అమరుల త్యాగాలపై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు | Do not play politics on Martyrs' sacrifices | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలపై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు

Published Thu, Nov 27 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

అమరుల త్యాగాలపై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు

అమరుల త్యాగాలపై రాజకీయాలొద్దు: హరీశ్‌రావు

వారి కుటుంబాలన్నింటికీ సాయం అందిస్తాం
సంఖ్య తగ్గించే ఆలోచన లేదు: హరీశ్‌రావు   
1969 అమరుల కుటుంబాలకూ ఆర్థిక సాయం: డిప్యూటీ సీఎం
 హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కన అమరుల స్మృతి స్తూపం నిర్మించాలి: ఎర్రబెల్లి
నల్లగొండలో కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: జీవన్‌రెడ్డి

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘అమరుల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే.. వారి త్యాగాలను వెల కట్టలేం. త్యాగాలను రాజకీయం చేయకండి. చరిత్ర మనల్ని క్షమించదు’’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు విపక్షాలకు హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల న్నింటికీ ప్రభుత్వపరంగా సాయం అందిస్తామన్నారు.
 
 అమరుల సంఖ్యను తగ్గించలేదని.. మొదటి విడతలో జిల్లా కలెక్టర్ల నుంచి 459పేర్లు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు చెప్పారు. ఈ సంఖ్య తక్కువగా వచ్చినట్లు గుర్తించిన ప్రభుత్వం.. కలెక్టర్లను రీ వెరిఫికేషన్‌కు ఆదేశిం చిందన్నారు. అమరుల విషయంలో సంఖ్యా నిబంధన ఏదీ లేదన్నారు. తమ నియోజకవర్గాల్లో అమరులైన కుటుంబాలుంటే సభ్యులు కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉద్యమంలో నమోదైన కేసులన్నీ ఎత్తివేసేందుకు హోంశాఖ చర్య లు చేపట్టిందన్నారు. రైల్వే విభాగం నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవని.. వాటిని ఎత్తివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిందన్నారు.
 
 మరణ వాంగ్మూలాల్లో ఎవరి పేర్లున్నాయో
 అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి   ప్రశ్నించారు. చనిపోయిన కుటుంబాలకు శాశ్వత గౌరవం కల్పించే చర్యలు చేపట్టాలని ఉద్యోగం, పింఛన్‌తో పాటు రాయితీలు కల్పిం చాలన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కన ప్రపంచంలోనే పెద్దదిగా అమరుల స్మృతి స్తూపం నిర్మించాలని సూచించారు.  అమరుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తే తాము సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా.. ‘శ్రీకాంతాచారి కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చింది మేమే..’ అంటూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేయటంతో ‘అది ఓడిపోయేదో.. గెలిసేదో అందరికీ తెలుసు’ అని దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.  మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ‘అక్కడ వారిపై పోటీ పెట్టింది ఎవరో, ఎందుకు పెట్టారో, ఎందరు అమరులు తమ మరణ వాంగ్మూలాల్లో ఎవరి పేర్లు రాశారో.. ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది’ అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత విద్య అందించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని కోరారు.
 
 ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని ప్రభుత్వం దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం కేసుల్లో ఇరుక్కొని.. జైలుపాలైన వారిని తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. నల్లగొండలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని సూచిం చారు. ఇందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బదులిస్తూ.. 1969 ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వీరందరికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఆ కుటుంబంలో అర్హులైన ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ వృత్తిలో ఉన్న కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇల్లు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామన్నారు.
 
 పాట పాడిన బాలకిషన్
 అమరుల త్యాగాలను కొనియాడుతూ బాలకిష న్ పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ‘గుండెల్లో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి.. అధ్యక్షా.. ఇక్కడ పాట పాడొచ్చో లేదో నాకు తెలియదు. అమరులశవాల మీద కైగట్టి పాటలు పాడిన వాణ్ని. వాళ్ల అమరత్వం మీద అసెంబ్లీ లో పాట పాడుతా అని ప్రమాణం చేసిన వాణ్ని... అందుకే పాట పాడుతున్నా’ అంటూ.. ‘నిప్పుల్ని నీళ్లలా తాగినోళ్లు... మంటనొంటికలుముకున్నవాళ్లు... నూనుగు మీసాల పోరగాళ్లు.. తెలంగాణకై ఒరిగినోళ్లు... ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి వీరులు.. నేడు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు..’ అని పాడారు. 1969 ఉద్యమంలో చనిపోయిన కుటుంబాల బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందంటూ మరో చర ణం పాడారు. ‘కనుచూపుదారుల్లో కన్నీటి పాట ల్లో.. ఎన్నెలా దీపాలకెలుగులైనోళ్లకు..  ఏటీ పాయల నీటి ఊటలా జోహర్.. గట్ల మీద గడ్డి చిలుకలా జోహర్.. చిలుకలా జోహర్. వరి మొలకలా జోహర్.. అమరులకు జోహార్.. వీరులకు జోహర్...’అని పాడడంతో సభ్యులంద రూ.. జోహార్ అని నివాళులు అర్పించారు.
 
 సభలో బీజేపీ సభ్యుల నిరసన
 అమరుల కుటుంబాలకు ప్రభుత్వ సాయంపై ప్రశ్నోత్తరాల వ్యవధి ముగిసినా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ కొనసాగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పదే పదే పట్టుబట్టినా స్పీకర్ అంగీకరించలేదు. అప్పటికే ప్రశ్నోత్తరాల వ్యవధి ముగియటంతో జీరో అవర్ చేపట్టారు. తమ వాదన వినకుండా జీరోఅవర్ ప్రారంభించటంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు, ఆ తర్వాత టీఆర్‌ఎస్ సభ్యుడు నల్లాల ఓదేలుకు మాట్లాడే అవకాశమిచ్చారు.
 
 అప్పటివరకు నిలబడి ఉన్న బీజేపీ సభ్యులకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరే సభ నడుపుకోండి. అమరవీరులపై మాట్లాడే అర్హత మాకు లేదా..’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. మీకు అవకాశమిచ్చాం కదా.. అని స్పీకర్ అన్నారు. ఇవ్వలేదంటూ బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్... ‘ఇచ్చాననుకుంటున్నాను. ఐ యామ్ సారీ. ఇప్పుడు మాట్లాడండి..’ అని కిషన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. ‘అమర వీరుల అంశమే మాట్లాడుతా...‘ అని కిషన్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో మళ్లీ మైక్ కట్ చేశారు. ఇందుకు నిరసనగా కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ హాల్‌లో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.  ‘అవకాశమిస్తాం.. ఏ అంశమైనా సరే మాట్లాడండి..’ అని స్పీకర్ కోరినా వినలేదు.
 
 దీంతో పది నిమిషాల పాటు సభను టీ బ్రేక్‌గా వాయిదా వేశారు. వాయిదా అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘అమరులపై చర్చకు అవకాశమివ్వకపోవటంతో బీజేపీ సభ్యులు మనస్తాపానికి గురయ్యారు.ఉద్యమంలో బీజేపీ అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కీలక భూమిక పోషించింది. అమరుల అంశంపై రేపు మళ్లీ చర్చించుకుందాం. బీజేపీ సభ్యులు సీట్లలో కూర్చోవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. దీంతో బీజేపీ సభ్యులు శాంతించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement