Conversions issue
-
కుంభమేళాలో ముస్లింల మతమార్పిడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ‘‘ హిందూ కార్యక్రమంలో ముస్లింల మతమార్పిడి తంతు జరగబోతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తెస్తూ ఒక లేఖ రాశా. ఇక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దే’’ అని బరేల్వీ అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజాసామగ్రిని కొనుగోలుచేయాలని రాబోయే భక్తులకు గతంలో అఖిలభారతీయ అఖాడ పరిషత్ పిలుపునిచ్చి తరుణంలో భిన్నమైన ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో కొన్ని హిందూ సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ముస్లిం, ఇతర మతాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ మరోలా స్పందించారు. ‘‘ముస్లింలు కుంభమేళా పరిసరాలకు వెళ్లినా ముస్లింలకు వచ్చే నష్టమేమీలేదు. ఒక ప్రార్థనా స్థలానికి వెళ్లినంత మాత్రాన ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకునేంత బలహీన స్థాయిలో ఇస్లాం లేదు’’ అని అన్నారు. -
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
బెళగావి(కర్ణాటక): వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసన సభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా ‘కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు–2021’ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జేడీ(ఎస్) సైతం బిల్లును తప్పుబట్టింది. ఈ తరహా చట్టం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి పేర్కొన్నారు. బిల్లు.. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్భలంతో, తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడిలను అడ్డుకుంటుంది. చట్టవ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. -
మత మార్పిళ్లపై దద్దరిల్లిన రాజ్యసభ
న్యూఢిల్లీ : మత మార్పిడి అంశంపై రాజ్యసభ సోమవారం కూడా అట్టుడికింది. బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు మత మార్పిడి బిల్లుపై చర్చకు పట్టుపట్టారు. ఛైర్మన్ పొడియం వద్ద ప్రతిపక్ష సభ్యులు బైఠాయించారు. మత మార్పిడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత సభ ప్రారంభంకాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఛైర్మన్ తిరిగి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.