'దయచేసి పర్యటనకు ఆటంకం కలిగించవద్దు'
ఖమ్మం : మూడు ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. రైతుల కష్టాలు తెలుసుకోవడానికే వస్తున్నాని..దయచేసి తన పర్యటనకు ఆటంకం కలిగించవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 90 శాతం పత్తి, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతాలోనే దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న విజయమ్మ గురువారమిక్కడ నేలకొండపల్లిలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే..ఒక్క తెలంగాణలోనే ఐదుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయమ్మ చెప్పారు. 28 వేల మగ్గాలు పనికి రాకుండా పోయాయని తెలిపారు. గత నాలుగేళ్లుగా రైతులకు ఎక్కడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. బతకడానికే కష్టంగా ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. 2010 - 13 మధ్య 7 వందల కోట్ల రూపాయలు పంట నష్టమని చెప్తున్న పాలకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతామన్నారు.