ఏపీఎన్జీవోల సభ జరగనీయండి: డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సభకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణవాదులను కోరారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించకుండా, విభజన వల్ల ఉద్యోగులకు వచ్చే సమస్యల పరిష్కారానికి మాత్రమే సభను వేదికగా ఉపయోగించుకోవాలని ఏపీ ఎన్జీవోలకు సూచించారు. టీఎన్జీవోల సభకు కూడా అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవోలు, టీఎన్జీవోలతో ప్రభుత్వం మాట్లాడి చెరో తేదీని కేటాయిస్తే బాగుండేదన్నారు. హైదరాబాద్ మెట్రో అథారిటీ డెవలప్‌మెంట్ (హెచ్‌ఎండీఏ) పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, సీమాంధ్రకు ఒరిగేది కూడా ఏమీ ఉండదని అన్నారు. 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని, ఈ ప్రక్రియలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కూడా భాగస్వాములను చేసిందని తెలిపారు.
హైకమాండ్‌తో సీఎం ఏం చెప్పారో తనకు తెలియదని, అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఆయన వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. విభజన జరిగితే సీఎం కాంగ్రెస్‌ను వీడి, వేరే పార్టీలోకి వెళతారని తాను అనుకోవడంలేదన్నారు. రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంగీకరించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటీకీ, ఒక్కోసారి రాజ్యాంగ ప్రక్రియను కొనసాగించాల్సి వస్తుందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా విభజన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విభజనపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రేపు ఇంకేమి మాట్లాడతారోనని ఎద్దేవా చేశారు.