
రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్
హింసాత్మకంగా మారిన లేహ్ బంద్
బీజేపీ ఆఫీసుకు, వాహనాలకు నిప్పు, పోలీసుస్టేషన్‌పై దాడి
విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు
వారిని చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
నలుగురి మృతి... 70 మందికి గాయాలు
లేహ్: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్ లో ఒక్కసారిగా నిప్పు రగిలింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు.
సీఆర్‌పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు.
15 రోజులుగా నిరాహార దీక్షలు
ఒకప్పుడు ఉమ్మడి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమైన లద్దాఖ్ 2019 ఆగస్టు 5న ఆరి్టకల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచి్చంది. ఇక్కడ శాసనసభ కూడా లేదు. జమ్మూకశ్మీర్ నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని అప్పట్లో లద్దాఖ్ ప్రజలు స్వాగతించారు. కానీ, రాష్ట్ర హోదా కావాలన్న ఆకాంక్ష వారిలో ఇటీవల మొదలైంది.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతోపాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో లేహ్ అపెక్స్ బాడీ(ఎల్‌ఏబీ)కి సంబంధించిన యువజన సంఘం పోరాడుతోంది. లద్దాఖ్ పర్యావరణాన్ని, సహజ వనరులను, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి గిరిజనుల హక్కులను కాపాడుకొనేందుకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు అవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్ర హోదా కోసం ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుచుక్ సహా 15 మంది ఈ నెల 10వ తేదీన నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి: ఒమర్
తాజా పరిణామాలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ లద్దాఖ్ ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. వారి అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం దగా చేసిందని, అందుకే రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కేంద్రం తెలుసుకోవాలన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం తాము శాంతియుతంగా పోరాడుతున్నామని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా కల్పించాల్సిందేనని ఒమర్ అబ్దుల్లా తేలి్చచెప్పారు.
ఏమిటీ ఆరో షెడ్యూల్?
రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరంలో గిరిజనులకు ప్రత్యేక రక్షణలు లభిస్తున్నాయి. అటానమస్ జిల్లా కౌన్సిళ్ల ద్వారా స్వయం ప్రతిపత్తి దక్కుతోంది. భూములు, అడవులు, స్థానిక పాలనపై గిరిజనులే చట్టాలు చేసుకోవచ్చు. గిరిజనులు హక్కులు, సంప్రదాయాలు, స్వయం పాలనను కాపాడేందుకు ఆరో షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. లద్దాఖ్‌లో గిరిజనుల జనాభా ఏకంగా 97 శాతం ఉంది. తమ హక్కులు, స్వయం పాలన కోసం ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని లద్దాఖ్ ప్రజలు పట్టుబడుతున్నారు.

ఇది జెన్–జెడ్ విప్లవం: వాంగుచుక్
రాష్ట్ర హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఎల్‌ఏబీతోపాటు కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్(కేడీఏ) సభ్యులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ 6న మరోదఫా చర్చలు జరగాల్సి ఉంది. ఇంతలోనే హింస చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నిరాహార దీక్షలు కొనసాగుతుండడం, మరోవైపు లద్దాఖ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో అక్టోబర్ 6 కంటే ముందే చర్చలు జరపాలని ఆందోళనకారులు తేలి్చచెప్పారు. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌ను విస్తరించడం, లేహ్, కార్గిల్‌కు ప్రత్యేక లోక్‌సభ స్థానాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కేంద్రం తక్షణమే తమతో చర్చించాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ బుధవారం లేహ్ బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో వందలాది మంది యువత లేహ్‌కు తరలివచ్చారు. తొలుత బీజేపీ ఆఫీసు వద్ద గుమికూడారు. ఆఫీసుకు నిప్పుపెట్టారు.
ఫర్నిచర్‌ను దహనం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో హింస మొదలైంది. తాజా హింసాకాండ నేపథ్యంలో సోనమ్ వాంగుచుక్ తన 15 రోజుల నిరాహార దీక్షను బుధవారం విరమించారు. ఘర్షణలకు దూరంగా ఉండాలని తన అనుచరులకు సూచించారు. ప్రజలపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలే లద్దాఖ్ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వాంగుచుక్ వెల్లడించారు. ఇది జెన్–జెడ్ విప్లవం అని తేలి్చచెప్పారు. ఇన్నాళ్లూ శాంతియుతంగా పోరాడినా ఎలాంటి ఫలితం లేకపోవడం వల్లే యువత ఆగ్రహానికి గురై హింసకు దిగారని చెప్పారు.