ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్‌ విజయమ్మ | YS VIjayamma Speech at YSRCP Plenary 2022 | Sakshi
Sakshi News home page

YS VIjayamma Speech: జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు

Published Fri, Jul 8 2022 12:36 PM | Last Updated on Fri, Jul 8 2022 3:48 PM

YS VIjayamma Speech at YSRCP Plenary 2022 - Sakshi

సాక్షి, తాడేపల్లి: దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్సార్‌ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారని అన్నారు.

ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు
ఆనాడు అధికార శక్తులన్నీజగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్‌ పొమ్మనలేక పొగపెట్టింది. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్‌ జగన్‌ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్‌ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు. 

యువతకు రోల్‌మోడల్‌ వైఎస్‌ జగన్‌
వైఎస్‌ జగన​ మాస్‌ లీడర్‌. జగన్‌ యువతకు రోల్‌మోడల్‌. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది.  మీ బిడ్డల్ని జగన్‌ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్‌ అందిస్తారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల​ అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్‌ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.

షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా
వైఎస్సార్‌ బిడ్డగా షర్మిల వైఎస్సార్‌టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్‌ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్‌ జగన్‌ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో  ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి.  వైఎస్సార్‌ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్‌ గెలుస్తారు అని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

తల్లిగా జగన్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది
వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు ప్రస్తుతం నా అవసరం ఉంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈనిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు, మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది అని వైఎస్‌ విజయమ్మ తెలిపారు.

చదవండి: (CM YS Jagan Speech: మన పార్టీ సంఘర్షణ 13ఏళ్ల కింద మొదలైంది) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement