాయించాలని’ చెబుతూనే పోలీసుల తూటాలు నేలకొదిలారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆ పోరాటంలో 30 మందికి పైగా అమరులయ్యారు. ఇలా మొదలైన ఉద్యమం ఉధృతమై కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎందరో అమరులయ్యారు. 1969 నాటి ఉద్యమంలో తెలంగాణ అంతటా వీరోచిత మరణాలే. 360 మందికి పైగా అసువులు బాశారు. ఆ నాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధం నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు. ప్రముఖ శిల్పి డాక్టర్ ఎక్కా యాదగిరిరావు అద్భుతమైన అమరుల స్థూపానికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ స్థూపమే నేడు అన్నింటికీ స్ఫూర్తిగా నిలిచింది. ‘తెలంగాణ’ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వారిలో ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. తెలంగాణ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని నమ్మి.. అందుకోసం ఆత్మత్యాగం చేసుకుని కన్న తల్లులకు పుట్టెడు శోకం మిగిల్చారు. ఆ ‘అమ్మలు’పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాడారు. ఆ క్రమంలో ప్రాణాలు సైతం వదులు కున్నారు. తమ ఆకాంక్ష కోసం ఇంత పెద్దమొత్తంలో ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సుమారు 1003మంది ప్రాణ త్యాగం చేశారు.. వీరిలో 630మంది ఆత్మబలిదానాలు చేసుకోగా.. 373మంది తెలంగాణ రాదేమోనన్న బాధతో గుండెపోటుకు గురై చనిపోయారు. తెలంగాణను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వారు రాసిన సూసైడ్ నోట్స్ చెబుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలి. కొందరు నాయకులు అమరుల కుటుంబాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలి. - శంకరమ్మ, శ్రీకాంతాచారి తల్లి చట్టసభల్లో అమరవీరుల కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ఫైలుపై మొదటి సంతకం చేయాలి. - చిర్రా లక్ష్మీబాయి, జీవన్‌కుమార్ తల్లి తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. వారి కుటుంబాల్లో ఒకరిద్దరికైనా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ప్రతిపాదిస్తారని అనుకున్నా. కానీ ఎవరూ రాలేదు. - పి.పద్మావతి, కానిస్టేబుల్ కిష్టయ్య భార్య చిదంబరం ప్రకటనతో.. 2009 డిసెంబర్ 10న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పార్లమెంటులో ఆనాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. దీనిపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు కొనసాగడంతో అదే నెల 28న తెలంగాణపై మరో ప్రకటన చేశారు. తెలంగాణపై పూర్తిస్థాయి అధ్యయనానికి ఓ కమిటీ వేస్తామని చెప్పడంతో ఉవ్వెత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో యువతలో అశాంతి నెలకొంది. ఇది ఆత్మహత్యలకు ప్రేరేపించింది. ఈ సందర్భంలోనే హోంమంత్రి షిండే చేసిన ప్రకటనలకు.. ఆజాద్ తదితర కాంగ్రెస్ పెద్దల పొంతనలేని ప్రకటనలతో ఆత్మహత్యలు మొదలయ్యాయి. తెలంగాణపై నిర్ణీత గడువు లేదని ఆజాద్ చేసిన ప్రకటనతో ఆరుగురు యువకులు ప్రాణాలు తీసుకున్నారు. దీంతోపాటు కేసీఆర్ దీక్ష, స్థానిక కాంగ్రెస్ నేతల వైఖరి, అస్పష్టమైన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు ఆత్మహత్యలకు కారణాలయ్యాయి. ఉద్యమం ఉవ్వెత్తుకు... హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్న నల్లగొండ యువకుడు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం డిసెంబర్ 3, 2009న ఎల్బీనగర్లో ఒంటికి నిప్పంటించుకుని బలిదానం చేసుకున్నాడు. ఆయన ఆత్మార్పణం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. ఇక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఎం.యాదిరెడ్డి(28) పదో తరగతి చదువుకున్నాడు. తెలంగాణపై జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని భావించి జూలై 20, 2011న ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి రాసిన పదిపేజీల సూసైడ్‌నోట్‌లో..‘సోనియాగాంధీజీ.. మా తెలంగాణ మాకు ఇచ్చేయండి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను హింసిసున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ బలిదానం తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. అలాగే జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న ఆర్.శ్రీకాంత్.. తన తల్లిదండ్రులకు తానొక్కడినే కొడుకునని, అయినా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నానని లేఖ రాసి చనిపోయాడు. తెలంగాణకు మద్దతు ఇవ్వని జైపాల్‌రెడ్డి, దానం నాగేందర్ లాంటి వారిని చూసి సిగ్గుపడుతున్నానని అందులో రాశాడు. తన ఆత్మబలిదానం ఉద్యమానికి మరింత ఊపునివ్వాలని ఆకాం క్షించాడు. ఇంకా.. నిజామాబాద్ జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య.. నవ తెలంగాణ కోసం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోగా, కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన జీవన్‌కుమార్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్‌రెడ్డి ఆత్మార్పణం చేసుకున్నాడు. వీరి ప్రాణత్యాగాలతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. వీళ్లే కాకుండా మరెందరో చేసుకున్న ఆత్మార్పణలు తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పాటు కాబోతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాల సాధనే ధ్యేయంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి. వారి సూసైడ్ నోట్లే తెలంగాణ కోసం పాటుపడే పార్టీల ఎన్నికల మేనిఫెస్టో కావాలని తెలంగాణ అమరుల కుటుంబాలు కోరుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అమరులను ఆదుకోవాలి మాకు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఇస్తానని కేసీఆర్ చెప్పారు. ఇస్తే మేం అమరుల కుటుంబాల కోసం పోరాడ తాం. కొందరు నాయకులు అమరుల కుటుంబాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాలి. - శంకరమ్మ (అమరుడు శ్రీకాంతాచారి తల్లి) ----- బతుకులు మారాలి అమరుల కుటుంబాల్లో ఒకరిద్దరికైనా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ప్రతిపాదిస్తారని అనుకున్నా. పెద్దదిక్కు కోల్పోయి బాధలు పడుతున్న మమ్మల్ని ఆదుకోవాలని కోరినా గాలికి వదిలేశారు. పింఛన్, ఇంటి స్థలం అన్నారు కానీ ఇవ్వలేదు. - పి.పద్మావతి (అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య) ----- సంక్షేమ ఫైలుపై మొదటి సంతకం చేయాలి నా బిడ్డ జీవన్‌కుమార్ డిగ్రీ చదువుతూ తెలంగాణ కోసం చనిపోయిండు. నా బిడ్డలాగా మరొకరు బలిదానాలు చేసుకోకూడదని నేను, నా మరో కొడుకు సతీష్ కలిసి ప్రచారం చేశాం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక ఫైలుపై మొదటి సంతకం చేయాలి. - చిర్రా లక్ష్మీబాయి ----- బలిదానాలకు రాజకీయ పార్టీలే కారణం ఆంక్షలు లేని పూర్తి హక్కులతో కూడిన తెలంగాణను తెలంగాణ అమరవీరులు కోరుకున్నారు. తెలంగాణలో ప్రజ లకు ప్రతీ విషయంలోనూ హక్కులుండాలి. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి. బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలి. - వేదకుమార్ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అమరవీరుల పేరున పార్కులు కట్టాలి. వాళ్ల స్మారకార్థం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు తవ్వించాలి. ప్రాజెక్టులు, పాఠశాలలు కట్టించాలి. అమరుల ఆశయాలు సాకారం కావాలంటే నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. అదే వారు కోరుకున్నారు. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఎమ్మెల్సీ ------ అమరుల ఆశయాలే లక్ష్యంగా.. సాయుధ పోరాటం దగ్గర నుంచి తెలంగాణలో అన్నీ త్యాగాలే. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకోవడం విషాద చరిత్ర. అమరులు కలలుగన్న తెలంగాణ సాధించుకోవాలంటే వారి ఆశయాలనే పార్టీలు తమ ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకురావాలి. - దేవీప్రసాద్, అధ్యక్షుడు, టీఎన్జీవో -
అమరుల త్యాగాలపై కుట్ర : మందకృష్ణ
ఇచ్చామని, తెచ్చామని నేతల రాజకీయాలు అమరుల ద్వారానే తెలంగాణ సాకారమైంది 10న సభతో తల్లుల కడుపు కోత ప్రపంచానికి చాటుతాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలు చరిత్రలో చేరకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తోందని సోనియా గాంధీని దేవతగా, తెచ్చామనే పేరుతో కేసీఆర్‌ను జాతిపితగా చూపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియా సెంటర్ వద్ద మాట్లాడారు. ఆ తర్వాత ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంతోపాటు 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన అమరులు కనుమరుగయ్యారని, నాయకులకు మాత్రమే చరిత్రలో స్థానం కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో యువకుల ప్రాణాలను హరించిన అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న పార్కును అమరవీరుల పార్కుగా నామకర ణంచేసి వారి విగ్రహాలను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. అమరుల తల్లుల కడుపుకోత తీర్చడమే లక్ష్యం: తెలంగాణ కోసం అమరులైన తల్లుల కడుపుకోత తీర్చడమే తెలంగాణ పునర్మిర్మాణం లక్ష్యం కావాలని డిమాండ్ చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ‘అమరుల తల్లుల కడుపుకోత మహాసభ’ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు ఏ రాజకీయపార్టీని ఆహ్వానించలేదని... కేవలం అమరుల తల్లులు మాత్రమే వేదికపైన ఉంటారని తెలిపారు. వారి బాధ, ఆవేదనను ఈ సందర్భంగా లోకానికి వినిపిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరుల శవాల మీద తమ జెండాలను కప్పిన పార్టీలు... ఇప్పుడు అమరుల త్యాగాల పునాదులను సమాధి చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెంటనే అమరుల చరిత్రను గ్రంథస్తం చేయడంతో పాటు వారి కుటుంబాలకు చేయూత ఇచ్చే ఫైలుపైనే తొలి సంతకం చేయాలని డిమాండ్ చేశారు. అమరుల పేర్లను గ్రంథస్తం చేయడంతో పాటు స్మారక చిహ్నాలను నిర్మించడం ద్వారా వారి చరిత్రను తర్వాతి తరాలకు తెలియజేయాలనేది తన లక్ష్యమని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగం గురించి మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలకు తెలంగాణలోని వేలాదిమంది అమరుల ప్రాణాలు గుర్తుకురావడంలేదా? అని ప్రశ్నించారు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమేనని గుర్తించాలన్నారు. తాము చనిపోతే తెలంగాణను చూడలేమని తెలిసీ వేలాదిమంది ఆత్మత్యాగం చేసుకుంటే... సీఎం కిరణ్, చంద్రబాబు, జగన్, టీజీ వెంకటేష్ లాంటి వారు బతికుండి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రక్రియను మూడున్నరేళ్లు ఆలస్యంగా మొదలుపెట్టిన సోనియాగాంధీ నిర్లక్ష్యం వెయ్యి మందికిపైగా ప్రాణాలను బలితీసుకుందని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతంగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.