తీవ్ర ఆరోపణలు చేసిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు.
‘‘ హిందూ కార్యక్రమంలో ముస్లింల మతమార్పిడి తంతు జరగబోతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తెస్తూ ఒక లేఖ రాశా. ఇక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దే’’ అని బరేల్వీ అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజాసామగ్రిని కొనుగోలుచేయాలని రాబోయే భక్తులకు గతంలో అఖిలభారతీయ అఖాడ పరిషత్ పిలుపునిచ్చి తరుణంలో భిన్నమైన ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం.
కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో కొన్ని హిందూ సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ముస్లిం, ఇతర మతాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ మరోలా స్పందించారు. ‘‘ముస్లింలు కుంభమేళా పరిసరాలకు వెళ్లినా ముస్లింలకు వచ్చే నష్టమేమీలేదు. ఒక ప్రార్థనా స్థలానికి వెళ్లినంత మాత్రాన ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకునేంత బలహీన స్థాయిలో ఇస్లాం లేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment