చేటు చేసే ముస్లింవాదుల మౌనం | muslim activists follows as an silent to harm | Sakshi
Sakshi News home page

చేటు చేసే ముస్లింవాదుల మౌనం

Published Sun, Jul 17 2016 11:45 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

muslim activists follows as an silent to harm

ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం  ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.  అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు. స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు ఆ పరిస్థితి లేదు. వారు తెలుగులో రాయడం, అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండింది.  కానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
 
 ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి. తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి. అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం, విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తించడం లాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.
 
 నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది. కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి. మొత్తంగా ఇండియన్ ఇస్లాం(లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు. ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్‌లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. చస్తే ఆ శవంపై కాఫిర్‌ల నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు. వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది.  ఈ నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.
 - స్కైబాబ
 9885420027

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement