అమరుల త్యాగాలపై కుట్ర : మందకృష్ణ
ఇచ్చామని, తెచ్చామని నేతల రాజకీయాలు
అమరుల ద్వారానే తెలంగాణ సాకారమైంది
10న సభతో తల్లుల కడుపు కోత ప్రపంచానికి చాటుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలు చరిత్రలో చేరకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తోందని సోనియా గాంధీని దేవతగా, తెచ్చామనే పేరుతో కేసీఆర్‌ను జాతిపితగా చూపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియా సెంటర్ వద్ద మాట్లాడారు. ఆ తర్వాత ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంతోపాటు 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన అమరులు కనుమరుగయ్యారని, నాయకులకు మాత్రమే చరిత్రలో స్థానం కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో యువకుల ప్రాణాలను హరించిన అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న పార్కును అమరవీరుల పార్కుగా నామకర ణంచేసి వారి విగ్రహాలను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు.
అమరుల తల్లుల కడుపుకోత తీర్చడమే లక్ష్యం: తెలంగాణ కోసం అమరులైన తల్లుల కడుపుకోత తీర్చడమే తెలంగాణ పునర్మిర్మాణం లక్ష్యం కావాలని డిమాండ్ చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ‘అమరుల తల్లుల కడుపుకోత మహాసభ’ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు ఏ రాజకీయపార్టీని ఆహ్వానించలేదని... కేవలం అమరుల తల్లులు మాత్రమే వేదికపైన ఉంటారని తెలిపారు. వారి బాధ, ఆవేదనను ఈ సందర్భంగా లోకానికి వినిపిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరుల శవాల మీద తమ జెండాలను కప్పిన పార్టీలు... ఇప్పుడు అమరుల త్యాగాల పునాదులను సమాధి చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెంటనే అమరుల చరిత్రను గ్రంథస్తం చేయడంతో పాటు వారి కుటుంబాలకు చేయూత ఇచ్చే ఫైలుపైనే తొలి సంతకం చేయాలని డిమాండ్ చేశారు. అమరుల పేర్లను గ్రంథస్తం చేయడంతో పాటు స్మారక చిహ్నాలను నిర్మించడం ద్వారా వారి చరిత్రను తర్వాతి తరాలకు తెలియజేయాలనేది తన లక్ష్యమని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగం గురించి మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలకు తెలంగాణలోని వేలాదిమంది అమరుల ప్రాణాలు గుర్తుకురావడంలేదా? అని ప్రశ్నించారు.
ప్రాణం ఎవరిదైనా ప్రాణమేనని గుర్తించాలన్నారు. తాము చనిపోతే తెలంగాణను చూడలేమని తెలిసీ వేలాదిమంది ఆత్మత్యాగం చేసుకుంటే... సీఎం కిరణ్, చంద్రబాబు, జగన్, టీజీ వెంకటేష్ లాంటి వారు బతికుండి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రక్రియను మూడున్నరేళ్లు ఆలస్యంగా మొదలుపెట్టిన సోనియాగాంధీ నిర్లక్ష్యం వెయ్యి మందికిపైగా ప్రాణాలను బలితీసుకుందని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతంగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.