సంస్థానాల కాలానికి తిరోగమనం | Back to ages | Sakshi
Sakshi News home page

సంస్థానాల కాలానికి తిరోగమనం

Published Thu, Aug 29 2013 1:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

సంస్థానాల కాలానికి తిరోగమనం

సంస్థానాల కాలానికి తిరోగమనం

విశ్లేషణ: తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనదనే ఆరోపణతో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణవాదులు ఉద్యమం చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ వెల్లడించిన వాస్తవాలను వారి ముందు ఉంచితే చాలు, వారు అభివృద్ధి మాట ఎత్తడం మానేస్తున్నారు!  తమ ఉద్యమానికి తెలంగాణ సెంటిమెంటే కారణమని అంటున్నారు!
 
 తెలంగాణ ‘సెంటిమెంటు’ను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని తెలంగాణవాదులు చేస్తున్న వాదన చివరికి ఐదు వందల రాష్ట్రాలతో కూడిన భారతదేశానికి దారి తీస్తుంది. అసఫ్‌జాహీలు దక్కన్ ప్రాంతాన్ని రెండు వందల ఏళ్లకు పైగా (1724-1948) పాలించారు. వారి పాలన తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సాంస్కృతిక విభజనను సృష్టించింది. బ్రిటిష్ పాలనలో ఉన్న కోస్తా, రాయలసీమ జిల్లాల తెలుగు ప్రజలు ఆర్థిక, విద్య, సాంస్కృతిక  రంగాలలో అభివృద్ధి చెందారు. కాగా, నిజాం ప్రాంతంలోని వారి సోదరులు కాలంచెల్లిన ఫ్యూడల్ రాచరిక పరిపాలన కింద దోపిడీకి గురై వెనుకబడిపోయారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఉర్దూ లేదా మరాఠీ భాషలలోనే సాగుతుండటంతో తెలుగు భాష అణచివేతకు గురైంది. ప్రధానంగా ఉత్తరాదికి చెందిన భాష, సంస్కృతులు, పాకశాస్త్రం కలగలిసి ‘హైదరాబాదీ సంస్కృతి’ చలామణిలోకి వచ్చింది. స్థానిక భాష, సంస్కృతులకు అందులో దాదాపు స్థానం లేదు. ఇందూరు, నిజామాబాద్‌గా, పాలమూరు మెహబూబ్‌నగర్‌గా, ఎలగందల కరీంనగర్‌గా మారగా, హైదరాబాద్ సమీపంలోని ఈదులకంటి గ్రామం ఇందర్-కరన్‌గా మారింది.
 
 తెలంగాణ చరిత్ర కుతుబ్-షాహీలతో మొదలై, అసఫ్‌జాహీలతో ముగిసిపోయిందన్న భావనను కలుగజేసే ప్రయత్నం జరిగింది! ఒక్క యజ్దానీ దక్కన్ చరిత్రను మినహాయిస్తే, ప్రాచీన  తెలంగాణ చరిత్రను సమగ్రంగా చెప్పడానికి శ్రద్ధతో కూడిన ప్రయత్నమేదీ జరగలేదు. కాకతీయుల పాలన గురించి కొంత తెలుసు. అయితే శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యుల పాలన మాటేమిటి? బౌద్ధ, జైన వారసత్వం పట్ల ఏమైనా గుర్తింపు ఉన్నదా? ఇంచుమించుగా అసఫ్‌జాహీలంత పురాతన సంస్థానాల చరిత్ర గురించి తెలిసింది స్వల్పం. అవన్నీ నిజాం పాల నను సుదీర్ఘకాలం ప్రతిఘటించినవే. స్థానిక ప్రజల భాష, సంస్కృతులకు రక్షణను కల్పించే షరతుపై చివరికి అవి నిజాం ఆధిపత్యాన్ని ఆమోదించాయి. అయినా అవి చాలా వరకు తమ స్వయంప్రతిపత్తిని నిలుపుకుని తెలుగు భాష,  సంస్కృతులను ప్రోత్సహించాయి. నిజాం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థలు పటిష్టమైనవి కాకపోవడంతో రోహిల్లాలు, తదితర బందిపోటు ముఠాలు నిజాం ప్రాంతాలను కొల్లగొట్టి బీభత్సం సృష్టిస్తుండేవి. సంస్థానాలు అలాంటి విపత్తుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాయి.
 
 అధికారిక డాక్యుమెంట్లన్నీ ప్రజలదికాని పరాయి భాషలోనే ఉండేవి. గ్రామ రికార్డులు మాత్రమే కొంత వరకు అందుకు మినహాయింపు. దీనినే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సంస్కృతిగా ప్రచారం చేశారు. అదే గనుక కాస్మోపాలిటన్ సంస్కృతి అయితే అది కుతుబ్‌షాహీల నాటి కాస్మోలిటన్ సంస్కృతి మాత్రం కాదు. కుతుబ్ షాహీల హయాంలో స్థానిక  భాష, సంస్కృతులకు సముచిత స్థానం ఉండేది. ఆ కారణంగానే వారు ఔరంగజేబు ఆగ్రహాన్ని చవి చూడాల్సివచ్చింది.
 
 ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలన్నీ ఉర్దూలోనే సాగేవి. ప్రభుత్వాధికారులంతా ఉత్తర భారతం నుంచి వచ్చినవారే. ముల్కీ ఉద్యమం సాగి, 1919లో నిజాం పాలనకింద ముల్కీ నిబంధనలు రూపొందే వరకు అదే పరిస్థితి కొనసాగింది. ఉర్దూ, మరాఠీ మాట్లాడే ప్రజలు హైదరాబాద్ తమదేనని భావించేవారు. ఆనాటికి తెలుగు భాషకు దక్షిణాపథంలో సాంస్కృతికంగా సుసంపన్నమైన భాషగా గుర్తింపు ఉంది. అయినా వారు దాన్ని ఏ మాత్రం ప్రాధాన్యం లేనిదిగా భావించేవారు. తెలుగువారి ఇళ్లల్లో వాడుక భాషగానూ, సేవకులకు ఆజ్ఞలను జారీ చేసే భాషగానూ మాత్రమే అర్హమైనదని భావించేవారు! రాజబహదూర్ వెంకట్రామ్‌రెడ్డి 1930లలో హైదరాబాద్‌లో బాలి కల తెలుగు పాఠశాలను ప్రారంభించారు. విద్యాబోధన ఉర్దూ లేదా ఇంగ్లిషు భాషలలో లేని కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ పాఠశాలకు గుర్తింపును ఇవ్వడానికి నిరాకరించింది.
 
 వెంకట్రామ్‌రెడ్డి హైదరాబాద్ కొత్వాల్ హోదా సైతం అందుకు దోహదపడలేదు. దీంతో ఆయన పూణెలో మహర్షి కార్వే ఏర్పాటు చేసిన మహిళా విద్యాపీఠం నుంచి గుర్తింపును తెచ్చుకోవాల్సివచ్చింది. ఆ సెంటిమెంటునే ప్రతిధ్వనింపజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్... తెలుగు ప్రజలు తమకు సొంత రాష్ట్రం కావాలనుకుంటే హైదరాబాద్‌నుగాక వరంగల్‌ను రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు! సాంస్కృతిక అణచివేత చెర ను తప్పించుకోడానికి  హైదరాబాద్ తెలుగువారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న సమయం కూడా అదే.
 
 ఎవరికి ఎలాంటి పక్షపాతాలు ఉన్నాగానీ, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా విలీనమైన తర్వాత విద్య, వైద్య రంగాలలో, ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందనేది ఎవరూ కాదనలేని వాస్త వం. సమగ్ర రాష్ట్రంగా విలీనమైన తర్వాతనే తెలంగాణలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దృశ్య కళలలో, జానపద సంప్రదాయాల పునరుద్ధరణలో తెలంగాణ రాష్ర్టంలోనే అగ్రగామిగా ఉంది. గతించిపోయిన పేరిణి, చిందు వంటి కళా రూపాలకు ప్రాణం పోసి, ప్రాచుర్యంలోకి తేవడం సైతం జరుగుతోంది. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, పాపన్నపేట, సీర్నపల్లి, సంస్థానాలలో వికసించిన సాహిత్యాన్ని సేకరించి, పునర్ముద్రించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలోని తెలుగు వాడుక భాషే అత్యున్నత స్థాయికి చెందినది. తెలంగాణ జానపద సాహిత్యంలో కనిపించే పల్లెవాసుల వాడుక భాషలోని సంస్కృతం కల వని అచ్చ తెలుగు మాధుర్యం భాషాభిమానులను అల రిస్తుంది.
 
 రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజ లలోని భూస్వామ్యేతర విలువల కారణంగానూ, తెలంగాణలో నిలకడగా కొనసాగిన వామపక్ష ఉద్యమాల ఫలితంగానూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దుచేయడం మూలంగానూ తెలంగాణలో పెనుమార్పులు సంభవించాయి. ఫలితంగా 1950ల వరకు కొనసాగిన భూస్వామ్య విధానపు అవశేషాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. కుతుబ్‌షాహీల కాలం నుంచి తెలుగు ప్రజల ఆవాస ప్రాంతానికి ఉన్న చారిత్రక నామం తెలంగాణ! సమగ్ర తెలుగు రాష్ట్ర నిర్మా ణకర్తలైన పెద్దలు ఆ చారిత్రక నామాన్ని విస్మరించి, విలీ నానంతర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి పెద్ద తప్పు చేశారు.  
 
 దానిని అవకాశంగా తీసుకొని తెలంగాణ ఉద్యమ నేతలు ఊహాజనితమైన సాంస్కృతిక, భాషాపరమైన విభజనలను సృష్టించడానికి ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలు చేశారు. తెలుగు నేలను విభజించి, ఎక్కడా లేని రెండు ప్రాంతాలుగా తెలంగాణ, సీమాంధ్ర అని పిలుస్తున్నారు. వెయ్యేళ్లకు పైగా తెలుగు భాషకు ఉన్నది ఒకటే లిపి. అలాగే వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం కూడా ఉమ్మడిదే.
 
 చారిత్రక తప్పిదాలను సరిదిద్దుకొని, వివిధస్థాయిలలో సమైక్యత సాధ్యమవుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తడం ఆసక్తికరం. చిన్న, పురా తన పట్టణమైన హైదరాబాద్ మహానగరంగా మారడమేగాక, అంతర్జాతీయస్థాయిని అందుకోడానికి వడివడిగా సాగుతోంది. హైదరాబాద్‌లోనూ, ఆ పరిసరాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరిగిన ఫలితంగా యువత తీవ్రవాదం పట్ల విముఖత చూపుతోంది. అన్నిటికీ మించి నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాలు వ్యవసాయంలో, ఆహార ఉత్పత్తిలో కొన్ని కోస్తాంధ్రజిల్లాలను మించి అభివృద్ధి చెందాయి!
 
 తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనదనే ఆరోపణతో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణవాదులు ఉద్యమం చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ వెల్లడించిన వాస్తవాలను వారి ముందు ఉంచితే చాలు, వారు అభివృద్ధి మాట ఎత్తడం మానేస్తున్నారు! తమ ఉద్యమానికి తెలంగాణ సెంటిమెంటే కారణమని అంటున్నారు! ‘సెంటిమెంట్లను’ గౌరవించాలని అనుకునేట్టయితే భారత దేశం, ఒకప్పుడు 500 సంస్థానాల సమూహంగా ఉన్న కాలానికి తిరోగమించాల్సి ఉంటుంది! అలాగే సెంటిమెం టు కారణంతో రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే, చెంచు, కోయ ఆదివాసుల మాతృభూమిని విభజించడానికి వీల్లేదు. వారి ఆవాసాలు ఇటు తెలంగాణలోనూ, అటు కోస్తాంధ్రలోనూ కూడా విస్తరించి ఉన్నాయి. మనం గోం డుల సెంటిమెంట్లను గౌరవించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి గోండ్లు  కాని ఇతరులందరమూ వెళ్లిపోవాల్సిందే. ఎందుకంటే అది గోండుల మాతృభూమి. లంబాడాలు పెద్ద సంఖ్యలో శతాబ్ద కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. వారిని కూడా మనం అక్కడి నుంచి పంపేయాల్సి ఉంటుంది!
 
 జిల్లా పరిషత్తులకు స్వయం పాలనాధికారాలను ఇవ్వాలని రాజ్యాంగం చేసిన ప్రతిపాదనలను అమలుపరచి ఉంటే, ఇలాంటి ఉప ప్రాంతీయ సెంటిమెంట్లను నివారించగలిగేవారం. ఏదో ఒక సాకుతో కొన్ని రాష్ట్రాలు ఆ రాజ్యాంగ నిర్దేశనను అమలుచేయకుండా తప్పించుకున్నాయి. జిలా ్లపరిషత్తులకు ఉద్దేశించిన అధికారాలను, వనరులను తామే అట్టిపెట్టుకున్నాయి. దురదృష్టవశాత్తూ అలాంటి రాష్ట్రాలలో అంధ్రప్రదేశ్‌దే ప్రథమ స్థానం. ప్రాం తీయ సెంటిమెంట్లను ఉపయోగించుకొని తతెత్తున్న విభజన ఉద్యమాల రూపంలో అందుకు మూల్యాన్ని చెల్లిం చాల్సి వస్తోంది!  
 
 నేడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆందోళన చేస్తున్న పార్టీ ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది. గత రెం డు ఎన్నికల్లోనూ అది ఒంటరిగా పోటీచేయలేక, రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలలో ఏదో ఒక దానితో జతకట్టక తప్పలేదు. అయినాగానీ తెలంగాణ ప్రజలందరి తరఫున మాట్లాడుతున్నానని చెప్పుకునే ప్రజ్ఞ దానిది! రాష్ట్రాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించాలని విశ్వసిస్తున్నవారిని... అదే డిమాండుతో రాబో యే ఎన్నికల బరిలోకి దిగి, ప్రజా తీర్పును గౌరవించమని చెప్పండి. నిర్ణయరాహిత్యానికి, వివేచనారాహిత్యానికి ఆల వాలమైన ఢిల్లీ దర్బారే ఇన్నేళ్లుగా ఈ ఉద్యమాన్ని పెంచిపోషించింది. ఉద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజలను ఆకట్టుకోవడం, ఢిల్లీ దర్బారులో లాబీయింగ్ చేయడం ప్రజాభీష్టానికి ప్రత్యామ్నాయం కాజాలవు. వారు ప్రజాస్వామిక ప్రక్రియను గౌరవించి, అనుసరించడం నేర్చుకోవడం మంచిది.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement