
వైఎస్ లేని లోటు జగన్ తీరుస్తాడు
విశాఖ వైఎస్సార్ జనభేరి రోడ్‌షోలో విజయమ్మ
విశాఖపట్నం: ‘‘దివంగత మహానేత భార్యగా.. జగన్‌బాబు తల్లిగా.. మీలో ఒకరిగా ఒక్కమాట చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి మననుంచి వెళ్లిపోయారు. కొడుకు, కూతురు ఉన్నా.. ఆయన లేని లోటు నాకు తీరేది కాదు. కానీ ఆ మహానేత వారసునిగా ఆయన ఆశయాల సాధనలో జగన్‌బాబు మీ వెన్నంటి నిలిచి కష్టసుఖాలు పంచుకుని, మీకు ఆయన లేని లోటు తీర్చుతాడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మ భరోసా ఇచ్చారు. పార్టీఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ లోక్‌సభ పరిధిలో నగరంలోని తూర్పు, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాల్లో ఆమె శనివారం వైఎస్సార్ జనభేరి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జంక్షన్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతిగుండె ఒక్కటవ్వాలని, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు దివంగత నేతను ఒక్కసారి గుర్తు చేసుకుని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల వేళ వచ్చిపోయేదాన్ని కాదని.. మీలో ఒకరిగా ఉంటూ ప్రతీ సమస్యనూ పరిష్కరిస్తానని ఆమె స్థానికుల్లో భరోసా నింపారు. సింహాచలం దేవాలయ భూసమస్య, కాలుష్యం, ఐటీ, ఫార్మా కంపెనీలు, పోలవరం ప్రాజెక్టు తదితర స్థానిక సమస్యలపై మాట్లాడినప్పుడు ప్రజల్లో భారీ స్పందన కనిపించింది. ప్రచారంలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖతూర్పు), చొక్కాకుల వెంకటరావు (విశాఖ ఉత్తరం), కోలా గురువులు (విశాఖ దక్షిణం), పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ తదితరులు ఉన్నారు.