ఊరూరా.. రేలారేలా.. తెలంగాణలో ఆనంద హేల | Celebrations across Telangana | Sakshi
Sakshi News home page

ఊరూరా.. రేలారేలా.. తెలంగాణలో ఆనంద హేల

Published Sat, Dec 7 2013 4:47 AM | Last Updated on Sat, Aug 11 2018 7:30 PM

ఊరూరా.. రేలారేలా.. తెలంగాణలో ఆనంద హేల - Sakshi

ఊరూరా.. రేలారేలా.. తెలంగాణలో ఆనంద హేల

సాక్షి, నెట్‌వర్క్ :  పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో శుక్రవారం తెలంగాణలోని పది జిల్లాల వ్యాప్తంగా తెలంగాణవాదులు, జేఏసీలు, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, వాటి అనుబంధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పలు జిల్లాల్లో సోనియా, సుష్మాస్వరాజ్, కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
 
 కరీంనగర్‌లో జిల్లాలో తెలంగాణ సంబరాలు మిన్నంటాయి. సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొంటూ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు వేడుకలు జరిపారు. సోనియా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సుల్తానాబాద్‌లో ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సింగరేణి కార్మికులు  నృత్యాలు చేశారు.
 
 ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్, టీజేఏసీ, సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, న్యాయవాదులు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లలో కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించి బాణ సంచా పేల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. వరంగల్ జిల్లా పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. వరంగల్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పాలాషేకం చేశారు. హన్మకొండలో న్యాయవాదులు అమరవీరులకు నివాళులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండలో ఆ పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
 
 నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పాలాషేకం చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విజయోత్సవాలను నిర్వహించారు. టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట, తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండు కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు.
 
 ఖమ్మం, కూసుమంచిలలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కూసుమంచిలో సోనియాగాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఖమ్మం జడ్పీ సెంటర్‌లో ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. భధ్రాచలం, కొత్తగూడెం, వైరా, మణుగూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు, జేఏసీ అధ్వర్యంలో స్వీట్లు పంచుతూ ర్యాలీలు నిర్వహించారు.
 బీజేపీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్ చొరవతోనే పదిజిల్లాల తెలంగాణ వచ్చిందంటూ ఆ పార్టీలు నేతలు నల్లగొండల్లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండలో సోనియగాంధీకి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.  జిల్లాలో పలుచోట్ల బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు.

 మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి ఆధ్వర్యంలో, దేవరకద్రలో ఆటో యూనియన్ నాయకులు ‘జై తెలంగాణ’ నినాదాలతో స్వీట్లు పంపిణీ చేశారు. గద్వాలలో సోనియా, రాహుల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలంపూర్, అచ్చంపేటలో సంబరాలు హోరెత్తాయి. వనపర్తి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్దగూడెం తిరుమలనాథ స్వామి ఆలయంలో మోకాళ్లపై నడుస్తూ  మొక్కులు చెల్లించుకున్నారు.
 
 రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాండూరు, చేవెళ్ల, పరిగి, శంషాబాద్, వికారాబాద్, మొయినాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో తెలంగాణవాదులు సంబరాలు జరుపుకొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ జై తెలంగాణ నినాదాలు చేశారు. పరిగిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.  మెదక్ జిల్లా రామాయంపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు, కూలీలకు, దుకాణదారులకు మిఠాయిలు పంచి పెట్టారు. సంగారెడ్డి, జోగిపేట, నర్సాపూర్‌ల్లోనూ తెలంగాణవాదులు బాణసంచా కాల్చి సందడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement