ప్రభంజనం... | muncipal campaign ysrcp president ys vijayamma | Sakshi
Sakshi News home page

ప్రభంజనం...

Published Wed, Mar 26 2014 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

సత్తుపల్లిలో రోడ్ షోకు హాజరైన జనవాహిని - Sakshi

సత్తుపల్లిలో రోడ్ షోకు హాజరైన జనవాహిని

  సాక్షి, ఖమ్మం:  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో రెండురోజులు పర్యటించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారం ఆద్యంతం జనాభిమానం మధ్యే సాగింది. మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రతిచోట జనంపోటెత్తడంతో రోడ్‌షో విజయవంతమైంది. మధిర మండలం శివాపురం గ్రామానికి సోమవారం సాయంత్రం 4.45 గంటలకు చేరుకుని అక్కడినుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయమ్మ మంగళవారం రాత్రి సత్తుపల్లి రోడ్‌షోతో ముగించారు.   మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో రెండురోజులు రోడ్‌షో నిర్వహించి... మున్సిపల్ బరిలో వైఎస్సార్ సీపీ, సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని  పిలుపునిచ్చారు.

 అలాగే జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ,అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కదం తొక్కాలన్నారు. రోడ్‌షో పొడవునా మహిళలు, కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత ఎదురేగి ఆమెకు స్వాగతం పలికారు.  తొలిరోజు మధిర, ఇల్లెందులో...,  రెండో రోజు కొత్తగూడెం, సత్తుపల్లిలలో వెల్లువలా జనం తరలివచ్చి విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు.   ఆమె ప్రసంగంలో వైఎస్‌ఆర్ పేరును ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేస్తూ  మహానేతను గుర్తు చేసుకున్నారు. మండుటెండలో సైతం మంగళవారం ఆమె కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించగా త్రీటౌన్‌సెంటర్, రైతుబజార్, పోస్టాఫీస్ సెంటర్‌లకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కొత్తగూడెం, చంద్రుగొండ, పెనుబల్లి మీదుగా ఆమె పర్యటన సాయంత్రం 5గంటలకు సత్తుపల్లి చేరుకుంది.

 సత్తుపల్లిలో జనజాతర....

 మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయమ్మకు సత్తుపల్లి ప్రజలు ఘనస్వాగతం పలికారు. వెంగళరావు నగర్ నుంచి మొదలయిన  రోడ్‌షో హనుమాన్ నగర్ వరకు జనజాతరగా సాగింది. రింగ్‌సెంటర్‌లో ఆమె ప్రసంగం ఉండటంతో సాయంత్రం 4గంటలకే జనంతో కిక్కిరిసి పోయింది. వెంగళరావునగర్, విరాట్ నగర్, జలగం నగర్. గాంధీనగర్, గవర్నమెంట్ ఆస్పత్రి, ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్ ఏరియా వరకు ఎటు చూసినా జనం వేల సంఖ్యలో బారులు తీరారు. రింగ్‌రోడ్ సెంటర్‌లో ఆమె ప్రసంగిస్తూ శీనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నప్పుడు జనం ఒక్కసారిగా జేజేలు పలికారు. జనాభిమానం ఉప్పొంగడంతో సత్తుపల్లిలో రోడ్‌షో రెండు గంటలపాటు జరిగింది. రోడ్‌షో జరిగినంత సేపూ.. రింగ్ సెంటర్ నుంచి వేంసూరు రోడ్, అశ్వారావుపేట రోడ్, ఖమ్మం రోడ్ జనంతో కిక్కిరిశాయి.

 వైఎస్ వల్లే కేటీపీఎస్ 4వ దశ ...:

 రోడ్‌షోలో విజయమ్మ ప్రసంగిస్తూ....దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుల, మత, ప్రాంతీయ అభిమానాలను చూపకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని  అన్నారు.  కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 4వ దశ 500 మెగావాట్‌ల విద్యుత్‌ను వైఎస్ తీసుకువచ్చారని అన్నారు. జిల్లా ప్రజలపై వైఎస్ ఎప్పుడూ ఆప్యాయత, అభిమానాలు చూపేవారని చెప్పారు. చంద్రబాబు నాయుడు పాలన కాలంలో రైతులు బషీర్‌బాగ్‌లో విద్యుత్ పోరాటం చేస్తే వారిపై కాల్పులు జరిపించాడని.. ఈదుర్ఘటనలో మృతిచెందిన ముగ్గురిలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరున్నారన్నారు. ఆకుటుంబాలను చంద్రబాబు పరామర్శించాల్సిందిపోయి కాల్పులు జరిపిన పోలీసులను అభినందించారని.. ఇది బాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.

 మీ ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను...

 ‘ఖమ్మం జిల్లా ప్రజలు మా కుటుంబంపై చూపిస్తున్న ఆప్యాయతను, ప్రేమను, ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేము. మీ కష్టాలు, బాధలు సంతోషాలలో జగన్ పాలుపంచుకుంటారు.. ధైర్యంగా ఉండండి..’ అని ఆమె భరోసానిచ్చారు. వైఎస్ కుటుంబం ఎప్పటికీ ఈజిల్లాను మరువదన్నారు. ఈపర్యటనలో ఆమె వెంట వైఎస్సార్ సీపీ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి,  కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, ఎడవల్లి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, బీసీసెల్ జిల్లా  అధ్యక్షుడు తోట రామారావు, నేతలు భీమా శ్రీధర్, జాలె జానకిరెడ్డి, శివారెడ్డి,  సత్తుపల్లి మున్సిపల్ కన్వీనర్ కోటగిరి మురళీకృష్ణారావు, నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి, మౌలాలి, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement